‘ఆకాశం కోల్పోయిన పక్షి’  | Sakshi
Sakshi News home page

‘ఆకాశం కోల్పోయిన పక్షి’ 

Published Sun, Apr 8 2018 3:30 AM

Journalist and poet Krishna Rao poetry invention - Sakshi

హైదరాబాద్‌: జర్నలిస్టు, కవి ఎ.కృష్ణారావు రచించిన ‘ఆకాశం కోల్పోయిన పక్షి’కవితా సంపుటి ఆవిష్కరణ సభ శనివారం హైదరాబాద్‌ నాంపల్లిలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది. ఎమెస్కో విజయ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్యఅతిధిగా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు చంద్రశేఖర కంబార హాజరై సంపుటిని ఆవిష్కరించి ప్రసంగించారు. రచయిత కృష్ణారావు గొప్ప కాల్పనిక కవి అన్నారు. జర్నలిస్టుగా ఉంటూ కవిత్వం రాసే కవులు చాలా అరుదుగా ఉంటారని అన్నారు.

నగ్నముని మాట్లాడుతూ ఈ కవితా సంపుటికి తనకు ముందుమాట రాసే అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సాహిత్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కవులను ప్రోత్సహించడానికి ప్రైవేట్‌ పబ్లిషర్స్‌ ముందుకు రావాలని కోరారు. కవి, రచయిత దేవీప్రియ మాట్లాడుతూ సాహిత్య, సామాజిక విశ్లేషణలపైనే కాకుండా వర్తమాన చరిత్రపై చర్చ జరగాలని కోరారు. కవి కె.శివారెడ్డి మాట్లాడుతూ ఇండియాగేట్‌తో కవిత్వ సాగును ప్రారంభించిన కృష్ణారావు మరెన్నో సంపుటాలను తీసుకురావాలని కోరారు. 

Advertisement
Advertisement