రిజిస్ట్రేషన్ల శాఖలో అంతే! | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్ల శాఖలో అంతే!

Published Sat, Oct 21 2017 8:07 PM

Irregularities in Sub Registrar Offices

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: రిజిస్ట్రేషన్ల శాఖ తీరు మారడం లేదు. ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా శాఖ ఉద్యోగులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి దాదాపు రూ.20 లక్షలు స్టాంపు డ్యూటీ ఎగవేసిన ఘటన ఇటీవల వెలుగు చూడడమే దీనికి నిదర్శనం. ఒరిజినల్‌ డాక్యుమెంట్లను పరిశీలించకుండా స్థల మార్పిడి చేసిన అధికారులపై మహబూబ్‌నగర్‌ టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడం సంచలనాన్ని కలిగించింది.

అసలేం జరిగిందంటే..
మహబూబ్‌నగర్‌ పట్టణంలోని సర్వే నంబర్‌ 163లో 605 చదరపు గజాల స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. వ్యవస్థలోని లొసుగులు ముఖ్యంగా ‘ఎనీ వేర్‌ రిజిస్ట్రేషన్‌’ పద్ధతి ద్వారా ఇదంతా నడిచినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌లోని స్థలాన్ని ఏకంగా అలంపూర్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం లో రిజిస్ట్రేషన్‌ చేయడం గమనార్హం. స్థలాన్ని చదరపు గజాల్లో కాకుండా గుంటల్లో చూపిస్తూ ఏకంగా ప్రభుత్వ ఖజానాకు రూ.20లక్షల వరకు గండి కొట్టినట్లు చెబుతుండగా.. దీనిపై మూసాపేట మండలం సంకలమద్ది కి చెందిన సింగిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో స్పందించి.. సమగ్ర దర్యాప్తు జరపాల్సిదిగా పోలీసు శాఖను ఆదేశించింది. ఈ మేరకు సంబంధమున్న వారిపై మహబూబ్‌నగర్‌ టూటౌన్‌ పోలీసులు ఈనెల 3న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇందు లో జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన అధికారితో పాటు ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్న మరో ప్రాంత సబ్‌ రిజిస్ట్రార్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

అంతా వారిదే హవా..
విలువైన పత్రాలు స్కానింగ్‌ జరిగే కంప్యూటర్‌ గదిలో రియల్‌ వ్యాపారులు, బ్రోకర్లు, డాక్యుమెంట్‌ రైటర్లదే పైచేయి. వీరితో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తీసుకెళ్లిన డాక్యుమెంట్లు అయిన తర్వాతే మిగతావి స్కానింగ్‌. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారుల కనుసన్నల్లో ఈ ప్రక్రియ నిత్యకృత్యం. కంప్యూటర్‌ గదిలో డాక్యుమెంట్‌ రైటర్లు కంప్యూటర్లపై కూర్చుని డాక్యుమెంట్లు స్కానింగ్‌ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నిత్యం జరుగుతున్న తతంగం తో సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కార్యాలయంలోని ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్ల క్యాబిన్లకు ముందు భాగంలో ఉన్న కంప్యూటర్‌ గదిలోనే ఇదంతా జరుగుతున్నా పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.  

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఊసే లేదు....
ప్రభుత్వం సామాన్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ విధానం అమలు కాకపోగా దీనిపై రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు అవగాహన కూడా కల్పించడం లేదు. అక్రమాలను అరికట్టేందుకు ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినా అమలు కావడం లేదు. జూలై 24న ప్రభుత్వం పబ్లిక్‌ డాటా ఎంట్రీ సిస్టంను అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అమ లు కాకపోవడం గమనార్హం. ఆన్‌లైన్‌ ద్వారా ఒక్క డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement
Advertisement