సాగునీటి పనులు త్వరగా పూర్తి చేయాలి | Sakshi
Sakshi News home page

సాగునీటి పనులు త్వరగా పూర్తి చేయాలి

Published Fri, Mar 10 2017 5:14 PM

సాగునీటి పనులు త్వరగా పూర్తి చేయాలి

సాక్షి, ఖమ్మం: ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న సాగునీటి పథకాలను పూర్తి చేయడంతోపాటు, కొత్తగా మరికొన్ని పథకాలు చేపడుతున్నట్టు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఇరిగేషన్‌ సబ్‌కమిటీ సమావేశం మంత్రి హరీష్‌ రావు అధ్యక్షతన జరిగింది. రెండు జిల్లాల్లో చేపడుతున్న సాగునీటి పథకాలను త్వరగా పూర్తి చేయాలని సమావేశంలో పాల్గొన్న సంబంధిత అధికారులను మంత్రులిద్దరూ ఆదేశించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, సబ్‌ కమిటీ సభ్యుడు కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.


నూతన పథకాలపై చర్చ
► చర్ల మండలంలో వద్దిపేట చెక్‌డ్యామ్‌ మంజూరుపై చర్చించారు.
► టేకులపల్లి మండలంలో పరికెలవాగు చెక్‌డ్యామ్‌ మంజూరు.
► అశ్వారావుపేట మండలంలో అంకమ్మచెరువు దబ్బతోగు చెరువుకు మళ్లించే పథకం మంజూరు.
► సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో బేతుపల్లి హైలెవల్‌ కెనాల్‌కు సంబంధించి పెండింగ్‌ పనుల మంజూరుపై మాట్లాడారు.
► తిరుమలాయపాలెం మండలంలోని తానంచెర్ల డైవర్షన్‌ స్కీం మంజూరుపై చర్చించారు.
► వైరా ప్రాజెక్టు పరిధిలో సిరిపురం వద్ద ఎడమ కాలువపై ఓటీ స్లూయీస్‌ మంజూరుపై మాట్లాడారు.


కొనసాగుతున్న పథకాలపై సమీక్ష..
► తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్‌ మండలాల్లో ఎస్సారెస్పీ స్టేజ్‌–2 పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా అన్ని చెరువులకు సాగునీటిని అందించేలా తగు చర్యలు చేపట్టాలని సూచించారు.
► సింగరేణి మండలంలో గతంలో మంజూరైన బుగ్గవాగు చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులు వేగిరం చేయాలన్నారు.  
► శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని పూర్తి ఆయకట్టు స్థిరీకరణ కోసం సప్లిమెంటేషన్‌ పథకాన్ని చేపట్టాలని ఇరిగేషన్‌ కేబినెట్‌ సబ్‌కమిటీ అభిప్రాయపడింది. ఎస్సారెస్పీ వరద కాలువపై కేబినెట్‌ సబ్‌ కమిటీలో సుదీర్ఘంగా సమీక్షించారు.

Advertisement
Advertisement