అడ్వాన్స్‌డ్‌లో మరో 13,850 మందికి అర్హత | Sakshi
Sakshi News home page

అడ్వాన్స్‌డ్‌లో మరో 13,850 మందికి అర్హత

Published Fri, Jun 15 2018 2:25 AM

IIT Kanpur Releases Extended JEE Advanced Merit List  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కటాఫ్‌ను ఐఐటీ కాన్పూర్‌ మరింత తగ్గించింది. ఈ నెల 10న ప్రకటించిన ఫలితాల్లో 18,138 మందే అర్హత సాధించడంతో తాజాగా కటాఫ్‌ మార్కులను తగ్గించి అర్హుల సంఖ్యను పెంచింది. మొదట ఓపెన్‌ కేటగిరీలో కటాఫ్‌ 126 మార్కులు ఉండగా, తాజాగా దానిని 90 మార్కులకు తగ్గి ంచింది.

ఓబీసీ నాన్‌ క్రీమీలేయర్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లోనూ కటాఫ్‌ను తగ్గించింది. దీంతో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారి సంఖ్య 31,988కి పెరిగింది. తాజా తగ్గింపుతో 13,850 మంది విద్యార్థులకు అర్హత లభించింది. గత నెల 20న జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు 2.31 లక్షల మందిని అర్హులుగా ప్రకటించగా, 1,65,656 మంది దరఖాస్తు చేసుకోగా, 1,55,158 మంది పరీక్షలకు హాజరైన సంగతి తెలిసిందే.

కటాఫ్‌ మార్కులను తగ్గించడంతో అర్హత సాధించిన బాలికల సంఖ్య రెట్టింపైంది. ఇంతకుముందు ప్రకటించిన ఫలితాల్లో 2,076 మంది బాలికలే అర్హత సాధించగా.. ప్రస్తుతం వారి సంఖ్య 4,179కి పెరిగింది. తాజా తగ్గింపుతో అదనంగా 2,013 మంది బాలికలకు అర్హత లభించింది.

1:2 రేషియో ఉండాలనే..
ఈసారి అడ్వాన్స్‌డ్‌లో అర్హుల సంఖ్య తగ్గడంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సమీక్షించింది. గత సంవత్సరాల కంటే ఈసారి అ ర్హుల సంఖ్య భారీగా తగ్గినట్లు గుర్తించింది. అందుబాటులో ఉన్న సీట్లకు కనీసం 1:2 నిష్పత్తిలో అర్హులుండాలని ఐఐటీ కాన్పూర్‌కు తెలిపింది. దీంతో కటాఫ్‌ మార్కులను తగ్గించి, అర్హుల సంఖ్యను పెంచింది. తగ్గిన కటాఫ్‌ మార్కుల ప్రకారం అర్హత సాధించిన వారి ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచింది.

నేటి నుంచి కౌన్సెలింగ్‌
ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం ఈ నెల 15 నుంచి కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఏడు దశల్లో ఈ కౌన్సె లింగ్‌ను నిర్వహించనుంది. రిజిస్ట్రేషన్, వెబ్‌ ఆప్షన్లకు 25వ తేదీ వరకు అవకాశం కల్పించి, 27న మొదటి దశ సీట్లను కేటాయించనుంది. జూలై 3న రెండో దశ, 6న మూడో దశ, 9న నాలుగో దశ, 12న ఐదో దశ, 15న 6వ దశ, 18న చివరి దశ సీట్ల కేటాయింపును ప్రకటించనుంది.


కటాఫ్‌ మార్కుల వివరాలు ఇవీ..
కేటగిరీ                        ఇదివరకు    తాజాగా
ఓపెన్‌                               126         90
ఓబీసీ నాన్‌ క్రీమీలేయర్‌       114         81
ఎస్సీ                                  63         45
ఎస్టీ                                    63         45
వికలాంగులు                       63         45

Advertisement
Advertisement