Sakshi News home page

రైతుకు అండగా ఉంటాం

Published Sun, Nov 16 2014 1:40 AM

రైతుకు  అండగా ఉంటాం - Sakshi

జిల్లా కేంద్రంలోని వ్యవసాయమార్కెట్ యార్డు. నిత్యం కుప్పలు కుప్పలుగా వరి, మొక్కజొన్న, వేరుశనగ, ఆముదాలు ఇలా అన్ని రకాల ధాన్యం రాశులు ఉంటాయి. 1971లో ఏర్పాటైన ఈ మార్కెట్ యార్డులో ప్రతి ఏటా రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. మార్కెట్‌కు రూ.2.48 కోట్ల ఆదాయం వస్తోంది. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ యార్డును జేసీ శర్మన్ సందర్శించారు. రైతులు, హమాలీలు, దడవాయి, కమీషన్ ఏజెంట్లు, మార్కెటింగ్ ఏడీని పలుకరిస్తూ... ‘సాక్షి’ తరఫున విలేకరిగా మారారు. జేసీకి ఎదురైన అనుభవాలను పాఠకుల ముందుంచుతున్నాం.
 
జాయింట్ కలెక్టర్ ఎల్. శర్మన్ హామీలు..
 
మహబూబ్‌నగర్ వ్యవసాయ మార్కెట్‌యార్డును ప్రభుత్వ పరంగా మరింత ఉన్నత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటాం. ఈ సారి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా 72 ఐకేపీ, మహిళా సంఘాలు కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నాం. కనుక రైతులందరూ దళారులను ఆశ్రయించకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటిని సద్వినియోగం చేసుకొని, ధాన్యం విక్రయించి, ఆశించిన రేటు పొందండి. మొక్కజొన్నకు సంబంధించి పీఏసీఎస్ కూడా కొనుగోళ్లు చేస్తుంది. పత్తికి సంబంధించి సీసీఐ ఇప్పటికే షాద్‌నగర్, జడ్చర్లలో కొనుగోలు చేస్తుంది. త్వరలో నాగర్‌కర్నూల్, గద్వాలలో కూడా చేయనుంది. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే సాగు విషయంలో ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తున్నా... రైతులకు అవగాహన ఉండడం లేదు. ఈ విషయంలో వారికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం. అనేక కొత్త ఒరవడులు వస్తున్నాయి. వాటిని రైతులకు పరిచయం చేస్తాం. అన్ని రకాలుగా రైతుకు సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
 
శర్మన్
: మీరంతా రైతులేనా..? ఏజెంట్లు, ఇతరులు ఎవరైనా ఉన్నారా?
జవాబు: లేదు సారు.. ఇక్కడున్నొళ్లమంతా రైతులమే
శర్మన్: మీ పేరేంటి? ఎక్కడినుంచి వచ్చారు
రైతు: మాసన్న యాదవ్, అల్లీపూర్ నుంచి వచ్చిన
శర్మన్: ఏ ధాన్యం తీసుకొచ్చావు. మార్కెట్‌కు ఎప్పుడు వచ్చావు?
మాసన్న: వడ్లు తెచ్చిన. నిన్న తీసుకొచ్చిన. ఇయాల ఇంకా బీట్ కాలేదు.
శర్మన్: ఎన్ని ఎకరాలు వేస్తే ఎంత దిగుబడి వచ్చింది? ఖర్చు ఎంత..?
మాసన్న: నేను రెండు ఎకరాలు వేసిన..కరెంటు సరిగ లేక కొంత ఎండిపోయింది. ఎండిపోగ ఉన్నది తీసుకొచ్చిన. సారు ఎకరకు ఖర్చు అంటరా.. రేట్లు బాగ పెరిపోయినయి. ట్రాక్టరొళ్లకు కూళ్లు అన్నీ బాగా పెరిగినయి. ఎకరాకు 25వేల వరకు ఖర్చు వచ్చింది.
శర్మన్: ధాన్యాన్ని మార్కెట్‌కు తెస్తుంటారు కదా? నీవు నిన్నటి నుంచి ఉన్నవు ఇక్కడ ఏమైనా సమస్యలున్నాయా? అడ్తీదారుల నుంచి..
మాసన్న: పాపం అడ్తీదారులు ఏమనరు.
శర్మన్: మార్కెట్‌లో మధ్యాహ్నం భోజనం పెడతారా?
మాసన్న: లేదు సారు. బయటనే తింటాం. తినడానికి ఒక్కొక్కరికి 50 నుంచి 70 రూపాయలు అవుతున్నయి.
శర్మన్: నీవు తీసుకొచ్చిన వడ్లకు మార్కెట్‌లో ఎంత రేటుంది?
మాసన్న: నేనైతే 1010 రకం వడ్లు తీసుకొచ్చిన. రేటు అయితే కొంచెం డౌన్ అయ్యిందంటున్నరు. క్వింటాల్‌కు 1300 రూపాయలు పెడుతున్నరట.
శర్మన్: ధర ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకోవాలి కదా? బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.1600 పోతుందట? జిల్లాలో ఐకేపీ, మహిళా గ్రూపుల ద్వారా కూడా కొనుగోళ్లు జరుగుతున్నాయి కదా?
దశరథం: సారు మాది హన్వాడ మండలం బుద్దారం. మీరన్నట్లు ఎవరు కొంటరో మాకు తెల్వదు కదా? ఎప్పట్లాగనే మార్కెట్‌కుతెచ్చినం. వడ్లకు 1600 ఈ మార్కెట్ల లేదు సారు. మీరే చూడండి 1010కి క్వింటాల్‌కు ఆఖరికి 1400 పెట్టిండ్రట.
 శర్మన్: రెండు, మూడు రోజుల్లో ఐకేపీ సెంటర్లలో కొనుగోలు చేస్తారు. ఈ సంవత్సరం మొత్తం 76 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. కాస్త ఓపిక పట్టండి
దశరథం: మాకు తెలువకనే తీసుకొచ్చినం.
శర్మన్: మీరు పేపర్లు చదవరా?
మాసన్న: మాకు చదువనింకె రాదుకదా సారు. ఎవరు చెప్తరు
శర్మన్: ప్రతి ఒక్కరికీ చదవడం రాకపోయినా.. చాలామంది ఊళ్లో ఉంటారు కదా? వారి నుంచి తెలుసుకోవచ్చు కదా?
 దశరథం: ఎక్కడ సారు. ఊళ్ల చదువొచ్చిన పిల్ల లు ఉంటలేరు. ప్రైవేటు నౌకర్ల కోసం పట్నం పోతున్నరు. ఉన్న పిల్లలు కాపుదనం విషయా లు అస్సలు పట్టించుకోరు. మాకు చెప్పరు.
శర్మన్: ఈసారి వరి ఎండిపోయిందని చాలా మంది చెబుతున్నారు. అలా కాకుండా ఆరుతడి పంటలు పండించవచ్చు కదా?
దశరథం: పచ్చజొన్నలు ఏస్తే ఈనేటప్పుడు వానపడ్డది. ఉన్నది కాస్త నల్లగ అయినవి.
శర్మన్: సాంప్రదాయ పంటలు కాకుండా వాణిజ్య పంటలు వేయాలి. బాగా డబ్బు వచ్చేవి వేసుకోవాలి. పసుపు, పత్తి, మిర్చి లాంటివి వేయాలి.
రాజు: సారు మాది కార్కొండ. మా భూముల్లో పసుపు పండదు. పత్తి ఏసినం కానీ ఏం లాభం పంట పండకపాయే. పెట్టుబడి మొత్తం నెత్తిన పడ్డది. నేను మూడెకరాలు పత్తి పెడితే. పెట్టుబడి మొత్తం మీద పడ్డది. లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన ఏం లాభం లేదు.
శర్మన్: పత్తి ఎకరాకు ఎంత ఖర్చు అవుతది? దిగుబడి ఎంత ఉంటది?
రాజు: ఎకరాకు 30 నుంచి 40వేల దాకా ఖర్చు అయితది. పంట పండితే మస్తుగ ఉంటది కాని. ఏం లాభం.. ఈసారి వానలు పడకపాయే. దంటుకు 50 మొగ్గలు వచ్చినయి...
 శర్మన్: ఏదో నేను అడుగుతున్నానని కాదు..  నిజం చెప్పండి?
 రాజు: సారు అబద్ధం చెప్తే మాకు ఏమొస్తది. సారు ఇట్లే నా వెంటరా... పత్తి చేనుకు తీసుకుపోయి చూపిస్తా. బాగా గూడ వచ్చేటప్పుడే వానలు పోయినయి. చేన్లన్నీ దెబ్బతిన్నయి.
 శర్మన్: పత్తి బాగా పండితే, లాభం ఎంతుంటది?
 రాజు: వానలు కరెక్టుగా పడితే, పత్తిల మస్తు లాభముంటది. కానీ ఈసారి పోయింది. అంతా నెత్తిన పడ్డది. కూలీల రేట్లు బాగా పెరిగినయి. ఏం పాయిదా లేదు.
 శర్మన్: కౌలుకు తీసుకుంటే రైతుకు ఎంత మిగులుతుంది?
 రాజు: ఈ కాలంల భూమి కౌలుకు తీసుకొని చే యాలంటే చాన ఇబ్బంది. ఏం ఎల్లదు. వేస్టు.
 శర్మన్: ఇప్పుడు ఏ పంటలు వేస్తే రైతుకు లాభం కానీ తృప్తిగానీ ఉంటది?
 రాజు: ఏం పంటలున్నయి. వానలు పడితే అన్ని పంటలు నమ్మకంగానే ఉంటయి. వాన పడకపోతే అన్ని పోతయి.
 శర్మన్: కూరగాయలు ఎందుకు సాగు చేయరు? ప్రతిరోజూ డబ్బులు వస్తాయి కదా?
 బాల్యనాయక్: సారు మాది కోయిల్‌కొండ మండలం అభగపట్నం. కూరగాయలకు చాన తెగుళ్లు తగుల్తయి. మొలక కూడా ఎత్తనీయవు.. పురుగులు. పాలమూరు మందులు ఎన్ని కొట్టినా కంట్రోల్ కాదు..
 శర్మన్: మార్కెట్‌లో చాలా రకాల కూరగాయలు వస్తున్నాయి.. కదా. అవి కూడా రైతులు పండించినవే కదా?
 బాల్యనాయక్: ఏమో సారు మేం ఏసి చూసినం. పంట రాదు. పురుగులకు తట్టుకోలేం.
 శర్మన్: పల్లీలు తెచ్చారు. ఖరీఫ్‌లో పండించినవేనా?
 రాములు(ఓగులాయపల్లి): లేదు సారు. పోయిన ఏడాది పంట. విత్తనం కోసం అట్లే ఉంచినం. ఈ సారి కాలం కాకపాయే అనుకున్నంత అమ్ముడుపోలే. మిగిలింది మార్కెట్‌కు తెచ్చిన.
 శర్మన్: వానలు పడ్డాయి కాని, డ్రై పిరియడ్.. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో పడనందు వల్ల ఇబ్బంది వచ్చింది.
 శర్మన్: మీరు  ఏం తెచ్చారు? మీ సమస్యలేంటి?
 రాంరెడ్డి: వడ్లు తెచ్చిన కానీ.. ఏం చెప్పమంటరు సారు.. మాకు చాన ఇబ్బంది ఉంది. పంట మొ త్తం షావుకారి అప్పుకే సరిపోతలేదు. ఏం చేయలే.
 శర్మన్: ముందుగానే డబ్బులు ఎందుకు తీసుకుంటారు?
 రాంరెడ్డి: పెట్టుబడి ఎట్ల ఎల్తది. విత్తనం కా నుంచి ఎరువు బస్తలు, కూళ్లు అన్ని పైసలు లేకపోతే పని నడవదు కదా? అందుకే సేటుతో నుంచి అప్పు తీసుకొని, పంట పండిన తర్వాత పట్టిస్తం.
 శర్మన్: బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి కదా?
 రాంరెడ్డి: ఎక్కడ సారు... కేసీఆర్ మొత్తం మో సం చేసే. బ్యాంకుల మాఫీ అని చెప్పే.. మాకు అప్పు పుట్టకుండా చేసే. బ్యాంకోళ్లు పైసలే ఇస్తలేరు.
 శర్మన్: మీరు హమాలీలా..? ఏం పేరు? ఎన్నాళ్ల నుంచి ఈ పనిచేస్తున్నారు?
 హమాలీలు: సారు నా పేరు వెంకటయ్య, ఈ యన పేరు రాములు. మేం పది ఏళ్ల నుంచి ఈ మార్కెట్‌లనే పని చేస్తున్నాం.
 శర్మన్: గుర్తింపు కార్డులు ఉన్నాయా? ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా?
 వెంకటయ్య: గుర్తింపు కార్డులు యూనియన్ వాళ్లు ఇచ్చారు. ఇబ్బందులంటే ఉన్నయి. మా కు ఇక్కడ మూడు నెలలే నడుస్తది. ఉన్నకాడికి చేసుకొవాలే. ఉండాలే.
 శర్మన్: ఎందుకు సంవత్సరం పొడువునా ఏవో పంటలు వస్తాయి కదా?
 వెంకటయ్య: లేదు సారు.. నాలుగు నెలలు ఊకనే ఉంటది.
 శర్మన్: బస్తాకు ఎంత తీసుకుంటారు?
 వెంకటయ్య: బండి నుంచి దించి కుప్ప పోస్తం, తర్వాత కాంటకు పెడతం అందుకు పైసలిస్తరు.
 శర్మన్: డబ్బులు రైతులిస్తారా? కమీషన్ ఏజెంట్ ఇస్తారా?
 వెంకటయ్య: రైతుల నుంచే కట్ చేసి .. షావుకారి ఇస్తడు.
 శర్మన్: ఎంత కట్ చేస్తరు?
 వెంకటయ్య: పక్కాగా మాకు తెల్వదు.సేటును అడుగుతే తెలుస్తది.
 శర్మన్: రోజుకు ఎంత గిట్టుబాటు అవుతది?
 రాములు: సారు నాకు మాట్లాడనింకె రాదు. నేను వెంకటయ్య ఒక్కటే. ఆయననే చెప్తడు.
 వెంకటయ్య: మార్కెట్ వచ్చే బస్తాలను బట్టి ఉంటది. నిన్న 200రూపాయలు వచ్చినయి.
 శర్మన్: తక్కువ చెబుతున్నట్లు ఉన్నావ్?
 వెంకటయ్య: అట్లేం లేదు సారు. మార్కెట్ కు ధాన్యం బాగ వస్తే మాకు నాలుగు పైసలొస్తయి. మంచిగ నడిచిన నాడు వెయ్యి రూపాయ ల దాక వస్తయి.
 శర్మన్: హమాలీలకు వసతులు ఉన్నాయా? విశ్రాంతి గదితో పాటు ఇతర సౌకర్యాలు?
 వెంకటయ్య: ఉన్నాయి.
 శర్మన్: మీరు మార్కెట్‌లో ఏం చేస్తుంటారు?
 వెంకట్రావు: సారు మేం దడువాయి..
 శర్మన్: తూకం చేసేవారు అన్నమాట... ఏమైనా తేడాలు చేస్తుంటారా?
 వెంకట్రావు: (నవ్వుతూ) అదేం లేదు సారు. మేం అట్ల చేయం. పక్కాగా ఉంటది.
 శర్మన్: ఇంకా ఏమైనా సమస్యలున్నాయా?
 వెంక ట్రావు: మార్కెట్‌కు సరకు వస్తలేదు. అంతా బయట బయటనే మిల్లులకు పోతుంది.
 శర్మన్: మీరు కమీషన్ ఏజెంట్‌నా? ఎన్నాళ్ల నుంచి చేస్తున్నారు.. ఈ మార్కెట్‌లో?
 నారాయణ: నేను కమీషన్ ఏజెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఇదే మార్కెట్‌ల చేస్తున్నా.
 శర్మన్: గిట్టుబాటు అవుతుందా?
 నారాయణ: ఎక్కడ సార్.. మా పరిస్థితి కూడా రై తుల లాగనే. వ్యవసాయం రోజు రోజుకు చాన భారంగా మారింది. రైతులు మా వద్ద ముందు రూ.45వేలు తీసుకెళ్తే.. వాళ్లు తెచ్చిన ధాన్యం దానికే సరిపోతది. అవి తేరగానే మళ్లీ అప్పు చేస్తడు...
 శర్మన్: అప్పు అంటున్నరు... వడ్డీ ఎంత తీసుకుంటారు?
 నారాయణ: నూటికి రెండు రూపాయలు వేసుకుంటం.
 శర్మన్: అలా తీసుకోవడం తప్పు కదా, చట్ట ప్రకారం నేరం కూడా?
 నారాయణ: మమ్మల్ని ఏం చేయమంటరు సా ర్.. మేం కూడా బయట అప్పు తీసుకొస్తున్నాం. కదా? మేం తెచ్చిన పైసలువడ్డీలు కడుతున్నాం.
 శర్మన్: మీ విషయం పక్కన పెట్టండి. అలా చేయకూడదు.
 శర్మన్: ఏడీ గారు మీరు చెప్పండి.. రైతుకు గిట్టుబాటు ధర అందుతుందా?
 బాలామణి: ఎంఎస్‌పీ కంటే అధికంగానే వస్తోంది. హంస మద్దతు ధర 1360 ఉండగా.. 1400 పైగానే ధర వస్తోంది. సోనమసూరి రకం అత్యధికంగా రూ.1900 వరకు పోతుంది.
 శర్మన్: మార్కెట్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా? రైతులకు మధ్యాహ్నం బోజనం పెడుతున్నారా?
 బాలామణి: శుద్ధమైన తాగునీరు అందిస్తున్నాం. భోజనం మాత్రం లేదు సారు. ప్రభుత్వానికి ప్ర పోజల్స్ పంపించాం. ఇంకా ఆచరణలోకి రాలేదు.
 

Advertisement
Advertisement