కేసీఆర్‌ ఉద్యోగాన్ని ఊడగొడితే లక్ష ఉద్యోగాలు వస్తాయి.. | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఉద్యోగాన్ని ఊడగొడితే లక్ష ఉద్యోగాలు వస్తాయి..

Published Mon, Nov 12 2018 11:47 AM

If KCR Loses Job, 1 Lakh Unemployed youth will Get Jobs - Sakshi

సాక్షి, వంగూరు: త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ కోరారు. ఆదివారం మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగూరు మండలంలో కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ల పాలనలోనే పూర్తిస్థాయిలో అభివృద్ధి జరిగిందన్నారు. తుమ్మలపల్లి గ్రామాన్ని అన్ని రకాలుగా తాను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామానికి అవసరమైన బీటీ రోడ్లు, అంతర్గత రోడ్లను సీసీరోడ్లుగా మార్చడంతోపాటు ప్రజలకు అవసరమైన ఇళ్లు, పింఛన్లు, సిలిండర్లు అందించామన్నారు. అలాగే  స్కూల్‌ బిల్డింగ్‌లు, వాటర్‌ట్యాంక్‌తోపాటు అనేక అభివృద్ధి పనులు చేసిన తనకు ఓట్లు వేయాల్సిన బాధ్యత తుమ్మలపల్లి గ్రామస్తులపై ఉందని ఆయన అన్నారు. 


అధికారంలోకి వస్తే..
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేయనుందని వంశీకృష్ణ తెలిపారు. రెండులక్షల రుణమాఫీ, వ్యక్తిగత ఇళ్ల నిర్మాణానికి రూ.ఐదు లక్షలు, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు అదనపు గదికోసం రూ.2లక్షల నగదు, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల నియామకం లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమై ఎన్నికల మేనిఫెస్టో ముందుకు తెచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగాన్ని ఊడగొడితే రాష్ట్రంలోని లక్షమందికి ఉద్యోగాలు వస్తాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ డాక్టర్‌ అనూరాధ, పార్టీ మండల అధ్యక్షుడు మల్లయ్యయాదవ్, పార్టీ నాయకులు అల్వాల్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, సత్యనారాయణ, విష్ణువర్ధన్‌రెడ్డి, శంకర్, బాలస్వామిగౌడ్, యాదగిరిరావు, మదన్‌కుమార్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు నారాయణరెడ్డి, రమేష్‌గౌడ్, షేర్‌ఖాన్, మల్లేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


కాంగ్రెస్‌లో చేరిక...
మండలంలోని తుమ్మలపల్లి, రంగాపూర్, పోతారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన పలువురు టీడీపీ, టీఆర్‌ఎస్‌కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.  

Advertisement
Advertisement