నవోదయ.. ఇదేం మాయో! | Sakshi
Sakshi News home page

నవోదయ.. ఇదేం మాయో!

Published Sat, Feb 7 2015 5:43 AM

నవోదయ.. ఇదేం మాయో! - Sakshi

మధిర: గ్రామీణప్రాంతంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన అదునాతన విద్యనందించాలనే లక్ష్యంతో జాతీయస్థాయిలో జవహర్ నవోదయ విద్యాలయాలను స్థాపించారు. జిల్లాలో పాలేరు, భద్రాచలంలో ఈ విద్యాలయాలు ఉన్నాయి. పాలేరులో మైదానప్రాంత విద్యార్థులు విద్యనభ్యసిస్తారు. దీనికి 28 మండలాల విద్యార్థులు ప్రవేశపరీక్ష రాస్తారు. ఎంపికైనవారు 6వ తరగతితో ప్రవేశానికి అర్హులవుతారు. భద్రాచలం విద్యాలయంలో ఏజెన్సీప్రాంత విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

5వ తరగతి చదువుకునే విద్యార్థుల్లో అర్హులు ఈ ప్రవేశపరీక్షకు హాజరవుతారు. ఎంపికైన విద్యార్థులు నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతినుంచి ఇంటర్మీడి యెట్ వరకు సెంట్రల్ సిలబస్‌తో ఉచిత విద్యను అభ్యసిస్తారు. ఈ క్రమంలో శనివారం నవోదయ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది జిల్లాలో 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రవేశపరీక్షకు 4,909మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
 
పలు అనుమానాలు
ఈ ప్రవేశపరీక్షల్లో కొన్ని సెంటర్ల నుంచి పరీక్షరాసిన విద్యార్థులకు ఎక్కువసీట్లు లభిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సెంటర్లనుంచి పరీక్ష రాసిన విద్యార్థులకు మాత్రమే అధిక సీట్లు సాధించి, మరికొన్ని సెంటర్లలో పరీక్ష రాసిన విద్యార్థులకు ఒక్కసీటుకూడా రాకపోవడంలలో ఆంతర్యమేమిటని పలువవురు ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం, కల్లూరు, ఇల్లెందు సెంటర్ల పరిధిలో ప్రవేశపరీక్ష రాసిన విద్యార్థులు ఎక్కువమంది ఎంపిక కావడంతోపాటు వరుస నెంబర్లు కలిగిన విద్యార్థులు సీట్లు సాధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
వరుస మాయాజాలం..!
2012-13 సంవత్సరంలో 12 సెంటర్లలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. కల్లూరు, పెనుబల్లి మండలాలకుగాను కల్లూరులోని ఏపీఎస్ డ బ్ల్ల్యూఆర్‌ఎస్ పరీక్ష కేంద్రం నుంచి 274 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 10మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇల్లెందు, కామేపల్లి మండలాలకు ఇల్లెందులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పరీక్ష కేంద్రంలో 320 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 16 మంది అర్హత సాధించారు. ఖమ్మం అర్బన్ మండలం నుంచి ఖమ్మంలోని న్యూవిజన్ కాన్సెప్ట్ స్కూల్లో పరీక్షకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ 340 మంది పరీక్షలు రాయగా 11మంది అర్హత సాధించారు.

ఈ మూడు పరీక్ష కేంద్రాల పరిధిలో 37 మంది విద్యార్థులు అర్హత సాధించారు. జవహర్ నవోదయ విద్యాలయంలో మొత్తం సీట్లు 80 ఉండగా మిగిలిన 9 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాసిన విద్యార్థుల్లో జిల్లాలోని మిగిలిన అన్ని మండలాల నుంచి 43 మంది ఎంపికయ్యారు. 2014-15 విద్యాసంవత్సరానికి ఫిబ్రవరి 8న పరీక్ష నిర్వహించారు. 28 మండలాల నుంచి 4,123 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకోగా 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కల్లూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో రాసిన విద్యార్థుల్లో 9 మంది, ఖమ్మం న్యూ విజన్ హైస్కూల్, రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం 13 మంది విద్యార్థులు ప్రవేశపరీక్షల్లో ర్యాంకు సాధించారు. కూసుమంచిలోని జెవీఆర్ కళాశాలలో పరీక్ష కేంద్రం నుంచి అత్యధికంగా 14 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
 
కోచింగ్ సెంటర్ల ప్రభావమేనా..?
మూడు సంవత్సరాలుగా జరుగుతున్న జవహర్ నవోదయ ప్రవేశపరీక్షల్లో అత్యధికంగా కల్లూరు, ఇల్లెందు, ఖమ్మం సెంటర్ల నుంచి విద్యార్థులు ఎంపికవుతున్నట్లుగా తెలుస్తోంది. వారిలోనూ వరుస నెంబర్లు కలిగిన విద్యార్థులు ఎంపికవడం, కల్లూరు, ఇల్లెందు, ఖమ్మంలోని కొన్ని కోచింగ్ సెంటర్ల వారి పాత్రపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉండే ఇన్విజిలేటర్లను నియమించుకోవడం, కొంతమందికి ముడుపులు చెల్లించుకుంటూ అవకతవకలకు పాల్పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
కోచింగ్ సెంటర్ల పాత్ర ఉంది
గత ఏడాది మా అబ్బాయి పరీక్షలు రాశాడు. 5వ తరగతిలో ఎప్పుడూ 90 శాతం మార్కులు తగ్గలేదు. కానీ నవోదయలో సీటు రాలేదు. కొన్ని సెంటర్లలో వరుస నంబర్ల విద్యార్థులు ఎంపికయ్యారు. ఇది ఎలా సాధ్యమవుతోంది. కేవలం నాలుగైదు కోచింగ్ సెంటర్ల నుంచే 80 శాతం సీట్లకు పైగా సీట్లు వస్తుండటం అనుమానం కలిగిస్తోంది.
 -పీట్ల ఎల్లయ్య, మడుపల్లి, మధిర మండలం
 
రిజర్వేషన్లకు అనుగుణంగా ఎంపిక
 జవహర్ నవోదయ ప్రవేశపరీక్షల్లో రిజర్వేషన్లకు అనుగుణంగా ఎంపికైన విద్యార్థులే సీట్లు పొందుతారు. ఢిల్లీ స్థాయిలో జరిగే ఈ పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు జరగవు. పరీక్షపత్రాలు కూడా ఢిల్లీ నుంచి వస్తాయి. కోచింగ్ సెంటర్లు, పరీక్షల నిర్వహణకు ఎటువంటి సంబంధం లేదు. - వి.వెంకటేశ్వర్లు, నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్, పాలేరు

Advertisement

తప్పక చదవండి

Advertisement