రాద్ధాంత మెందుకో! | Sakshi
Sakshi News home page

రాద్ధాంత మెందుకో!

Published Fri, Nov 21 2014 2:31 AM

irregularities in PHD admissions

 తెయూ(డిచ్‌పల్లి)/నిజామాబాద్‌అర్బన్ : తెలంగాణ యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన పీహెచ్‌డీ అడ్మిషన్లలో అర్హులకు అన్యాయం జరిగిందని, అనర్హులకు సీట్లు కేటాయించారని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తెలుగు, బిజినెస్ మేనేజ్‌మెంట్, మాస్ కమ్యూనికేషన్ విభాగాల్లో పీహెచ్‌డీ అడ్మిషన్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని కొందరు అభ్యర్థులు ఉన్నత విద్యా మండలికి, అప్పటి తెయూ ఇన్‌చార్జి వీసీ శైలజా రామయ్యర్‌కు ఫిర్యాదులు చేశారు.

స్పందించిన ఇన్‌చార్జి వీసీ ఓయూ కెమిస్ట్రీ డీన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో ఏక సభ్య కమిటీ వేసి విచారణకు ఆదేశించారు. మంగళవారం కమిటీ సభ్యుడు నాగేశ్వరరావు తెయూను సందర్శించి ఇన్‌చార్జి రిజిస్ట్రార్ చాంబర్‌లో పీహెచ్‌డీ అ డ్మిషన్లపై విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల వాదనలు నమోదు చేశారు. అయితే కొందరు విద్యార్థి నాయకులు విచారణ కమిటీనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అందోళకు దిగడంపై విచారణ కమిటీ సభ్యుడు విస్మయం వ్యక్తం చేశారు. ఏవైనా అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చినప్పుడు విచారణ కమిటీ వేసి నిజానిజాలు తెలుసుకోవడం అన్ని వర్సిటీల్లో జరిగే ప్రక్రియేనని వర్సిటీ విద్యార్థులు పేర్కొం టున్నారు.

 మద్దతు తెలపలేక
 విచారణలో వాస్తవాలు వెలికి తీసి బాధితులకు న్యాయం చేయాలని మద్దతు తెలుపాల్సిన విద్యార్థి సంఘాల నాయకులే ఏకంగా కమిటీనే రద్దు చేయాలని డిమాండ్ చేయడమేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. విచారణను అడ్డుకోవడం, ధర్నాలు చేయడం సమంజసంగా లేదని విమర్శిస్తున్నారు. అసలు విచారణ అంటే ఎందుకు అందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విచారణ కమిటీని రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి నాయకులు బుధవారం వర్సిటీ కళాశాల తరగతులు బహిష్కరించడాన్ని వ్యతిరేకించారు. అయినా విద్యార్థి నా యకుల మాటను కాదనలేక ఇష్టం లేకున్నా వర్సిటీ బంద్‌కు సహకరించాల్సి వచ్చిందని కొందరు విద్యార్థులు  వాపోయారు.

 వారికి ఇబ్బందులనే
 పీహెచ్‌డీ ప్రవేశాలలో అక్రమాలపై విచారణ జరిగితే విద్యార్థి సంఘాల నాయకులకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ జరిగితే కొందరు అనర్హులు ప్రవేశం కోల్పోతామని భావిస్తున్నారు. పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి మొదటి లిస్టులో నలుగురు విద్యార్థి సంఘాల నాయకులు ఎంపిక కాలేదు. వారి ఎ ంపిక కోసం కళాశాల అధికారులు సైతం రిజర్వేషన్ కేటగిరిలో మార్పులు చేశారు.

ఓపెన్ కేటగిరిలో 45 మార్కులకుగాను 40 మార్కులు, బీసీలకు 40 మార్కులకుగాను 30 మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 35 మార్కులకుగాను 30 మార్కులు తగ్గిస్తు నిబంధనలు చేశారు. దీంతో ఎంపిక కాని విద్యార్థి సంఘం నాయకులు ఎంపికయ్యారు. అర్హత కలిగిన మెరిట్ స్టూడెంట్లకు ఈ మార్పులకు సంబంధించి కనీస సమాచారం అందించలేదు. ఫోన్ చేస్తేనే యూనివర్శిటీకి రావాలని, సీటు వచ్చినట్లు అధికారులు చెప్పుకొచ్చారు.

ఓ విద్యార్థి సంఘం నాయకుడికి కేవలం 30 మార్కులే రాగా ప్రవేశానికి అనర్హుడయ్యాడు. కానీ, మార్పులు చేయడంతో సీటు లభిం చింది. హైదరాబాద్‌కు చెందిన మహిళ విద్యార్థి నాయకురాలికి పీహెచ్‌డీ ప్రవేశానికి అర్హత ఉన్నప్పటి కీ  సీటు లభించలేదు. దీంతో ఆమె ఉస్మానియా యూ నివర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇది యూ నివర్శిటీ అధికారులకు తెలిసి సీటు ఇస్తామంటూ యూనివర్శిటీకి పిలిపించారు. నెల రోజులు గడిచినా సీటు మాత్రం ఇవ్వలేదు. యూనివర్శిటీ అధి కారులను నిలదీస్తే ఇటీవలే ప్రవేశం కల్పించారు.

 ఫీజులు కూడా చెల్లించలేదు
 యూనివర్శిటీ నిబంధనల ప్రకారం ప్రవేశం పొందిన విద్యార్థుల నుంచి రూ. 16 వేల రూపాయలు ఫీజును వసూలు చేయాలి. పీహెచ్‌డీకి రూ. 15 వేలు, అడ్మిషన్ ఫీజు  వెయ్యి రూపాయలు ఉంటుంది.  కాని ఎం పికైన  కొందరు విద్యార్థి సంఘాల నాయకులు కేవ లం వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లించారు. వీరి నుంచి ఫీజులు కూడా వసూలు చేయలేకపోయారు. అదే ఎంబీఏ, మాస్ కమ్యూనికేషన్, తెలుగు విభాగా ల్లో ఇతర విద్యార్థుల నుంచి మాత్రం పూర్తి స్థాయి ఫీజులను వసూలు చేశారు.

 తెలుగు పీహెచ్‌డీ ప్రవేశాలపై విద్యార్థుల ఆందోళన వెనుక అధికారుల పాత్ర ఉన్నట్లు సమాచారం. విచారణలో అనర్హులకు అడ్మిషన్ల విషయం బట్టబయలు అవుతుందని, తమపై వేటు పడే అవకాశం ఉందని భావించిన కొందరు అధికారులు విద్యార్థి సంఘం నాయకులను ఉసిగొలిపి మీ ప్రవేశాలు రద్దు అవుతాయని, విచారణను అడ్డుకోవాలని ప్రేరేపించినట్లు సమాచారం. దీంతో విచారణ కమిటీని అడ్డుకోవడం, తెలంగాణ యూనివర్శిటీకి బంద్ పిలుపునిచ్చారని తెలుస్తోంది.

Advertisement
Advertisement