కోడెగడుతా రాజన్నా; బ్లాక్‌ దందాతో ఎలాగన్నా? | Sakshi
Sakshi News home page

రాజన్న గుడిలో బ్లాక్‌ దందా!

Published Thu, May 30 2019 8:42 AM

Illegal Activities In Kode Tickets Vemulawada Temple - Sakshi

సాక్షి, వేములవాడ : కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడు ఎములాడ రాజన్నను మొక్కుకుని కొడుకు పుడితే కోడెగడుతా రాజన్నా అంటూ నిత్యం వేలాది మంది భక్తులు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తరలివస్తుంటారు. రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయంగా పేరుండి, ఆదాయంలోనూ మొదటి స్థానంలో ఉంది. ఈ క్రమంలో శ్రీస్వామి వారికి వచ్చే ఆదాయంలో సింహ భాగం కోడె మొక్కుల ద్వారానే సంక్రమిస్తుంది. వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల్లో అధిక శాతం భక్తులు కోడె మొక్కు చెల్లించుకున్న అనంతరమే ఇతర మొక్కులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కోడె మొక్కు అనేది ఇతర దేవాలయాల్లో ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజన్న గుడిలో కొనసాగుతుంది. దీంతో రాజన్న గుడిలో బ్లాక్‌లో టికెట్లు అమ్ముకుంటూ సొమ్ము చేసుకునేందుకు లేబర్లు, కాంట్రాక్టు లేబర్లు, బినామీలు, పైరవీకారులు ముందుంటున్నారన్న అంశం ఆలయ ఉద్యోగులే చర్చించుకోవడం గమనార్హం.  

రద్దీ సమయంలో దందా షురూ..
పంటలు బాగా పండాలని రైతులు, కుటుంబాలు బాగుండాలని భక్తులు, తమ సమస్యలు తీరాలని మరికొందరు కుల, మతాలకు అతీతంగా ఎములాడ రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకుంటుంటారు. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుంటున్న సదరు బ్లాక్‌ టికెట్‌ దందా చేస్తున్న వ్యక్తులు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడలేక ఎక్కువ డబ్బులు చెల్లించి కోడె టికెట్లు కొనుక్కునేందుకు సరే అంటుంటారు. దీంతో వీరికి ఆదాయ వనరులు తెచ్చిపెడుతుంది. కౌంటర్లలో విధులు నిర్వహించే వారితో కుమ్మక్కై కోడె మొక్కుల టికెట్లు ముందస్తుగానే కొనుగోలు చేసి దగ్గర పెట్టుకుని భక్తులకు ఎక్కువ ధరలకు అందిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. దీనికితోడుగా కొంత మంది చెక్‌పోస్టులపై పని చేస్తున్న సిబ్బంది కోడెల టికెట్లను వేకువజామునుంచే పోగు చేసుకుని ఇలాంటి వ్యక్తుల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా వీరి దందా మూడుపువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోందన్న వాదన వినవస్తోంది. ఇటీవల నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌కు చెందిన నర్సాగౌడ్‌ అనే భక్తుడికి నర్సయ్య అనే లేబర్‌ బ్లాక్‌లో టికెట్లు అమ్ముకుంటూ ఎస్పీపీఎఫ్‌ సిబ్బందికి చిక్కడంతో ఇక్కడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చాన్నాళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంలో అధికారులు, సిబ్బంది పాత్ర ఉండొచ్చన్న భావనను భక్తులు వ్యక్తం చేస్తున్నారు.

పెరుగుతున్న బినామీలు
వేములవాడ రాజన్న ఆలయంలో బినామీల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కొంత మంది కొన్ని రకాల పేర్లతో (పార్టీల పేర్లు, శాఖల పేర్లు, వీఐపీల పేర్లు) ఆలయ అధికారులు, సిబ్బందికి బురిడీ కొట్టించి తమ పబ్బం గడుపుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. భక్తులను తమ బంధువులుగా, అధికారుల బంధువులుగా చెప్పుకుంటూ అధిక ధరలకు టికెట్లు, దర్శనాలు అందిస్తూ వ్యాపారం చేస్తున్నట్లు ఆధికారుల విచారణలో తేలింది. గతంలో పలువురు ఉద్యోగులు సైతం ఈ వ్యవహారంలో భాగస్వాములైతే ఆలయ ఈవో దూస రాజేశ్వర్‌ వారిపై చర్యలు తీసుకున్నారు. నిఘా తీవ్రతరం చేస్తే మరిన్ని ఇలాంటి బాగోతాలు బయట పడతాయని భక్తులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement