కార్మికుల జీవితాల్లో వెలుగే కేసీఆర్‌ లక్ష్యం | Sakshi
Sakshi News home page

కార్మికుల జీవితాల్లో వెలుగే కేసీఆర్‌ లక్ష్యం

Published Sat, Sep 16 2017 2:48 AM

కార్మికుల జీవితాల్లో వెలుగే కేసీఆర్‌ లక్ష్యం - Sakshi

► టీబీజీకేఎస్‌ సమావేశంలో ఎంపీ కల్వకుంట్ల కవిత
► హాజరైన సింగరేణి ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు


సాక్షి, హైదరాబాద్‌: సింగరేణిపై గులాబీ జెండా ఎగురవేస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) గౌరవాధ్యక్షురాలు,  ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం టీబీజీకేఎస్‌ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడమే కేసీఆర్‌ లక్ష్యమన్నారు. కార్మికుల పోరాట ఫలితంగానే దేశంలో తొలిసారి రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు.

గనిలో కార్మికుడు చనిపోయినప్పుడు మ్యాచింగ్‌ గ్రాంట్‌ను నవంబర్‌ 2015 నుంచి రూ.20 లక్షలు ఇప్పిస్తున్న విషయం కార్మికులకు తెలుసన్నారు. ఉద్యమ సమయంలో 35 రోజుల పాటు సమ్మె చేస్తే, ఆ కాలానికి జీతం ఇవ్వడమే కాకుండా, తెలంగాణ ఇంక్రిమెంట్‌ ఇప్పించుకున్న ఘనత టీబీజీకేఎస్‌దే అన్నారు.  గతేడాది 25 శాతం వేతనాల పెంపునకు ఒప్పందం చేసుకున్న జాతీయ సంఘం ఈ సారి 20 శాతానికి అంటే 5 శాతం తగ్గించుకోవడం వెనక మతలబు ఏంటో కార్మికులకు చెప్పాలన్నారు.

అది కార్మిక వ్యతిరేక కూటమి
డిపెండెంట్‌ ఉద్యోగాల భర్తీకి ఫుల్‌స్టాప్‌ పెట్టారని టీబీజీకేఎస్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని, కోర్టులో ఉన్న నేపథ్యంలో ఆ విషయానికి విరామమే తప్ప ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లు కాదని కవిత అన్నారు.  కోర్టుకుపోయినవాళ్లు కాంగ్రెస్‌ నేతల అనుచరులు, ఏఐటీయూసీ నేతల బంధువులేనని అన్నారు. టీబీజీకేఎస్‌ను ఓడించాలనే లక్ష్యంతో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, టీఎన్‌టీయూసీ సంఘాలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. అది కేసీఆర్‌ వ్యతిరేక కూటమి కాదని, కార్మిక వ్యతిరేక కూటమి అని విమర్శించారు. ఒకట్రెండు రోజుల్లో టీబీజీకేఎస్‌ మేనిఫెస్టోను ప్రకటిస్తుందన్నారు.  సమావేశంలో సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement