సురక్షిత ప్రయాణం | Sakshi
Sakshi News home page

సురక్షిత ప్రయాణం

Published Mon, Jan 22 2018 4:49 PM

journey in rtc is safe - Sakshi

జనగామ: ఆర్టీసీ ప్రయాణం సురక్షితం..సుఖవంతం అనే నినాదం ప్రతి బస్సుపైనా కనిపిస్తుంది. అంకితభావం కలిగిన డ్రైవర్లు ఈ నినాదాన్ని అక్షర సత్యంగా మార్చారు. ప్రైవేట్‌ వాహనాలతో పోలిస్తే ఆర్టీసీ ప్రయాణం సురక్షితమన్న భావన ప్రజలకు కల్పించడంలో సఫలీకృతులయ్యారు. జిల్లాలో ఆర్టీసీ బస్సుల ద్వారా జరిగిన ప్రమాదాలు స్వల్పం. ఈ నెల19 నుంచి ప్రారంభమైన ఆర్టీసీ రోడ్డు భద్రతా వారోత్సవాలు 25 వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బందికి అధికారుల ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు.  

ఆర్టీసీలో ప్రతి సంవత్సరం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదాల నివారణపై డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు. బస్సు కండీషన్, డ్రైవింగ్‌ చేసే సమయంలో ఏకాగ్రత.. ప్రయాణికులతో ఎలా ఉండాలనే దానిపై నిపుణులతో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. బస్సును ఈ రోజు పూర్తి ఏకాగ్రతతో నడిపిస్తాను, అవసరమైన సమయంలో వేగాన్ని నియంత్రణ చేస్తూ, ప్రయాణికులకు సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తానని డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఉత్తమ డ్రైవర్లకు బహుమతులను అందిస్తున్నారు. 

తగ్గిన ప్రమాదాలు...
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితనే భావన ప్రయాణికుల్లో బలంగా నాటుకు పోయింది. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల ద్వారా జరిగిన ప్రమాదాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా డ్రైవర్‌పై పని ఒత్తిడి తక్కువ. మూడేళ్లుగా జనగామ జిల్లా పరిధిలో ఆర్టీసీ ప్రమాదాలు తక్కువనే చెప్పుకోవచ్చు. 2015తో పోలిస్తే 2016లో ప్రమాదాల సంఖ్య తగ్గింది. 2015లో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. చిన్నవి, పెద్దవి కలుపుకుని జరిగిన ప్రమాదాల్లో 12 మంది క్షతగాత్రులయ్యారు. 2016లో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడగా..మేజర్, మైనర్‌ ప్రమాదాల్లో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 2015తో పోలిస్తే మూడు శాతం మేర ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. 2017 ఏప్రిల్‌లో సిద్దిపేట జిల్లా కేంద్రంలో జనగామ డిపోకు చెందిన బస్సు ఢీకొని ఓ మహిళ చనిపోగా.. తొమ్మిది రోడ్డు ప్రమాదాల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. 

జాతీయ రహదారిపై..
వరంగల్‌–హైదరాబాద్, సిద్దిపేట–విజయవాడ జాతీయ, స్టేట్‌ హైవేలపై ప్రైవేట్‌ వాహనాల రోడ్డు ప్రమాదాలు ఎక్కువే. అతివేగం, మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా.. అమాయకులను బలి చేస్తున్నారు. జనగామ జిల్లాలో 2015 సంవత్సరంలో జాతీయ, రాష్ట్ర రహదారిలో 320 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగగా..ఇందులో 170 మందికి పైగా మృతి చెందారు. 350 మందికి పైగా తీవ్ర, స్వల్ప గాయాలయ్యాయి. డ్రంకెన్‌ డ్రైవ్, పోలీసు పెట్రోలింగ్, నిరంతర నిఘా పెంచడంతో 2016లో ప్రమాదాల సంఖ్య 292కు తగ్గి పోయింది. ఈ ప్రమాదాల్లో 133 మంది అక్కడికక్కడే చనిపోగా.. 299 మంది గాయాల పాలయ్యారు. 2017లో 265 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగగా..100కు పైగా మృతి చెందారు. 

నేడు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌..
తరుచూ రోడ్డు ప్రమాదాలు చేస్తున్న డ్రైవర్లకు కుటుబ సభ్యులతో కౌన్సెలింగ్‌ ఇస్తారు. డ్రైవర్‌ ఇంటి నుంచి వెళ్లే క్రమంలో ఎలాంటి చికాకులు ఉండకుండా సంతోషంగా ఉండేలా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు వివరిస్తారు. బస్సులో ప్రయాణిస్తున్న ఎన్నో కుటుంబాలు డ్రైవర్‌పై ఆధారపడి ఉంటాయన్న విషయాన్ని గర్తుంచుకోవాలని సూచిస్తారు.    

23న బస్సు కండీషన్‌పై అవగాహన
బస్సు కండీషన్, ప్రమాదాన్ని గమనించి వేగాన్ని ఎలా అదుపు చేసుకోవాలనే దానిపై మంగళవారం అవగాహన కలిగిస్తారు. గతంలో రోడ్డు ప్రమాదాలు చేసిన డ్రైవర్లకు ఉత్తములతో శిక్షణ ఇప్పిస్తారు. అవసరమైన సమయంలో వారిని శిక్షణ కోసం రీజియన్‌కు పంపిస్తారు.  

24న ఉత్తమ డ్రైవర్లకు సత్కారం
వారోత్సవాల ముగింపులో ఉత్తమ సేవలందించిన డ్రైవర్లను బుధవారం సత్కరిస్తారు. మిగతా వారికి స్ఫూర్తిగా నిలిచేలా వారి ఫొటోలను ప్రదర్శిస్తారు. విజయాలు అందరికి తెలిసేలా వారి సర్వీసు రికార్డులో ఫొటోలు ఉంచుతారు.

25న సేవా కార్యక్రమాలు
రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం రక్తదాన శిబిరాలు, సేవా కారక్రమాలను చేపడుతారు. డ్రైవర్లు రక్తదానం చేసి తమలోని మానవత్వాన్ని చాటుకుంటారు. అత్యవసర సమయంలో ఈ రక్తాన్ని వినియోగిస్తారు. 

ప్రయాణికుల సేవలో..
జనగామ డిపో పరిధిలో 125 బస్సులు నిత్యం 40 వేల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చుతున్నాయి. ఆర్టీసీలో రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువ. వంద శాతం యాక్సిడెంట ఫ్రీ జోన్‌గా జనగామను తీర్చి దిద్దేందుకు డ్రైవర్లకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నాం. గత మూడేళ్లుగా పరిశీలిస్తే ప్రమాదాలను చాలా వరకు నియంత్రించగలిగాం.    – శ్రీనివాసరావు, జనగామ డిపో మేనేజర్‌ 

ఆర్టీసీ రూల్స్‌ పాటించాలి
వాహన డ్రైవర్లు, యజమానులు ఆర్టీ రూల్స్‌ ప్రకారం నడుచుకోవాలి. అన్ని అనుమతులు పొందిన తర్వాతనే వాహనాన్ని రోడ్డు ఎక్కించాలి. ముఖ్యంగా ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, లైసెన్స్‌ ఉండేలా చూసుకోవాలి. ఓవర్‌లోడ్‌ ఉంటే కేసులు తప్పవు. నిబంధనలు పాటించని వాహనాలపై కేసులు నమోదు చేస్తూ..అవగాహన కలిగిస్తున్నాం. మధ్యం సేవించి ఎవరూ కూడా డ్రైవింగ్‌ చేయరాదు. ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్‌ వాడకం తప్పనిసరి చేసుకోవాలి.     – రమేష్‌రాథోడ్, డీటీఓ, జనగామ 

Advertisement
Advertisement