సుప్రీం ఆదేశించినా చట్టం తేలేదు  | Sakshi
Sakshi News home page

సుప్రీం ఆదేశించినా చట్టం తేలేదు 

Published Mon, Apr 9 2018 3:30 AM

Justice Ramesh Ranganathan about Human trafficking - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యవస్థీకృత నేరాల దర్యాప్తు కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలని, మనుషుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏడాదిలోగా చట్టాన్ని తీసుకురావాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించి మూడేళ్లు గడిచినా ఇంత వరకు అది ఆచరణ రూపం దాల్చలేదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ పేర్కొన్నా రు. ఈ చట్టం రాక కోసమే ఇంతకాలం నిరీక్షించాల్సి వస్తోందని, చట్టం వచ్చిన తర్వాత అమల్లో సైతం ఇలాగే జాప్యం జరిగితే లక్ష్యం నీరుగారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మనుషుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రజ్వల, యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ హైదరాబాద్, క్యాథలిక్‌ రిలీఫ్‌ సర్వీసెస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాసియా దేశాల సదస్సు ముగింపు కార్యక్రమంలో జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

వ్యభిచార కూపంలో మగ్గుతున్నవారిపై అనైతికత ముద్ర వేయడం తగదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యభిచార వృత్తి నెట్‌వర్క్‌ మన దేశంలోనే ఉందన్న విషయాన్ని విస్మరించలేమన్నారు. వ్యభిచార వృత్తిలో మగ్గుతున్న బాలికలు, మహిళలు ఊహకందని భయంకరమైన హింస, వేధింపులకు గురవుతున్నారన్నారు. నగర శివారు లోని ప్రజ్వల హోంను తాను స్వయంగా సందర్శించి అక్కడ ఆశ్రయం పొందుతున్న బాధితులతో మాట్లాడినప్పుడు దిగ్భ్రాంతి కలిగించే విషయాలు తన దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. కొందరు దుర్మార్గులు వికృత లైంగిక ఆనందం కోసం సిగరెట్లతో కాల్చుతారని, మరికొందరు తలను గోడకేసి కొట్టి హింసిస్తారని, దీంతో మైగ్రెయిన్‌తో బాధపడుతున్నామని బాధితులు తనతో చెప్పుకున్నారని పేర్కొన్నారు. 

బాధితులను కుటుంబీకులకు అప్పగించొద్దు 
వ్యభిచార కూపాల నుంచి రక్షించిన బాధితులను తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగిస్తే మళ్లీ వ్యభిచార వృత్తికి తిరిగి వెళ్లే అవకాశాలున్నాయని జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ అభిప్రాయపడ్డారు. బాధితులను పునరావాస కేంద్రాల కస్టడీకి పంపకుండా న్యాయాధికారులు అనాలోచితంగా కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారన్నారు. చాలా కేసుల్లో బంధువులు, కుటుం బీకులే బాధితులను బలవంతంగా వ్యభిచార వృత్తి లో దింపుతున్నారన్నారు. కార్యక్రమంలో యూఎస్‌ కాన్సులర్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా, ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement