ప్రయోగం మిథ్య | Sakshi
Sakshi News home page

ప్రయోగం మిథ్య

Published Mon, Dec 22 2014 3:59 AM

ప్రయోగం మిథ్య

‘సైన్స్ ప్రగతికి మూలం.... మానవ జాతికి విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలే ప్రధానం...విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేలా ప్రయోగపూర్వక బోధనలు కావాలి... ‘సామాన్యు’డిని సైతం అత్యున్నత స్థానాలకు చేర్చగలిగే సత్తా సైన్స్‌కుంది’. ఇలా ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, వక్తలు తరచు సైన్స్‌ఫేర్‌లు, ఎగ్జిబిషన్లు, ఇతర వేదికల్లో ప్రయోగ విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగిస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రయోగం ‘కళ’యే గానీ ప్రయోగాల బోధన ‘కల’గా మిగిలిపోతున్నది.
 
జూనియర్ కాలేజీల్లో కరువైన ల్యాబ్‌లు
* విద్యార్థులకు అందని ప్రయోగ విజ్ఞానం
* మార్కుల స్కోరింగ్‌కే ఉపయోగపడుతున్న ప్రాక్టికల్స్
* ప్రైవేటు కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలకు అదనపు వసూళ్లు

నల్లగొండ అర్బన్ : పెరుగుతున్న సాంకేతికత సైన్స్ వినియోగాన్ని విస్తృతం చేసింది. దీనివల్ల ప్రయోగ పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా మారుతోంది. ప్రయోగాలపై అవగాహన కలిగించాలన్నా, శాస్త్రీయంగా బోధించాలన్నా ఆయా విద్యాసంస్థల్లో ప్రయోగశాలలుండాలి. కానీ జిల్లాలో చాలా జూనియర్ కాలేజీల్లో ల్యాబ్‌ల వసతి కరువైంది. దీంతో ప్రాక్టికల్స్ (ప్రయోగాల) బోధన కలగా మిగిలిపోతున్నది. చాలా కాలేజీల్లో సైన్స్ విద్యార్థులకు, ఆర్ట్స్ వారికి తేడా లేకుండా పోతోంది. వారైనా, వీరైనా థియరీ చదువులకే పరిమితమైపోతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రయోగపాఠాలు మ్యాథ్స్, సైన్స్ విద్యార్థులు ఇంటర్ మార్కుల్లో బాగా స్కోర్ చేసేందుకు ఉపయోగపడడం తప్ప వారిలో ప్రయోగ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తున్నది శూన్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలావరకు ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో పరీక్షలకు కొన్ని రోజుల ముందు తాత్కాలికంగా ప్రయోగశాలలు ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా ఒకటి రెండు ప్రయోగాలు చేయించి చేతులు దులిపేసుకుంటున్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు వచ్చే చీఫ్ (సీఎస్)లు డిపార్ట్‌మెంటల్ అధికారులను మచ్చిక చేసుకుంటే సరి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. ప్రాక్టికల్ పరీక్షలు ఏటా ఓ తంతుగా ముగించేస్తున్నారు.
 
‘ఇన్‌స్పైర్’ కానట్లే...

విజ్ఞానశాస్త్రంలో నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించాలనే ఆశయంతో సైన్స్‌పై ఆసక్తిని పెంచి బాల్యం నుంచే సృజనాత్మకతను వెలికితీసే ప్రయోగాల వైపు ఆకర్శించేందుకు హైస్కూల్ స్థాయిలో ప్రవేశపెట్టిన ‘‘ఇన్‌స్పైర్’’ అక్కడి వరకే పరిమితమైపోతున్నది. ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ కోసం ప్రతి ఆప్షనల్ సబ్జెక్టులో 40 తరగతులుంటాయి. ప్రథమ సంవత్సరంలో 20, ద్వితీయ సంవత్సరంలో 20 ప్రయోగాల చొప్పున చేయించాలి. థియరీతోపాటు ప్రాక్టికల్ తరగతులను ప్రత్యేకంగా నిర్వహిం చాలి. కానీ జిల్లాలోని ఎక్కువ శాతం ప్రైవేటు కాలేజీల్లో వీటి ఊసే ఉండట్లేదు. పరీక్షల సమయంలో కొద్ది రొజుల ముందు మొక్కుబడిగా ‘సెలక్టెడ్’ అంశాలపై ప్రాక్టికల్స్ తరగతులను నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి
 
జిల్లాలో 246 జూనియర్ కాలేజీల్లో...
జిల్లా వ్యాప్తంగా 299 జూనియర్ కాలేజీల నిర్వహణకు అనుమతి ఉంది. కానీ అడ్మిషన్లు లేకపోవడం, తదితర కారణాలతో 53 కాలేజీలు మూతపడ్డాయి. మిగతా 246 కాలేజీలే నడుస్తున్నాయి. వాటిల్లో 30 ప్రభుత్వ, 4 ఎయిడెడ్, 13 రెసిడెన్షియల్ కాలేజీలు, 33 మోడల్ స్కూళ్లతోపాటు 166 ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీల్లో ఇంటర్ విద్యనందిస్తున్నారు. ల్యాబ్‌లు ఇతర అన్ని సౌకర్యాలుంటేనే కాలేజీ నిర్వహణకు అనుమతి ఇవ్వాలి. కానీ 75 శాతానికిపైగా ప్రైవేటు కాలేజీల్లో ప్రయోగశాలలకు సరైన వసతిలేదు. నిబంధనల ప్రకారం సౌకర్యాలు లేవు, అయినా ఆయా కాలేజీలకు ప్రాక్టికల్ సెంటర్లు కేటాయిస్తున్నారు. పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. బ్రహ్మాండమైన మార్కులుపడుతూనే ఉన్నాయి.

విశేషమేమంటే ల్యాబ్‌ల వసతి ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మెరిట్ మార్కులతో సీట్లు పొందిన విద్యార్థులకంటే, 10వ తరగతిలో అంతంత మాత్రం గ్రేడ్ పాయింట్లతో పాసై ప్రైవేటు కాలేజీల్లో చేరిన వారికి ల్యాబ్‌లు లేకున్నా బైకిబై (నూరుశాతం) ప్రాక్టికల్ మార్కులొస్తున్నాయి. నల్లగొండలోని ఓ జాతీయ బ్యాంక్ భవనంపై ఉన్న జూనియర్ కాలేజీలో రెండేళ్ల క్రితం ల్యాబ్‌ల వసతి లేకున్నా ప్రాక్టికల్ సెంటర్ కేటాయించారని ఫిర్యాదులొచ్చాయి. పరీక్షలెలా నిర్వహిస్తున్నారని తనిఖీకి వెళ్లినవారు గేటుకు తాళం వేసి ఉండటంతో ఖాళీగా వెనుదిగాల్సి వచ్చింది.
 
ఈ యేడు ప్రాక్టికల్స్‌కు 29588 మంది విద్యార్థులు...
ఈ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలను 2015 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు నిర్వహించబోతున్నారు. ఇందుకు 128 కాలేజీల్లో సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. 8564 మందిపై బైపీసీ విద్యార్థులు కాగా 21024 మంది ఎంపీసీ విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. చాలా ప్రైవేటు కాలేజీల్లో పూర్తిస్థాయి సామగ్రి, ల్యాబ్‌లు లేకున్నా సెంటర్లు కేటాయించే జాబితాలో ఉంచి ఇంటర్ బోర్డుకు ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. ప్రయోగశాలలు కాదు కనీసం ప్రయోగాలకు అవసరమయ్యే టేబుళ్లు, ఇతర పరికరాలు కూడా లేనట్లు తెలిసింది. పరీక్షల సమయంలో సినిమా సెట్టింగుల మాదిరిగా అప్పటికప్పుడు తరగతి గదిని ప్రయోగ గదిగా మార్చి టేబుళ్లు వేసి రెడీమేడ్‌గా లభించే కెమికల్స్, ఇతర ఎగ్జిబిట్లు, చార్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
 
ర్యాంకుల తారుమారు...
ఇప్పటివరకు ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజీ కల్పిస్తుండటంతో ప్రాక్టికల్ మార్కులు కీలకంగా మారాయి. పలువురి విషయంలో ఈ మార్కులతో ర్యాంకులు తారుమారైన ఉదంతాలున్నాయి. రాత పరీక్షల్లో 60 శాతం మార్కులు పొందలేక పోయిన వారు కూడా ప్రాక్టికల్స్‌లో 100 శాతం మార్కులు పొందగలుగుతున్నారు. దీంతో ఎంసెట్ ర్యాంకులపై ప్రభావం పడుతున్నది.

ప్రాక్టికల్స్ మార్కులకున్న మార్కుల ప్రాధాన్యతనుబట్టి పలు ప్రైవేటు కాలేజీల వారు తమకు అనుకూలమైన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను నియమించుకునేందుకు ‘అన్ని’ విధాలా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాక్టికల్స్ కోసం విద్యార్థుల నుంచి రూ.100 ఫీజు వసూలు చేయాల్సి ఉండగా ఈ ఏడాది కొన్ని కాలేజీల్లో రూ.1000 నుంచి రూ.4 వేల దాకా వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. వీటితో కార్యాలయం వారిని మేనేజ్ చేయడంత పాటు సీఎస్, డీఓలకు నజరానాలిచ్చి పిల్లలకు కావాల్సిన మార్కులు వేయిస్తున్నారని ఆరోపణలున్నాయి.
 
ప్రాక్టికల్‌కు ప్రాధాన్యమివ్వాలి : నెమ్మాది ప్రకాశ్‌బాబు, ఆర్‌ఐఓ నల్లగొండ
అన్ని కాలేజీల్లో ప్రాక్టికల్ తరగతులకు ప్రాధాన్యమివ్వాలి. ఒక విద్యా సంవత్సరంలో కనీసం 30 నుంచి 40 క్లాసులకు బ్యాచ్‌ల వారీగా వారానికో క్లాస్ తీసుకోవాలి. ఫస్టియర్‌లో కూడా ప్రాక్టికల్స్ చేయించాలి. కాకపోతే ప్రాక్టికల్ పరీక్షలు ద్వితీయ సంవత్సరంలోనే ఉంటాయి. మొక్కుబడిగా నిర్వహించే కాలేజీలను తనిఖీ చేస్తాం. కొన్ని కాలేజీల్లో పరీక్షలకు ముందు ల్యాబ్‌ల తలుపులు తెరుస్తారనేది మా దృష్టిలో కూడా ఉంది. పరీక్షలకు ఫీజును ఎక్కువ వసూలు చేయరాదు. తల్లిదండ్రులు మా దృష్టికి తేవాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement