గ్రామీణ సేవలపై పీటముడి | Sakshi
Sakshi News home page

గ్రామీణ సేవలపై పీటముడి

Published Mon, Oct 27 2014 12:58 AM

గ్రామీణ సేవలపై పీటముడి

పట్టు వీడని ప్రభుత్వం.. మెట్టు దిగని జూడాలు  ఠ 28 రోజులుగా కొనసాగుతున్న సమ్మె
 
హైదరాబాద్: ప్రభుత్వం, జూడాలు ఎవరికి వారే పట్టువీడకపోవడంతో సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. 28 రోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మెకు విపక్షాల నుంచి మద్దతు పెరుగుతోంది. రెండ్రోజులుగా రిలే నిరాహార దీక్షలు కూడా మొదలు పెట్టిన జూడాలు ప్రభుత్వంతో అమీతుమీకి సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,700 మంది దాకా ఈ సమ్మెలో పాల్గొంటుండడంతో బోధనాసుపత్రుల్లో రోగులకు తిప్పలు తప్పడం లేదు. గతనెల 29న మొదలైన సమ్మెను విరమింప జేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అయిదు పర్యాయాలు చర్చలు జరిపిందని వైద్య విద్య విభాగం అధికారులు చెబుతున్నారు. వారు పెట్టిన అయిదు డిమాండ్లలో నాలుగింటిని నెరవేర్చడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. కానీ ఏడాది పాటు గ్రామీణప్రాంతాల్లో సేవలు అందించడమే ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ఈ విషయంలో జూడాల డి మాండ్‌ను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించలేమని, ఇది కోరు ్టలో పెండింగ్‌లో ఉన్నందున ఇప్పటికిప్పుడు స్పందించలేమన్నది ప్రభుత్వ వాదన. ‘తాత్కాలికంగా ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవలు వినియోగించుకుని వదిలించుకోవడం ఏమిటి? పర్మనెంటుగా ఉద్యోగాల్లోకి తీసుకోండి. సర్వీసు పూర్తయ్యే వరకు గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేస్తాం’ అన్నది జూనియర్ డాక్టర్ల ప్రతివాదన. మొత్తానికి ఈ ఒక్క అంశమే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఆటంకంగా మారింది.

ప్రభుత్వం ఏమంటోందంటే..

జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్న బలమైన అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది. వాస్తవానికి గతంలో మూడేళ్లపాటు విధిగా చేయాల్సిన ‘రూరల్ సర్వీసు’ నిబంధన వృత్తిపరంగా అడ్డంకిగా ఉందంటూ 2012లో 55 రోజులపాటు జూడాలు సమ్మెకు దిగారు. దీంతో ఆ సమయంలోనే అప్పటి ప్రభుత్వం 107 జీవో ద్వారా మూడేళ్ల సర్వీసు నిబంధనను ఏడాదికి కుదించింది. ఇప్పుడు జూడాలు వారి డిమాండ్ నుంచి వారే వెనక్కి తగ్గితే ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ఏడాది నిబంధనను కూడా పూర్తిగా ఎత్తివేయాలని, 107 జీవోను రద్దు చేయాలని కోరుతూ 2012లోనే అప్పటి జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది ఇంకా ఎటూ తేలలేదు. కోర్టులో పెండింగులో ఉన్న అంశంలో ఎలా జోక్యం చేసుకుంటామని ప్రభుత్వం అంటోంది. అదీ కాకుండా గతేడాది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం యాక్ట్ 10/2013 (ఏపీ మెడికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్) అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్, పీజీ(స్పెషలిస్టు), సూపర్ స్పెషలిస్టు డిగ్రీలు పూర్తయ్యాక, ఏదో ఒక కోర్సు తర్వాత ఏడాది పాటు గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తామని వైద్య విద్య అధికారులు చెబుతున్నారు. ఫలితంగానే ఈ ఏడాది ‘రూరల్ సర్వీసు’ అంశం పీటముడిగా మారింది.
 
జూనియర్ డాక్టర్ల వాదన ఇదీ..

జూనియర్ డాక్టర్ల వాదన దీనికి భిన్నంగా ఉంది. ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు చెబుతున్నారు. అయితే శాశ్వత ప్రాతిపదికన రిక్రూట్ చేసుకోవాలని వాదిస్తున్నారు. తాత్కాలికంగా పనిచేయించుకుని ఎలా వదిలించుకుంటారన్నది వీరి ప్రశ్న. ప్రతీ ఏటా కనీసం 600 మంది వైద్యులు సర్వీసులో చేరుతున్నారని, ముందు ఖాళీలను భర్తీ చేయడానికి పూనుకుంటే సమస్య పరిష్కారమవుతుందని జూనియర్ డాక్టర్లు పేర్కొంటున్నారు. ఏడాది గ్రామీణ సర్వీసును పూర్తి చేశాకే ఎంసీఏ రిజిస్ట్రేషన్లు చేస్తామనడం సరికాదని విమర్శిస్తున్నారు. ఏడాది సర్వీసును తప్పనిసరి అని కాకుండా, స్వచ్ఛందం అనాలని, ఇలా సర్వీసులో చేరిన వారికి ఆ తర్వాత జరిగే రిక్రూట్‌మెంటులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. ముందుగా ఏపీ ప్రభుత్వం 2013లో తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టాలన్నది జూనియర్ డాక్టర్ల ప్రధాన డిమాండ్‌గా ఉంది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులుగా ఆరునెలల పాటు కాంట్రాక్టు పద్ధతిన తీసుకుని, ఆ తర్వాత వదిలించుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఆదివారం తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో కూడా ఇవే డిమాండ్లను పునరుద్ఘాటించారు. మొత్తానికి ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరు రోగులకు ఇబ్బందికరంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో జ్వరాలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా డెంగీ విశ్వరూపం దాలుస్తోంది. బోధనాసుపత్రుల్లో సరైన వైద్య సేవలందక ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి రావడంతో పేదలు నానా యాతన పడుతున్నారు.
 

Advertisement
Advertisement