చలో ‘భారత్‌ దర్శన్‌’.. పూర్తి వివరాలు

7 Nov, 2019 12:03 IST|Sakshi

జనవరి నుంచి అందుబాటులోకి..

పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల సందర్శన ఇక ఈజీ

మొదట దక్షిణ భారత పర్యటనకు చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: నగర పర్యాటకుల కోసం త్వరలో ‘భారత్‌ దర్శన్‌’ ప్రత్యేక రైలు పట్టాలెక్కనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వీలుగా ఈ రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేశాఖ తొలిసారి దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన పర్యాటక రైలు ఇది. ఈ రైలు పర్యాటక ప్యాకేజీల రూపకల్పన, నిర్వహణను ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) పర్యవేక్షిస్తుంది. హైదరాబాద్‌ పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా, దేశంలోని వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పర్యటనలను ఏర్పాటు చేయనున్నట్లు ఐఆర్‌సీటీసీ డిఫ్యూటీ జనరల్‌ మేనేజర్‌ సంజీవయ్య తెలిపారు. మొదట దక్షిణ భారత యాత్రకు శ్రీకారం చుట్టామని, దశలవారీగా దేశవ్యాప్తంగా ఈ పర్యాటక రైలు పయనిస్తుందని చెప్పారు.

ఏటా 50,000 మందిపైనే..
నగరం నుంచి ఏటా 50 వేల మందికి పైగా పర్యాటకులు ఉత్తర, దక్షిణ భారత యాత్రలకు రైళ్లలో తరలి వెళ్తున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే ఒక్కోసారి రెండు, మూడు రైళ్లు మారాల్సి వస్తోంది. దీంతో కుటుంబాలతో కలిసి ఎక్కువ లగేజీతో వెళ్లవలసి వచ్చినప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక రైల్వే సదుపాయాలు లేకపోవడంతో ప్రైవేట్‌ టూరిస్టు సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సంస్థల ప్యాకేజీలు ఖరీదైనవి కావడమే కాక కొన్నిసార్లు మోసాలూ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నగర పర్యాటకుల డిమాండ్‌ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు ప్రత్యేక పర్యాటక రైలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఎట్టకేలకు దక్షిణ మధ్య రైల్వేకు సొంతంగా పర్యాటక రైలు రావడంతో ఇక ఇబ్బందులు తొలగినట్లేనని రైల్వే ఉన్నతాధికారులు అంటున్నారు.

శ్రీరంగం టు కాంచీపురం

 • సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా మొదట శ్రీరంగం చేరుతుంది.
 • శ్రీరంగనాథ స్వామి ఆలయ సందర్శన.. తంజావూర్‌ బృహదీశ్వరాలయ పర్యటన
 • అక్కడి నుంచి 2,500 ఏళ్ల నాటి పురాతన పట్టణమైన మధుర మీనాక్షి ఆలయ సందర్శన.. ఇంకా, రామేశ్వరం రామనాథ స్వామి ఆలయం, కన్యాకుమారిలోని కుమారి అమ్మన్‌ దేవాలయం, వివేకానందరాక్‌
 • మెమోరియల్‌ ఆలయ సందర్శనాల అనంతరం మహాబలిపురం చేరుతుంది.
 • అనంతరం కాంచీపురం చేరుకొని అక్కడి నుంచి తిరుగు పయనమై.. జనవరి 10వ తేదీ మధ్యాహ్నానికి సికింద్రాబాద్‌ చేరుతుంది.

‘భారత్‌ దర్శన్‌’ జర్నీ ఇలా..

 • జనవరి 3, తెల్లవారుజామున సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయల్దేరుతుంది.
 • 10న మధ్యాహ్నం తిరిగి సికింద్రాబాద్‌ చేరుతుంది.
 • ప్రయాణం మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లు సాగుతుంది.
 • ఈ రైలుకు ఉండే 16 బోగీల్లో 12 స్లీపర్‌ క్లాస్, ఒక ఏసీ త్రీటైర్, ఒక ప్యాంట్రీ కార్‌ ఉంటాయి. మిగతా రెండూ గార్డ్‌ బోగీలు.
 • స్లీపర్‌ క్లాస్‌ జర్నీకి రోజుకు రూ.945, థర్డ్‌ ఏసీకి రూ.1,150 చొప్పున చార్జీ (రైలు ప్రయాణంతో పాటు, అల్పాహారం, టీ, కాఫీ, భోజనం, రోడ్డు రవాణా తదితర వసతులన్నీ కలిపి) వసూలు చేస్తారు.   
 • మొత్తంగా 8 రోజుల దక్షిణ భారత యాత్ర కోసం స్లీపర్‌ క్లాస్‌కు రూ.7,560, థర్డ్‌ ఏసీకి రూ.9,240 చొప్పున ప్యాకేజీ నిర్ణయించారు.

ఫోన్‌ కొడితే సమాచారం..
‘భారత్‌ దర్శన్‌’ సమాచారం కోసం సికింద్రాబాద్‌ ఐఆర్‌సీటీసీ జోనల్‌ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఫోన్‌ నంబర్లు: 82879 32227, 82879 32228.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా