అసంతృప్తులకు ఆహ్వానం | Sakshi
Sakshi News home page

అసంతృప్తులకు ఆహ్వానం

Published Wed, Feb 24 2016 1:15 AM

Invitation to asantrptula

టీఆర్‌ఎస్ టికెట్ దక్కని వారి వైపు బీజేపీ చూపు
అధికార పార్టీకిఝలక్ ఇవ్వాలనే ఆలోచన
గ్రేటర్‌లో గెలుపే లక్ష్యంగా కమలనాథుల వ్యూహం

 
హన్మకొండ : టీఆర్‌ఎస్‌లో రాజుకుంటున్న అసమ్మతిని అనుకూలంగా మలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఈ మేరకు అధికార పార్టీలో టికెట్ రాని వారిని తమ వైపునకు తిప్పుకుని టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. వివరాల్లోకి వెళితే..
  టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్, టీడీపీ నుంచి ఇటీవల వలసలు పెరగడంతో మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఉన్న టీఆర్‌ఎస్ నాయకులతోపాటు కాంగ్రెస్, టీడీపీల నుంచి వచ్చిన వారు  కార్పొరేటర్ల టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో అధికార పార్టీలో టికెట్ల కోసం పోటీ పెరిగింది. అయితే టీఆర్‌ఎస్‌లో చోటు దక్కని వారిలో ప్రజల్లో పట్టున్న నాయకుడిని తమ వైపునకు లాక్కుని బీజేపీ నుంచి పోటీ చేయించి టీఆర్‌ఎస్‌ను దెబ్బ తీయాలనే వ్యూహంతో నాయకులు వ్యూహం రచిస్తున్నారు. కాగా, వలసలతో కాం గ్రెస్, టీడీపీలు డీలా పడడంతో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయంగా బీజేపీ భావిస్తోంది. గతంలో బీజేపీ ఒకసారి మేయర్ పదవిని చేపట్టడంతోపాటు హన్మకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా, అప్పటి హన్మకొండ పార్లమెంట్ నుంచి ఒక పర్యాయం ప్రాతినిథ్యం వహించిన పట్టు బీజేపీకే ఉంది. దీంతో పాటు ప్రధాని నరేంద్రమోదీపై ఉన్న అభిమానాన్ని, కేంద్రంలో అధికారంలో ఉండడం వంటి అంశాలను అనుకూలంగా మలుచుకోవడం ద్వారా గ్రేటర్ వరంగల్‌లో పట్టు నిలుపుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ రెబల్స్‌పై బీజేపీ నాయకులు కన్నేశారు.

చోటుదక్కని వారికి ఆహ్వానం..
మొత్తం 58 డివిజన్లలో సోమవారం 26 మంది అభ్యర్థులతో, మంగళవారం 17 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితాను విడుదల చేసింది. అయితే టీఆర్‌ఎస్‌లో చోటుదక్కని వారు తమ వద్దకు వస్తే తొలుత ప్రకటించిన జాబితాలో నుంచి కొంతమంది అభ్యర్థులను తప్పించి, వచ్చిన వారికి అవకాశం కల్పించి టీఆర్‌ఎస్‌కు ఝలక్ ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ వర్గాలు ఉన్నట్లు సమాచారం. ఉద్యమం నాటి నుంచి పనిచేస్తున్న నాయకుల మధ్య టీఆర్‌ఎస్‌లో పోటీ తీవ్రంగా ఉండగా, కొత్త వారి చేరికతో ఈ పోటీ మలుపులు తిరుగుతోంది.
 
 

Advertisement
Advertisement