ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్... పేకాట అడ్డా | Sakshi
Sakshi News home page

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్... పేకాట అడ్డా

Published Tue, Feb 10 2015 12:56 AM

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పేకాట ఆడుతున్న వారిని అరెస్ట్ చేసి వ్యాన్ లో తరలిస్తున్న దృశ్యం

టాస్క్‌ఫోర్స్ దాడుల్లో బట్టబయలు
52 మంది అరెస్టు
దొరికిన వారిలో రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు
రూ. 12 లక్షలు, 60 సెల్‌ఫోన్లు స్వాధీనం
కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే పీఏ పర్యవేక్షణలో వ్యవహారం!


హైదరాబాద్: ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన చోట వ్యసనాలు రాజ్యమేలుతున్నాయి.. ఎమ్మెల్యేలు నివాసముండే చోట విచ్చలవిడి ‘వ్యవహారాలు’ సాగిపోతున్నాయి. ఇప్పటికే ‘మందు’ బాబులకు అడ్డాగా మారిం దనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్... తాజాగా పేకాట కేంద్రంగా మారింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి చేసిన ఆకస్మిక దాడుల్లో ఈ వ్యవహారం బయటపడింది. పేకాట ఆడుతున్న 52 మందిని ఈ దాడుల్లో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 12 లక్షల నగదు, 60 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

రిక్రియేషన్ ముసుగులో నడుస్తున్న పేకాట క్లబ్బులను రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలల కింద మూసివేసింది. దీంతో ఈ జూదానికి అలవాటు పడినవారు కొత్త కొత్త అడ్డాలను వెతుక్కుంటున్నారు. కొందరైతే ఏకంగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే కొంత కాలం నుంచి గుట్టుగా పేకాట నిర్వహిస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని 707, 708 ఫ్లాట్‌లలో పేకాట ఆడుతున్న 52 మందిని పట్టుకున్నారు.

పేకాట రాయుళ్ల కోసం ఇక్కడ ప్రత్యేక భోజన ఏర్పాట్లు, ఆడేందుకు ప్రత్యేక కుర్చీలు సైతం ఏర్పాటు చేసి ఉండడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ ఫర్నిచర్‌ను సైతం సీజ్ చేశారు. పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్, రంగారెడ్డి, విజయవాడ ప్రాంతాలకు చెందిన ఆయా పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది.

కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేకు పీఏగా పనిచేస్తున్న నర్సింహారెడ్డి, కేశవరెడ్డి అనే వ్యక్తుల పర్యవేక్షణలో ఈ వ్యవహారం జరుగుతోందని సమాచారం. ఈ రెండు క్వార్టర్లలోని ప్రజా ప్రతినిధులు ఇటీవలే ఖాళీ చేయడంతో... పేకాట నడిపిస్తున్నారు. కాగా ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం నిందితులను నారాయణగూడ పోలీసులకు అప్పగించామని, పట్టుబడినవారిలో రాజకీయ నేతలు, ప్రముఖులు ఉన్నారని డీసీపీ లింబారెడ్డి తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement