జంట పేలుళ్ల కేసులో 27న తీర్పు | Sakshi
Sakshi News home page

జంట పేలుళ్ల కేసులో 27న తీర్పు

Published Wed, Aug 8 2018 2:22 AM

Judgment on 27 of the explosion case

సాక్షి, హైదరాబాద్‌: పుష్కరకాలం క్రితం చోటు చేసుకున్న గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ జంట పేలుళ్ల కేసు విచారణ మంగళవారంతో పూర్తయింది. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిజిగ్నేటెడ్‌ న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ కేసులో తీర్పును ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 27న వెలువరించనుంది. కొన్నాళ్ల క్రితం వరకు నాంపల్లి కోర్టులోనే ఈ కేసుల ట్రయల్‌ నడిచినప్పటికీ వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రత్యేక కోర్టును జైలు ఆవరణలోనే ఏర్పాటు చేశారు.

దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసుల విచారణకు వినియోగించిన స్పెషల్‌ కోర్టు ప్రాంగణాన్నే ఈ కేసుల కోసం వినియోగించారు. రెండు నెలల నుంచి ట్రయల్‌ ప్రక్రియ వేగవంతమైంది. 2007 ఆగస్టు 25న జరిగిన ఈ ఉగ్రవాద చర్యలో 42 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 300 మంది వరకు క్షతగాత్రులయ్యారు. అదే రోజున దిల్‌సుఖ్‌ నగర్‌లోని వెంకటాద్రి థియేటర్‌ సమీపంలో ఉన్న పేలని బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఉదంతాలకు సంబంధించి నమోదైన మూడు వేర్వేరు కేసుల్లో మొత్తం 8 మంది ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాదులు నిందితులుగా ఉన్నారు. పరారీలో ఉన్న అమీర్‌ రజాఖాన్, రియాజ్‌ భత్కల్, ఇక్బాల్‌ భత్కల్‌ మినహా మిగిలిన అనీఖ్, సాదిక్, ఫారూఖ్, ఇస్మాయిల్, తారీఖ్‌ అంజుమ్‌ ఎహసాన్‌లపై విచారణ జరిగింది. ఈ నెల 27న తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో పోలీసు విభాగం జైలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనుంది.

Advertisement
Advertisement