స్పష్టమైన హామీతోనే సమ్మె విరమణ | Sakshi
Sakshi News home page

స్పష్టమైన హామీతోనే సమ్మె విరమణ

Published Wed, Oct 29 2014 1:39 AM

మంగళవారం ఇందిరాపార్క్ వద్ద విన్నూత రీతిలో నిరసన తెలుపుతున్న జూడాలు

హైకోర్టు ఆదేశాలను శిరసావహిస్తాం: జూడాలు
 హైదరాబాద్: తమ న్యాయమైన డిమాండ్లు, సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ లభించే దాకా సమ్మె కొనసాగుతుందని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు స్పష్టంచేశారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఆ బాధ్యతను తాను తీసుకుంటానని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో సమ్మెను బుధవారం వరకు కొనసాగించేందుకే నిర్ణయించినట్లు జూడాల సంఘం అధ్యక్షుడు క్రాంతి ‘సాక్షి’తో చెప్పారు. హైకోర్టు నుంచి బుధవారం రాతపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు అందినా వాటిని శిరసావహిస్తామని పేర్కొన్నారు. న్యాయస్థానంపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు తాము వ్యతిరేకం కాదని, అయితే తమ సర్వీసులను శాశ్వతం చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. కాగా, గ్రామాల్లో పని చేసే వరకు జూడాలకు సర్టిఫికెట్లు ఇవ్వబోమంటూ అధికారులు ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సమస్యలు పరిష్కరించాలంటూ నెల రోజులుగా సమ్మె చేస్తున్న జూడాలపై హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సమ్మె చేయడం ద్వారా జూడాలు చట్టాన్ని ఎలా తమ చేతుల్లోకి తీసుకుంటారంటూ వారిని ప్రశ్నించింది. ప్రభుత్వ వైఖరిని సైత ం న్యాయస్థానం తప్పుబట్టింది. జూడాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, లేని పక్షంలో తాము చర్యలు తీసుకోవలసి ఉంటుందని హెచ్చరించింది. ఈ క్రమంలోనే జూడాలు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని చెబుతూనే లిఖితపూర్వకమైన ఆదేశాలు అందేవరకు సమ్మె కొనసాగించనున్నట్లు పేర్కొనడం గమనార్హం.  
 
 ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
 సమ్మెను విరమించాలని న్యాయస్థానం కోరిన ప్రతిసారీ తాము విరమిస్తున్నామని, ప్రభుత్వం మాత్రం ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను  పాటించడం లేదని జూడాలు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరిస్తానని చెబుతుందే తప్ప ప్రభుత్వం ఆచరణలో ఎలాంటి సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. ఇదే అంశాన్ని కోర్టుకూ విన్నవించుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వంపైన కోర్టు ధిక్కార కేసు వేయలేదెందుకని హైకోర్టు ప్రశ్నించిందని కూడా వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, న్యాయస్థానం తీర్పులు, తదితర పూర్తి వివరాలను బుధవారం కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
 
 కొనసాగిన దీక్షలు
 కాగా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ జూడాలు మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రిలే దీక్షలను మూడోరోజు కొనసాగించారు. నోటికి నల్ల రిబ్బన్లు ధరించి మౌనదీక్ష పాటించారు.  వ్యాయామాలు చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మంగళవారం నాటి రిలే దీక్షల్లో జూడాలు అశోక్, వికాస్, తాహ, ప్రఫుల్, జీనత్, పార్వతి కూర్చున్నారు. జూడాల సంఘం కన్వీనర్ శ్రీనివాస్, నాగర్జున తదితరులు పాల్గొన్నారు.
 
 సమ్మె విరమించాలి: ఎమ్మెల్సీ కర్నె
 జూనియర్ డాక్టర్లు మొండివైఖరిని అవలంబించడం సరికాదని, వారు వెంటనే సమ్మెను విరమించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హితవు పలికారు.
 
 సమ్మెపై నిర్లక్ష్యం వద్దు: కాంగ్రెస్
 జూనియర్ డాక్టర్ల సమ్మెపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఫలితంగా పేద రోగులు అవస్థలు పడుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మల్లు రవి, కొనగాల మహేష్, కార్యదర్శి గాలి బాలాజీ ఒక ప్రకటలో విమర్శించారు. జూడాల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.

Advertisement
Advertisement