వివాదం రేపుతున్న శిశువు మృతి | Sakshi
Sakshi News home page

వివాదం రేపుతున్న శిశువు మృతి

Published Tue, Jun 21 2016 8:01 AM

వివాదం రేపుతున్న శిశువు మృతి

తప్పు వైద్యులదే అంటున్న బాధితులు
►  మా నిర్లక్ష్యం లేదంటున్న వైద్యులు

 
కల్వకుర్తి రూరల్
:  పట్టణంలో ప్రైవేట్ వైద్యం ప్రాణాల మీదికి తెస్తోంది. రెండు నెలలుగా చోటు చేసుకుంటున్న వరుస సంఘటనల్లో చిన్నాపెద్ద అందరూ బాధితులవుతున్నారు. కొందరు ప్రైవేటు వైద్యులు వచ్చీరాని వైద్యం చేయడం వల్లే పరిస్థితి జఠిలంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ఓ హాస్పిటల్‌లో ఓ మహిళ గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్తే కిడ్నీలు దెబ్బతిన్న సంఘటనపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లిన సంగతి తెలిసిందే. అది మరువక ముందే బస్టాండ్ సమీపంలోని ఆస్పత్రి వద్ద శిశువు మృతి చెందిన సంఘటన వెలుగుచూసింది. కల్వకుర్తి మండలం యంగంపల్లికి చెందిన మహేష్ తనభార్యను పట్టణంలోని జీవన్ తల్లి పిల్లల ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆరో నెల నుంచి ఆస్పత్రిలోనే చికిత్స చేయించినట్లు చెప్పారు.

ఈనెల 13న నొప్పులు తీవ్రం కావడంతో గ్రామం నుంచి ఆటోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యురాలు మోలిసకు సమస్యను విన్నవించారు. మహేష్ భార్య దీపకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యురాలు వారం తర్వాత ఆపరేషన్ చేస్తానని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పినట్లు మహేష్ విలే కరులకు తెలిపారు. మరుసటి రోజు నొప్పులు తీవ్రం కావడంతో మళ్లీ ఆస్పత్రికి వచ్చామని, గర్భంలోనే తమ శిశువు మృతి చెందే ప్రమాదముందని, ఆపరేషన్ చేయాలని కోరగా 23వ తేదీన చేస్తానని చెప్పి నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ఎట్టకేలకు 15వ తేదీన ఆపరేషన్ చేయడంతో మగశిశువు జన్మించిందని చెప్పాడు. శిశువు పరిస్థితి బాగోలేదని, వెంటనే హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించడంతో వెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడని తెలిపాడు.

తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చి ఇదేమిటని ప్రశ్నిస్తే తమ తప్పేమీ లేదని సమాధానమిచ్చారని అన్నాడు. ఈ విషయమై సోమవారం లాయర్  ద్వారా ఆస్పత్రికి వివరాల కోసం వస్తే ప్రైవేటు వైద్యులతో పాటు కొంతమంది ప్రభుత్వ వైద్యులు ఏకమయ్యారని, తమనే తప్పుబడుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారని మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగరాదనే ఉద్దేశంతో సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని చెప్పాడు.
 
 జన్యు లోపంతోనే...

జన్యులోపం వల్లే శిశువు మృతి చెందాడు. తమ తప్పేమీ లేదు. శిశువుకు చర్మం ఊడిపోతుండడంతో పాటు దవడలు సరిగా రాలేదు. చేతులపై దద్దుర్లు వచ్చాయి. ఇందులో మా నిర్లక్ష్యం ఏమీలేదు. - మోలిస, జీవన ఆస్పత్రి వైద్యురాలు

Advertisement
Advertisement