ఒకే ఒక్కడు | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్కడు

Published Mon, Jun 2 2014 11:32 PM

K Chandrasekhar Rao sworn-in as first CM of Telangana with 11 Cabinet ministers

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎట్టకేలకు మహేందర్‌రెడ్డి మంత్రయ్యారు. ఆయన రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. సోమవారం తెలంగాణ తొలి మంత్రివర్గంలో ఆయనకు కేబినెట్ బెర్తు దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొలువుదీరిన ప్రభుత్వంలో ఆయన రవాణాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినా ఆమాత్యయోగం పట్టని మహేందర్‌కు.. గులాబీ సర్కారులో ఆ కోరిక నెరవేరింది. కేసీఆర్ కేబినెట్‌లో జిల్లా నుంచి ఇద్దరికీ  ప్రాతినిధ్యం ఉంటుందని ప్రచారం జరిగినా, తొలి విడతలో మహేందర్‌కు మాత్రమే చోటు లభించింది.

ఉద్యోగసంఘాల ప్రతినిధిగా ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌కు మంత్రి పదవి ఇస్తానని ఇదివరకే గులాబీ బాస్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు బెర్తు ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఊహించని విధంగా స్వామిగౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోని కేసీఆర్.. మహేందర్‌కు ఛాన్స్ ఇచ్చారు. మరికొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, దాంట్లో స్వామిగౌడ్‌కు అవకాశం ఇవ్వవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 దశ మార్చిన కారు!
 తాండూరు నుంచి నాలుగు పర్యాయాలు టీడీపీ తరుఫున గెలిచిన పట్నం మహేందర్‌రెడ్డి.. అనూహ్యంగా ఎన్నికలకు ముందు గులాబీ గూటికి చేరారు. టీడీపీలో ఒక వెలుగువెలిగిన మహేందర్ ఆ పార్టీని వీడ డం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముం చెత్తింది. చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ, తనకంటే సీనియర్లు ఉండడంతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడం, రాష్ట్ర విభజన జరిగిపోవడంతో ‘దేశం’ గ్రాఫ్ దిగజారడాన్ని ముందే పసిగట్టిన మహేందర్ మూడు నెలల క్రితం టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు.

 మంత్రి కావాలనే తన చిరకాల వాంఛ  నెరవేరాలంటే ఇదే తగిన సమయమని గుర్తించిన ఆయన వ్యూహాత్మకంగా పార్టీ మారారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నాలుగోసారి విజయఢంకా మోగించా రు. తెలంగాణలో టీఆర్‌ఎస్ స్పష్టమైన మెజార్టీ దక్కినప్పటికీ, జిల్లాలో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే లభించాయి. దీంట్లో ముగ్గురు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అంతేకాకుండా మంత్రి పదవికి పోటీ అవుతారనుకున్న హరీశ్వర్‌రెడ్డి, కేఎస్ రత్నం ఆశ్చర్యకర  రీతిలో ఓడిపోయారు. ఈ పరిణామం మహేందర్‌కు కలిసివచ్చింది. సామాజిక సమీకరణలు, జిల్లా ప్రాధాన్యత దృష్ట్యా కేసీఆర్ తన మంత్రి వర్గంలోకి మహేందర్‌ను తీసుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement