ఐడీసీఎంఎస్‌ డీలా | Sakshi
Sakshi News home page

ఐడీసీఎంఎస్‌ డీలా

Published Sat, Feb 3 2018 4:18 PM

idcms is in  Financial crisis - Sakshi

ఒకప్పుడు ఆర్థిక పరిపుష్టితో కొనసాగిన ఐడీసీఎంఎస్‌  క్రమంగా డీలా పడుతోంది. రూ.కోట్లలో స్థిరాస్తులున్నా.. సంస్థలోని ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించలేని దుస్థితిలో ఉంది. కీలక బాధ్యతల్లో కొందరు అక్రమార్కుల కారణంగానే ఈ స్థితికి చేరిందని సంస్థలోని ఉద్యోగుల నుంచే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల నిర్వహణకే పరిమితమైన ఐడీసీఎంఎస్, వీటి ద్వారా వచ్చే కమీషన్‌తోనే ఖర్చులు వెళ్లదీస్తోంది.


సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ :  సహకార సంఘాలకు వెన్నుదన్నుగా నిలవాల్సిన ప్రభుత్వరంగ సంస్థ ఐడీసీఎంఎస్‌ (ఇందూరు జిల్లా కేంద్ర మార్కెటింగ్‌ సొసైటీ) ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పలు వ్యాపార కార్యకలాపాలు.. రూ.కోట్లలో టర్నోవర్‌.. ఇలా ఒకప్పుడు ఆర్థిక పరిపుష్టితో ఉన్న ఈ సంస్థ ఇప్పుడు కనీసం ఉద్యోగులకు ప్రతినెలా సక్రమంగా జీతభత్యాలు చెల్లించలేని స్థితికి దిగజారింది. పాలకవర్గం పట్టింపులేని ధోరణి ఒకవైపు.. సంస్థ అధికారుల అలసత్వం మరోవైపు.. సంస్థ ప్రతిష్ట మసకబారడానికి కారణమవుతున్నాయి. నిధులు అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగులకు రెండునెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ దాదాపు ఏడాదిన్నర కాలంగా చెల్లించలేదు.. ఇది సంస్థ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. 


ఐడీసీఎంఎస్‌కు జిల్లాలో వివిధ చోట్ల రూ. కోట్లు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. నిజామాబాద్, ఆర్మూర్‌ వంటి పట్టణాల్లో ప్రధాన వ్యాపార కూడళ్లలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, గోదాములు, స్థలాలున్నాయి. వాటి నిర్వహణను అధికారులు గాలికొదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. ఆర్మూర్‌లో 18 షాపుల మడిగెలుండగా వీటి కిరాయి వసూళ్లు అస్తవ్యస్తంగా మారింది. వీటి అగ్రిమెంట్‌ పూర్తై ఏడాది గడుస్తున్నప్పటికీ కేటాయింపుల ప్రక్రియ చేపట్టలేదు. కొన్ని మడిగెలకైతే ఏడాది కాలంగా అద్దె వసూలు చేయకపోవడం గమనార్హం. కొందరు ‘గుడ్‌విల్‌’ పేరుతో పైపైన జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. 


కీలక బాధ్యతల్లో అక్రమార్కులు.. 


పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, సస్పెన్షన్‌ వేటు పడిన అధికారులు ఈ సంస్థలో ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారి కారణంగానే  సంస్థ పరిస్థితి ఇలా మారిందని సంబంధిత వర్గాలు గుసగుసలాడుతున్నాయి. గతంలో ఐడీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ సమీపంలో సూపర్‌మార్కెట్‌ ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా తయారవడంతో ఇందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి దానిని లీజుకు తీసుకుని నడిపారు. ఈ వ్యవహరంలో రూ.లక్షల్లో అవకతవకలు జరిగినట్లు సహకార శాఖ విచారణలో తేలింది. దీంతో సంబంధిత అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇప్పుడు ఈ అధికారే ఈ సంస్థ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.  


‘కొనుగోలు కేంద్రాల’కే పరిమితం.. 


ప్రస్తుతం ఈ సంస్థ ధాన్యం, సోయా కొనుగోలు కేంద్రాల నిర్వహణకే పరిమితమైంది. వీటి ద్వారా వచ్చే అరకొర కమీషన్‌ మొత్తంతో సంస్థ ఖర్చులు వెళ్లదీసుకునే స్థితిలో ఉంది. కొన్ని సీజన్లలో ఫర్టిలైజర్‌ సరఫరా చేశామని అధికారులు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వ హాస్టళ్లకు నిత్యావసర సరుకుల కాంట్రాక్టు పొందిన ఈ సంస్థ వాటి సరఫరాను సక్రమంగా నిర్వహించకపోవడంతో సరుకులు పనికి రాకుండాపోయా యి. నెలలపాటు సరుకులు గోదాముల్లో నిల్వ ఉంచడంతో భారీ మొత్తంలో సంస్థకు నష్టం వాటిల్లింది. 


పలు అవకతవకలు.. 


ఐడీసీఎంఎస్‌ కార్యకలాపాల్లో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్ల కిత్రం ఐడీసీఎంఎస్‌ కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు హమాలీ చార్జీల చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం. నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయకుండా చెక్కుల ద్వారా ఈ మొత్తాన్ని డ్రా చేసుకుని కొన్ని గ్రామాల్లోని రైతులకు మాత్రమే పంపిణీ చేశారనే విమర్శలున్నాయి. 


నిధులు రావాల్సి ఉంది..  


నిధులు అందుబాటులో లేకపోవడంతో రెండునెలల జీతాలు చెల్లించలేకపోయాం. సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ నుంచి రావాల్సిన కమీషన్‌ రాగానే చెల్లిస్తాం. మడిగెల అద్దె వసూలుకు చర్యలు తీసుకుంటాం. వ్యాపార కార్యకలాపాల నిర్వహణపై పాలకవర్గం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయాన్ని అమలు చేయడం మా బాధ్యత.  

బి.రమేశ్, ఐడీసీఎంఎస్‌ మేనేజర్‌  

Advertisement
Advertisement