స్కూల్‌కు వేళాయె..బస్సు రాదాయె.. | Sakshi
Sakshi News home page

స్కూల్‌కు వేళాయె..బస్సు రాదాయె..

Published Sun, Aug 10 2014 11:52 PM

irregual  services of apsrtc to villeages

 జిన్నారం : బస్సుల కోసం విద్యార్థులు నిత్యం రోడ్డెక్కుతున్నారు. సమయానికి బస్సులు రాక.. పాఠశాలలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విధిలేక నడక ద్వారానే స్కూల్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఆలస్యంగా చేరుకోవడంతో కొన్ని తరగతులకు హాజరుకాలేకపోతున్నారు. అయినా పాల కులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదు.

 ప్రతి మారుమూల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెబుతున్నా, ఇప్పటివ రకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడంలేదు. గత ప్రభుత్వాలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడపటంలో పూర్తిగా విఫలమయ్యాయనే ఆరోపణలున్నాయి. ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యంలేని గ్రామాలు ఉన్నాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జిన్నారం మండలంలోని కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యాన్ని కల్పించటంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఏం చేయాలో తోచక ప్రజలు, విద్యార్థులు నడక ద్వారా వారి పనులను కొనసాగిస్తున్నారు.

 జిన్నారం నుంచి అండూర్ వరకు బస్సు సౌకర్యం లేదు. కొత్తపల్లి, నల్లవల్లి గ్రామాలకూ బస్సు సౌకర్యం సరిగా లేదు. జిన్నారం-బొల్లారం గ్రామాల మధ్య కొన్ని ఏళ్లుగా బస్సు సౌకర్యం లేకపోవడం గమనార్హం. రామిరెడ్డిబావి, కానుకుంట తదితర గ్రామాలకు పాఠశాల వేళల్లో బస్సు సౌకర్యం లేదు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాల్సి ఉండగా, ఆ దిశగా  చర్యలు తీసుకోవటం లేదు.  పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనువుగా సరైన సమయంలో బస్సు సౌకర్యం లేదు.

 దీంతో కొందరు సొంత వాహనాలను, మరికొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఉదయం వేళలో సరిపడా బస్సులు  గ్రామాలకు రాకపోవటంతో విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి వెళ్లలేకపోతున్నారు. ఇదిలాఉండగా.. విద్యార్థులకు తగిన పాసులు ఉండటంతో వారిని ఎక్కించుకునేందుకు బస్సు డ్రైవర్లు ఆసక్తి చూపటం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదేళ్లుగా గ్రామాల్లో ఈ పరిస్థితులు ఉన్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. తండాలకు కూడా బస్సు సౌకర్యం లేదు.

గత పాలకులు నామమాత్రంగా నూతన బస్సులను వేయించి చేతులు దులుపుకున్నారు. సరైన బస్సు సౌకర్యాలను కల్పించాలని ప్రతినిత్యం విద్యార్థులు, ఉద్యోగులు రోడ్లపై బైఠాయిస్తున్నారు. ప్రస్తుత పాలనలోనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.

Advertisement
Advertisement