పరీక్షలకు.. ‘జూడా’లు అనర్హులు | Sakshi
Sakshi News home page

పరీక్షలకు.. ‘జూడా’లు అనర్హులు

Published Thu, Nov 13 2014 1:55 AM

పరీక్షలకు.. ‘జూడా’లు అనర్హులు

సాక్షి, హైదరాబాద్: ‘జూనియర్ డాక్టర్ల సమ్మె మొదలై బుధవారానికి 45 రోజులు నిండాయి. పీజీ, ఎంబీబీఎస్ విద్యార్థులు మార్చి-ఏప్రిల్‌లో జరిగే పరీక్షకు అర్హులు కారు. వారికి కావాల్సిన హాజరుశాతం ఉండదు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజి్రస్ట్రార్‌కు రాస్తాం. దీనివల్ల 2 వేల మంది పీజీ విద్యార్థులు, 1500 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోతారు’ అని వైద్య విద్యా డెరైక్టర్ డాక్టర్ పి.శ్రీనివాస్ వివరించారు.
 
 బుధవారం ఆయన తన  కార్యాలయంలో వివిధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్స్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలోని ఆస్పత్రులకు 1950 తర్వాత పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించిన సీఎం కేసీఆర్‌కు, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కో ఆస్పత్రికి కేటాయించిన బడ్జెట్‌లో అత్యధికంగా వైద్య పరికరాల కొనుగోలు కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. సమ్మెలో పాల్గొంటూ ప్రజా సేవలను విస్మరించిన జూనియర్ డాక్టర్లు తమ ‘డిసర్టేషన్’ ( థీసిస్ సమర్పించడం) మాత్రం పూర్తి చేశారని, కానీ, వారు సమ్మెలో కొనసాగుతున్నందున గైర్హాజరుగానే పరిగణించి వాటిని తిరస్కరిస్తున్నామని, ఇదే విషయాన్ని విశ్వవిద్యాలయానికి తెలియజేస్తామన్నారు.
 
 వివిధ వైద్య కళాశాలల నుంచి వచ్చి గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న 50 మంది జూడాలను వారి మాతృ కళాశాలలకు పంపిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలని 3 వేల మంది వారి తల్లిదండ్రులకు లేఖలు రాశామని, 20 మంది మాత్రమే వచ్చారన్నారు. ఇప్పటికైనా అధికారికంగా సమ్మె విరమిస్తున్నట్లు రాసి ఇస్తే, ఎవరికీ నష్టం జరగకుండా చూసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించమని ప్రభుత్వాన్ని కోరతానని డీఎంఈ తెలిపారు.
 
 ప్రజాధనంతో వైద్య విద్య అభ్యసిస్తున్న వారు, అదే ప్రజానీకానికి ఏడాదిపాటు సర్వీసు చేయాల్సిందేనని, ఒక్కో విద్యార్థిపై రూ.65 లక్షల నుంచి రూ.70 లక్షల దాకా ప్రభుత్వం వెచ్చిస్తోందని వివరించారు. ఎంసీఐ తనిఖీలు జరిగాయని, దీనికి కూడా జూడాలు సహకరించలేదని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన, త్వరలో ఖాళీలను కూడా భర్తీ చేస్తామన్నారు. క్లోరోఫాంను అనస్థీషియగా గుర్తించిన ఘనత ఉస్మానియా ఆస్పత్రిదని, దేశంలో తొలి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన ఘనత కూడా ఉస్మానియాకు ఉందన్నారు. అలాగే, దేశ ంలో తొలి గుండె మార్పిడి చేసిన ప్రభుత్వ ఆస్పత్రిగా గాంధీ ఆస్పత్రి  రికార్డు సృష్టించిందని డీఎంఈ వివరించారు. ఈ ఆస్పత్రులకు కేటాయించిన బడ్జెట్‌ను మార్చినాటికి పూర్తిస్థాయిలో ఖర్చుపెట్టి, అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెస్తామని డీఎంఈ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
 

Advertisement
Advertisement