నీరా ఉత్పత్తులతో వ్యాధి నిరోధక శక్తి | Sakshi
Sakshi News home page

నీరా ఉత్పత్తులతో వ్యాధి నిరోధక శక్తి

Published Tue, Jun 9 2020 4:27 AM

Immunity With Nira Products Says Srinivas Goud - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నీరా ఉత్పత్తుల వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణ పామ్‌ నీరా, పామ్‌ ప్రొడక్ట్స్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్, వేద పామ్‌ ప్రొడక్ట్స్‌ తయారు చేసిన తాటి బెల్లం, తాటి – ఈత సిరప్‌లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ రవీంద్రభారతిలోని ఆయన ఛాంబర్‌లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌ నీరా పాలసీని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి గీత వృత్తిదారుల ఆత్మగౌరవాన్ని పెంచారని అన్నారు. సంప్రదాయ తాటి, ఈత చెట్ల నుంచి తీసిన నీరా ద్వారా సేంద్రియ ఉత్పత్తులైన తాటి బెల్లం, తాటి, ఈత సిరప్‌లను ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఆయుర్వేద పద్దతిలో తయారు చేస్తున్నారని స్పష్టంచేశారు. నీరా బై ప్రొడక్ట్స్‌ ద్వారా మధుమేహం, మూత్రపిండాలలో వచ్చే రాళ్లు తొలగించడంతో పాటు మూత్రసంబంధ వ్యాధులను నివారించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. నీరా ఉత్పత్తుల వల్ల మలబద్దకం, జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలుగుతుందన్నారు. తాటి బెల్లం, తాటి– ఈత సిరప్‌లలో విటమిన్లు, మినరల్స్‌ అధికంగా ఉంటాయని, శరీరంలో నెలకొన్న వేడితత్వాన్ని తొలగించటంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న నీరా కేంద్రం ఏర్పాటు పనులకు టెండర్లు పూర్తి చేశామని మంత్రి తెలిపారు.

Advertisement
Advertisement