వైద్యారోగ్య శాఖలో భారీగా వేతనాల పెంపు | Sakshi
Sakshi News home page

వైద్యారోగ్య శాఖలో భారీగా వేతనాల పెంపు

Published Tue, Sep 4 2018 1:18 AM

Increased salaries in the Department of Medicine - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగాయి. జాతీయ ఆరోగ్య పథకం (ఎన్‌హెచ్‌ఎం, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం, ఎన్‌యూహెచ్‌ఎం)లో పనిచేస్తున్న రెండో ఏఎన్‌ఎంలు, ఏఎన్‌ఎంలు , స్టాఫ్‌ నర్సులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, కాంట్రాక్టు డాక్టర్లు, ఆశా వర్కర్లకు వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం  భారీగా పెంచింది. స్టాఫ్‌ నర్సు రూ.8,100, ల్యాబ్‌ టెక్నీషియన్‌ రూ.7,000, ఫార్మాసిస్టు రూ.11,000, ఏఎన్‌ఎం రూ.10,500, రెండో ఏఎన్‌ఎం రూ.8,350, మెడికల్‌ ఆఫీసర్‌ (ఎంబీబీఎస్‌) రూ.5,350, మెడికల్‌ ఆఫీసర్‌ (ఆయూష్‌) రూ.9,532 మెడికల్‌ ఆఫీసర్‌ (ఆయూష్, ఆర్బీఎస్‌కే) రూ.11,900 చొప్పున వేతనాలు పెంచారు. ఆశా వర్కర్లకు నెలకు రూ.6 వేల నుంచి రూ.7,500 చొప్పున పెరిగింది.

తాజా పెంపుతో రెండో ఏఎన్‌ఎంల వేతనం రూ.21 వేలకు చేరింది. వైద్యారోగ్య శాఖలో 2000 సంవత్సరం నుంచి రెండో ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెడికల్‌ ఆఫీసర్‌ అసిస్టెంట్స్, ప్రోగ్రాం ఆఫీసర్లు, అకౌంటెంట్లు, సహాయ సిబ్బంది వేల సంఖ్యలో పనిచేస్తున్నారు. పెరిగిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా తమకు కనీస వేతనాలను అమలు చేయాలని వారు చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీరి కోరిక మేరకు వేతనాలు పెంచుతూ ఆదివారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాలతో ప్రభుత్వంపై ఏటా రూ.92.82 కోట్ల భారం పడనుంది. తమ ఆవేదనను అర్థం చేసుకొని..వేతనాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వానికి వారు తమ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement