అసంఘటిత కార్మికులకు మెరుగైన వైద్యం | Sakshi
Sakshi News home page

అసంఘటిత కార్మికులకు మెరుగైన వైద్యం

Published Mon, May 8 2017 1:54 AM

అసంఘటిత కార్మికులకు మెరుగైన వైద్యం

ఈఎస్‌ఐ ద్వారా అందిస్తామన్న దత్తాత్రేయ
హైదరాబాద్‌: రాజధానిలో భవన నిర్మాణ, అసంఘటిత కార్మికులకు ఈఎస్‌ఐ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఇందులో భాగంగానే కవాడిగూడలో 30 పడకలు, చిక్కడపల్లిలో 6 పడకలు, గోషామహల్‌లో రూ.100 కోట్లతో 100 పడకలు, పాత బస్తీలో 100 పడకలతో ఈఎస్‌ఐ ఆసుపత్రుల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే అందుకు అనువైన స్థలాలను చూపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా ఇప్పటివరకు స్పందన రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమీక్ష నిర్వహించి ఆసుపత్రుల నిర్మాణానికి స్థలం కేటాయించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రముఖ చర్మ వైద్యులు డాక్టర్‌ ఆశిష్‌ భాగ్యనగర్, డాక్టర్‌ కీర్తి సుబ్రహ్మణ్యం నల్లకుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్‌స్కిన్‌ మెడికల్‌ సెంటర్‌ను ఆదివారం అంబర్‌పేట శాసన సభ్యుడు జి.కిషన్‌రెడ్డి, ఐఎంఎస్‌ (ఈఎస్‌ఐ) డైరెక్టర్‌ సీహెచ్‌ దేవికారాణితో కలిసి దత్తాత్రేయ ప్రారంభించారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజక వర్గంలో 9,800 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర వాటాగా ఇంటికి రూ.1.5 లక్షల చొప్పున రూ.17 కోట్లు విడుదల చేసిందని దత్తాత్రేయ చెప్పారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టక పోవడం శోచనీయమన్నారు.

సొంతింటి కల నిజం చేస్తాం...
ప్రతి పీఎఫ్‌ ఖాతాదారుడికీ సొంతింటి కల నిజం చేస్తామని దత్తాత్రేయ చెప్పారు. ఆదివారం ఈపీఎఫ్‌ఓ ఉద్యోగ సంఘాలు ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో మంత్రి మట్లాడుతూ... గృహ నిర్మాణాలకు సంబంధించి తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తామన్నారు. భవిష్యనిధి విభాగం ప్రాంతీయ కమిషనర్‌ శ్రీకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement