సిద్దిపేట మార్కెట్‌లోదోపిడీ | Sakshi
Sakshi News home page

సిద్దిపేట మార్కెట్‌లోదోపిడీ

Published Sat, May 10 2014 10:56 PM

సిద్దిపేట మార్కెట్‌లోదోపిడీ - Sakshi

 స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు రైతన్నను నిలువు దోపిడీ చేస్తున్నారు. ధాన్యంలో తేమ ఉందంటూ కోత విధిస్తున్నారు. ధరను తగ్గిస్తూ నిండా ముంచుతున్నారు. ఇంత దోపిడీ జరుగుతున్నా పట్టించుకునే వారే లేకపోవడంతో అన్నదాత విలవిలలాడుతున్నాడు.
 
 సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్:
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు సమీప గ్రామాలతోపాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో వరి కోతలను దృష్టిలో పెట్టుకుని సిద్దిపేట యార్డులో లెసైన్స్ వ్యాపారులు ఈనెల 2 నుంచే కొనుగోళ్లను ప్రారంభించారు. నిబంధనల మేరకు క్వింటాల్ కామన్ గ్రేడ్ ధాన్యానికి రూ.1,310, ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ.1,345 చెల్లించాలి. సిద్దిపేటలో ప్రభుత్వరంగ సంస్థల కొనుగోలు కేంద్రం లేకపోవడంతో యార్డులోని వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. తేమ, పొల్లు శాతం అధికంగా ఉందంటూ వ్యాపారులు మద్దతు ధర విషయంలో కొర్రీలు పెడుతున్నారు. ప్రశ్నించిన రైతులకు, నిబంధనల మేరకు తేమ ఉన్న రైతులకు మాత్రం రూ.1,300 చొప్పున అందిస్తుండగా మిగతా వారికి రూ.1,200 కనిష్ట ధరను అందిస్తూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు.
 
 క్వింటాల్‌కు కిలోన్నర కోత..
 తూకం విషయంలో వ్యాపారులు క్వింటాల్‌కు కిలోన్నర చొప్పున ధాన్యాన్ని కోత విధిస్తున్నారు. వారం రోజులుగా ఈ తంతు సాగుతోంది. ధాన్యం నాణ్యత లేదనే సాకుతో గరిష్ట ధర రూ.1,300, కనిష్ట ధర రూ.1,200గా నిర్ణయిస్తూ రెండు వైపుల రైతుకు నష్టాన్ని కలిగిస్తున్నారు. ఈ నెలలోనే సుమారు 35 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు పరోక్షంగా కోతల పేరిట లక్షలాది రూపాయలను ఆర్జించినట్టు సమాచారం.
 
 దీనికితోడు గత మూడు రోజులపాటు కురిసిన అకాల వర్షాలకు యార్డులో కొంత ధాన్యం తడిసింది. తేమ శాతం అధికంగా ఉంటుందనే సాకుతో వ్యాపారులు తడిసిన ధాన్యానికి అమాంతం క్వింటాల్‌కు వంద రూపాయల చొప్పున ధరను తగ్గించగా, క్వింటాల్‌కు రెండు కిలోల కోతను విధిస్తున్నారు. ఈ లెక్కన శుక్రవారం సిద్దిపేట యార్డుకు వచ్చిన 13 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని వ్యాపారులు కోత విధానాన్ని బహిరంగంగా అమలు చేయడం గమనార్హం. ధర, తూకం విషయంలో జరుగుతున్న మోసాన్ని అరికట్టాల్సిన అధికారులు మిన్నకుండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
Advertisement