జిల్లానుంచే కాకతీయ మిషన్ | Sakshi
Sakshi News home page

జిల్లానుంచే కాకతీయ మిషన్

Published Sat, Nov 15 2014 4:58 AM

Kakatiya Mission from to district

* పెలైట్ ప్రాజెక్టుగా మునుగోడు, భువనగిరి, ఆలేరు మండలాల ఎంపిక
* డిసెంబర్ చివరినాటికి పనులు ప్రారంభం

నల్లగొండటౌన్/చౌటుప్పల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాకతీయ మిషన్ పేరుతో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని జిల్లానుంచే ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించింది. వాటర్‌గ్రిడ్ పనులను జిల్లా నుంచే మొదలుపెడతామని ప్రకటించిన ప్రభుత్వం, హైదరాబాద్‌తోపాటు వాటర్‌గ్రిడ్‌ను చెరువులకు అనుసంధానం చేయాలనే ఆలోచనలో ఉంది. జిల్లాలో ఈ ఏడాది 952 చెరువులను పునరుద్ధరించాలని చిన్ననీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయించారు.

అయితే కరువుతో అల్లాడుతున్న ఆలేరు, మునుగోడు, భువనగిరి మండలాల్లో పెలైట్ ప్రాజెక్టుగా చెరువుల పునరుద్ధరణను ప్రారంభించాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది.  హైదరాబాద్‌లో గురువారం సీఎం కేసీఆర్ ముం బయికి చెందిన జెనిసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిపుణులతో సమావేశమయ్యారు. భౌగోళిక సమాచార సర్వే విధానం(జీఐఎస్)తో  చెరువులను సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం లిడార్ టెక్నాలజీని ఉపయోగించి, వాటర్‌గ్రిడ్‌ను, హైదరాబాద్ నగరాన్ని, చెరువులను అనుసంధానం చేసేలా సర్వే చేయనున్నారు.
 
అంచనాల రూపకల్పనలో నిమగ్నం

పునరుద్ధరణకు సంబంధించి ఇప్పటికే సుమారు 200 చెరువులకు సంబంధించి అంచనాలు పూర్తి చేశారు. మిగతా 276 చెరువుల అంచనాలను నవంబర్ నెలాఖరు వరకు పూర్తిచేసి డిసెంబర్ మొదటి వారంలో పనులకు టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. పనుల్లో ఎలాంటి జాప్యమూ జరగకుండా వేగవంతంగా పూర్తి చేయించాలన్న భావనలో అధికారులు ఉన్నారు. దీనికిగాను గతంలో ఉన్న టెండర్ల ప్రక్రియ మాదిరిగా కాకుండా కేవలం వారం రోజులలో టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి డిసెంబర్‌లోపే సదరు కాంట్రాక్టర్లకు పనులను అప్పగించనున్నారు.

డిసెంబర్‌లో మొదటి విడతగా పనులను ప్రారంభించిన 476 చెరువుల పునరుద్ధ్దరణ పనులను జూన్ చివరినాటికి పూర్తి చేయాలనే పట్టుదలలో ఉన్నారు. అదే విధంగా జనవరి మొదలైన మిగిలిన సగం 476 చెరువుల పునరుద్ధరణ పనులకు అంచనాల కోసం సర్వే పనులను ప్రారంభించాలని నిర్ణయించారు. వాటి అంచనాలను, టెండర్ ప్రక్రియను కొలిక్కితెచ్చి పనులను జూలై నెలలో ప్రారంభించి 2015 డిసెంబర్ నాటికి పూర్తి చేయడానికి ముమ్మరమైన కసరత్తు చేస్తున్నారు.
 
10నుంచి 15చెరువుల ఎంపిక..
తొలిదశలో చెరువుల పునరుద్ధరణ పథకం(కాకతీయ మిషన్)లో తొలిదశలో భాగంగా భువనగిరి, ఆలేరు, మునుగోడు మండలాలతోపాటు రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ మండలాల్లో త్వరలో సర్వేను ప్రారంభించనున్నారు. ఇప్పటికే చెరువుల పునరుద్ధరణకు భువనగిరిలో 16, ఆలేరులో 20, మునుగోడులో 9చెరువులను ఎంపిక చేశారు. తొలి దశగా ఈ మండలాల నుంచి, 10నుంచి 15చెరువులను ఎంపిక చేసి పనులను ప్రారంభించనున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ప్రతి మండలంలో 15నుంచి 20చెరువులను అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు.
 
చెరువుల్లో నీటిని తొలగించం : హమీద్‌ఖాన్, ఈఈ
చెరువుల పునరుద్ధరణ పనులలో భాగంగా చెరువులలో ఉన్న నీటిని తొలగించం.  నీటిని పూర్తిగా వాడుకున్న తరువాతనే పూడికతీత పనులను చేపడతాం. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తాం.

అభివృద్ధి పనులు ఇలా..
* చెరువుల్లో పూడికతీతతోపాటు  తూములు, అలుగులను సరిచేస్తారు.
* చెరువుల్లోకి వర్షపునీరు వచ్చేలా వరద కాలువలు, ఫీడర్‌చానళ్లను కూడా అభివృద్ధి చేయనున్నారు.
* నదులు, ప్రధాన వాగులపై చెక్‌డ్యాంల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను కూడా సర్వేలో గుర్తిస్తారు.
* ఒక్కో చెరువుకు, సామర్థ్యాన్ని బట్టి  రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేయనున్నారు.
* వాటర్‌గ్రిడ్ పథకానికి ఈ చెరువులన్నింటినీ అనుసంధానం చేయనున్నారు. తద్వారా వాటర్‌గ్రిడ్‌లో ఎప్పుడూ నీరు నిల్వ ఉండేలా చూడనున్నారు.

Advertisement
Advertisement