మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాలు | Sakshi
Sakshi News home page

మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాలు

Published Sun, Jun 8 2014 12:48 AM

infrastructure very soon in market yards, says harish rao

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని నీటిపారుదల, మార్కెటింగ్, అసెంబ్లీ వ్యవహారాలశాఖ మంత్రి టి.హరీష్‌రావు చెప్పారు. యార్డుల్లో రైతుల కోసం విశ్రాంతి గదులు, సబ్సిడీ క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన శనివారం సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మద్దతుధర, కనీససౌకర్యాలు ఉండేలా మార్కెట్ యార్డులు ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రతీ సీజన్‌లో యార్డులపై రైతులు వివిధ కారణాల వల్ల దాడులు చేసే పరిస్థితి చూస్తున్నామనీ.. ఇక నుంచి అటువంటి పరిస్థితి తలెత్తబోదని చెప్పారు. యార్డులు వ్యాపారుల కోసం కాకుండా రైతులకు సహకరించేలా ఉంటాయన్నారు. రాష్ట్ర విభజన జరగడంతో కమిషనరేట్ రెండుగా విడిపోయిందనీ.. దీన్ని పటిష్టపరిచేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు.

 

రైతుల పంట దళారుల చేతికి సగం వెళ్లాకే ప్రభుత్వ సంస్థలు ప్రవేశిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇకపై అలా జరగకుండా మొట్టమొదటి రోజునుంచే పంటను కొనే విధంగా చేయాలని ప్రాథమికంగా నిర్ణయించామన్నారు. రైతుల నుంచి తగు సూచనలు తీసుకొని రైతు బంధు పథకాన్ని పటిష్టపరుస్తామని చెప్పారు. పంట మార్కెట్ యార్డుకు వచ్చినప్పుడు అది ఆన్‌లైన్ ద్వారా కంప్యూటరైజేషన్ జరిగితే రైతుకు లాభం జరుగుతుందన్నారు. కర్ణాటకలో ఈ పద్ధతి విజయవంతమైందని తెలి పారు. అందువల్ల కొన్ని యార్డుల్లో ఆన్‌లైన్ మెకానిజమ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
 
 రైతులకు విశిష్ట సేవలు అందించే ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే రైతుబజార్లు సరిగా పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న రైతుబజార్లను వినియోగంలోకి తెస్తామని, డిమాండ్ ఉన్నచోట్ల కొత్తవాటిని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. పన్ను వసూళ్లలో దుర్వినియోగం జరుగుతుందనీ... వాటిపై దృష్టిపెట్టి ప్రతీ పైసా రైతుకు ఉపయోగపడేలా చేస్తామని చెప్పారు. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడవకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడ్తామని ఆయన వివరించారు.
 
 రుణమాఫీపై మాట తప్పం
 రుణమాఫీపై ఎట్టి పరిస్థితుల్లో తాము మాట తప్పమని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని హరీష్‌రావు చెప్పారు.  బ్యాంకర్ల నుంచి సమాచారం కోరినట్లు వివరించారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయన్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో పెట్టిన ఏ హామీనీ నెరవేర్చలేదని విమర్శించారు. తొమ్మిది గంటల ఉచిత కరెంటు అని చెప్పి అమలుచేయలేదన్నారు. రైతుల ఉసురు పోసుకునే పరిస్థితిని తీసుకురావద్దని హితవు పలికారు.


 

Advertisement
Advertisement