పదవి కోసం పెద్ద లోల్లి | Sakshi
Sakshi News home page

పదవి కోసం పెద్ద లోల్లి

Published Wed, Jun 4 2014 1:33 AM

పదవి కోసం పెద్ద లోల్లి

రసాభాసగా సీఎల్పీ భేటీ

డీఎస్, షబ్బీర్‌కు మద్దతుగా రెండుగా చీలిపోయిన ఎమ్మెల్సీలు
అధిష్టానం దూతల ముందే దూషణలపర్వం
డీఎస్ ఒక్కో ఎమ్మెల్సీకి రూ.10 లక్షలు ఆఫర్ చేశారన్న రాజలింగం
ఆరోపణలను ఖండించిన డీఎస్ వర్గం

 
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత ఎంపిక కోసం మంగళవారం జరిగిన సీఎల్పీ భేటీ సవ్యంగానే జరిగినట్టు పైకి కనిపిస్తున్నా లోపల మాత్రం పెద్ద గొడవే జరిగింది. ఎమ్మెల్సీలు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపైకి ఒకరు దూషణలపర్వానికి దిగారు. దీంతో అధిష్టానం పెద్దలు బిత్తరపోవాల్సి వచ్చింది. చివరికి వారు ఇరువర్గాలను శాంతింపజేసి ఎంపిక ప్రక్రియను మమ అనిపించారు. తనకు మద్దతివ్వాలంటూ ఒక్కో ఎమ్మెల్సీకి డి.శ్రీనివాస్ రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజలింగం ఏకంగా సీఎల్పీ సమావేశంలోనే ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కైన డీఎస్‌కు మండలి ప్రతిపక్ష నేత పదవి ఎట్లా ఇస్తారంటూ నిలదీసిన రాజలింగంకు... మాజీ మంత్రి షబ్బీర్ అలీ సైతం మద్దతు పలికారు. ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్సీలూ డీఎస్‌పై ఆరోపణలు చేశారు. వీటిని ఖండిస్తూ డీఎస్ వర్గం.. షబ్బీర్ అలీపై ప్రత్యారోపణలు చేయడంతో సమావేశం ఒకదశలో రసాభాసగా మారింది. భేటీ అదుపు తప్పిందని గ్రహించిన హైకమాండ్ దూతలు వయలార్, దిగ్విజయ్‌సింగ్‌లు... ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరిని పిలిచి బుజ్జగింపు యత్నాలు ప్రారంభించారు. డీఎస్‌కు మండలి ప్రతిపక్ష నేత పదవి, షబ్బీర్ అలీకి ఉపనేత పదవి ఇస్తామని ప్రతిపాదించారు. ఇందుకు షబ్బీర్ అయిష్టత వ్యక్తం చేసినప్పటికీ ఆయన పేరును ప్రకటించారు. డీఎస్, షబ్బీర్ అలీ ఇద్దరూ నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. ఒకే జిల్లాకు రెండు పదవులు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బేరసారాలు బయటకు పొక్కడం, ఈ విషయం ప్రజల్లోకి వెళితే కాంగ్రెస్ మరింత చులకన అవుతుందనే ఉద్దేశంతోనే షబ్బీర్ అలీకి ఉపనేత పదవిని కట్టబెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

17 మంది.. రెండున్నర గంటల సినిమా!

కాంగ్రెస్ ఎమ్మెల్సీల సమావేశం సస్పెన్స్ సినిమాను తలపించింది. మండలిలో అధికార టీఆర్‌ఎస్‌తో పోలిస్తే ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్ష పదవి కోసం గట్టి పోటీ నెలకొంది. డీఎస్, షబ్బీర్ గత వారం రోజులుగా ఎమ్మెల్సీలతో ముఖాముఖి సమావేశమై మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. చివరి నిమిషం వరకు ఎమ్మెల్సీలతో మంతనాలు జరిపారు. అభిప్రాయ సేకరణ సమయంలోనూ ఇద్దరు నేతలు ఎవరికి వారే తమకే మండలి ప్రతిపక్ష నేత పదవి దక్కుతుందనే ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్‌కు 17 మంది ఎమ్మెల్సీలుండగా మంగళవారంనాటి సమావేశానికి 16 మంది మాత్రమే హాజరయ్యారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్ తన సమీప బంధువు చనిపోవడంతో రాలేదు. సమావేశానికి హాజరైన వారిలో ఏడుగురు (కేఆర్ ఆమోస్, యాదవరెడ్డి, భానుప్రసాద్, వి.భూపాల్‌రెడ్డి, రాజలింగం, జగదీశ్వర్‌రెడ్డి, పీర్ షబ్బీర్ అహ్మద్) షబ్బీర్ అలీకి మండలి ప్రతిపక్షనేత పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. అదే సమయంలో డీఎస్ పేరును ఏడుగురు (పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, నేతి విద్యాసాగర్, డి.రాజేశ్వర్, ఎమ్మెస్ ప్రభాకర్, బి.వెంకట్రావు, మాగం రంగారెడ్డి) ఎమ్మెల్సీలు ప్రతిపాదించారు. చివర్లో తాను డీఎస్‌కు మద్దతిస్తున్నట్లు సంతోష్‌కుమార్ లేఖ పంపడంతో హైకమాండ్ పెద్దలు డీఎస్ పేరును ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో రాజలింగం డీఎస్‌పై చేసిన ఆరోపణలు సమావేశంలో కలకలం రేపాయి.

డీఎస్ రూ.10 లక్షలు ఇవ్వబోయారు: రాజలింగం

సమావేశానంతరం రాజలింగం మీడియాతో మాట్లాడుతూ ‘‘ఒక్కో ఎమ్మెల్సీకి డీఎస్ రూ.10 లక్షలు ఇచ్చారు. నాకు కూడా ఆఫర్ చేస్తే వద్దని తిరస్కరించాను. టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై కేసీఆర్ ప్రభుత్వంలో లోపాయికారీ పనులు చేసుకునేందుకే డీఎస్ మండలి ప్రతిపక్షనేత పదవిని ఆశించి అందరినీ మేనేజ్ చేస్తున్నాడు. 8 మంది ఎమ్మెల్సీలు వ్యతిరేకించినా హైకమాండ్ పెద్దలు ఆయన పేరునే ఖరారు చేశారు’’ అని అన్నారు. కాగా, రాజలింగం చేసిన ఆరోపణలకు విలువ లేదని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

షబ్బీర్‌కు హ్యాండిచ్చిన ప్రభాకర్!

మండలి ప్రతిపక్షనేత పదవిపై గంపెడాశలు పెట్టుకున్న షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్ హ్యాండిచ్చినట్లు తెలుస్తోంది. తనకు 8 మంది ఎమ్మెల్సీలు మద్దతు ఇస్తారని షబ్బీర్ భావించారు. వీరిలో ప్రభాకర్ కూడా ఉన్నట్లు షబ్బీర్ అలీ చెబుతున్నారు. అయితే సమావేశం ప్రారంభం వరకు తమతోనే ఉన్న ప్రభాకర్ చివరి నిమిషంలో డీఎస్‌వైపు వెళ్లారని షబ్బీర్ వాపోయారు.

ఎన్నిక ఏకగ్రీవమే: వయలార్

 మండలి ప్రతిపక్షనేతగా డీఎస్, ఉపనేతగా షబ్బీర్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వయలార్ రవి ప్రకటించారు. ఎమ్మెల్సీల సమావేశానంతరం దిగ్విజయ్‌సింగ్, వయలార్, పొన్నాల, డీఎస్ మీడియా ముందుకొచ్చారు. ఆ సమయంలో షబ్బీర్‌ను సైతం మీడియా ముందుకు రావాలని హైకమాండ్ పెద్దలు కోరినా ఆయన పట్టించుకోలేదు. తాను రానని పేర్కొంటూ వాహనం ఎక్కేందుకు ప్రయత్నించారు. కుంతియా, తిరునావక్కరసార్ ఆయనను బతిమిలాడి మీడియా ముందుకు తీసుకొచ్చారు. అనంతరం డీఎస్ మాట్లాడుతూ తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు. షబ్బీర్‌తో కలిసి పనిచేస్తానని చెప్పారు. ఆ తర్వాత షబ్బీర్‌ను మాట్లాడాలని దిగ్విజయ్ కోరగా.. ‘ఇదేమైనా సంతోషకరమైన సమయమా? మాట్లాడటానికేముంది?’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
 
30న టీ-కాంగ్రెస్‌లో సమీక్ష

డీఎస్‌పై ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నాం: దిగ్విజయ్

 తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించేందుకు నెలాఖరులో రెండు రోజులపాటు ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందుకు ఈ నెల 30, వచ్చే నెల 1న సమావేశం కానున్నట్లు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ ఓటమికి కారణాలపై లోతుగా అధ్యయనం చేస్తామన్నారు. కాగా, ఎమ్మెల్సీలను డబ్బులతో ప్రభావితం చేయడం వల్లే మండలి ప్రతిపక్ష నేతగా సీనియర్ నేత డీఎస్ ఎన్నికయ్యారంటూ ఎమ్మెల్సీ రాజలింగం చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో గాంధీభవన్‌లో దిగ్విజయ్ సమావేశమయ్యారు. ఈ విషయంలో పటిష్ట వ్యూహంతో ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలవారీగా ఫలితాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
 
 

Advertisement
Advertisement