ఇళ్లు కట్టకున్నా..బిల్లులిచ్చారు | Sakshi
Sakshi News home page

ఇళ్లు కట్టకున్నా..బిల్లులిచ్చారు

Published Tue, Sep 16 2014 12:34 AM

ఇళ్లు కట్టకున్నా..బిల్లులిచ్చారు - Sakshi

 తవ్వినాకొద్దీ అక్రమాలే...
 - హౌసింగ్ సిబ్బందిదే కీలక పాత్ర
- విచారణలో వెలుగుచూస్తున్న నిజాలు
మల్హర్: ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై సీఐడీ అధికారులు చేస్తున్నవిచారణలో నమ్మలేని నిజాలు బైట పడుతున్నాయి. పలువురు ఇళ్లు నిర్మించుకోకున్నా, స్థానికంగా లేని వారికి, చనిపోయిన వారి పేరిట కూడా బిల్లులు మంజూరు చేశారంటే హౌసింగ్ అధికారుల అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మల్హర్ మండలం రుద్రారంలో ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై సీఐడీ అధికారులు  డీఎస్‌పీ మహేందర్, సీఐ ప్రకాశ్ సోమవారం విచారణ చేపట్టారు.   12ఏళ్ల క్రితం చనిపోయిన వారిపేర ఇళ్లు మంజూరై బిల్లులుసైతం ముట్టిన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.

ఈ గ్రామానికి 1133 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా  మూడో  బృందం చేసిన సర్వేలో 147ఇళ్లలో మాత్రమే అవినీతి జరిగినట్లు హౌసింగ్ అధికారుల తెలిపారు. అన్ని ఇళ్లలో  అక్రమాలు ఉన్నట్లు అనుమానించిన అధికారులు గతనెల 14నుంచి మల్హర్ మండలం రుద్రారంలో విచారణ మొదలు పెట్టారు.  మూడో బృందం చేపట్టిన  సర్వేలో సైతం తప్పులు జరిగినట్లు వెల్లడవుతోంది. గ్రామంలోని చిట్యాల లస్మయ్య 12 ఏళ్ల క్రితం దొబ్బల రాజేశ్వరి  8 ఏళ్ల క్రితం చనిపోయారు. ఇళ్లు నిర్మించకుండానే వారి పేరిట  బిల్లులు చెల్లించినట్లు వెల్లడైంది. గ్రామంలో లేని కనుకం మల్లయ్య, అత్కురి రాజయ్యలు ఇళ్లు కట్టకుండానే బిల్లులు ముట్టినట్లు తేలింది. విచారణ నిమిత్తం హౌసింగ్ అధికారులు 1133ఇళ్లకు నంబర్లు వేశారు.

ఒకరి ఇంటికి మరొకరి నంబర్ వేయడంతో   హౌసింగ్ అధికారులపై సీఐడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ గ్రామంలో సర్వే పూర్తవుతుందని డీఎస్పీ మహేందర్ తెలిపారు. విచారణలో అక్రమాలను గుర్తించామని, అవినీతికి సంబంధించిన బాధ్యులపై వివరాలు సేకరించి, నివేదికను ఐజీ చారుసిన్హాకు అందజేయనున్నట్లు వివరించారు. విచారణలో హౌసింగ్ డీఈలు భాస్కర్, గట్టుమల్లు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement