కేబీఆర్ పార్కు ప్రవేశ రుసుం డబుల్ | Sakshi
Sakshi News home page

కేబీఆర్ పార్కు ప్రవేశ రుసుం డబుల్

Published Sun, Jul 20 2014 1:00 AM

KBR Park admission fee double

బంజారాహిల్స్: నగరంలో ప్రముఖ పార్కుల్లో ఒకటైన బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కు (కేబీఆర్ పార్కు) ప్రవేశ రుసుంను ప్రభుత్వం భారీగా పెంచింది. ఈమేరకు శనివారం అటవీ శాఖ అధికారులు జీవో నెం.26ను జారీ చేశారు. దీనిప్రకారం ఈ పార్కు లో వాకర్లు వార్షిక ఎంట్రీపాస్ కోసం రూ.1500 చెల్లించాలి. ఇప్పటి వరకు వార్షిక ఫీజు రూ. 800 ఉండేది. ఇక సీనియర్ సిటిజన్ల పాసును రూ.500 నుంచి రూ.1000 కి పెంచారు.

నెలవారీ పాసును రూ. 200 నుంచి రూ.400 చేశారు. అలాగే రోజువారి ఎంట్రీ ఫీజును పెద్దలకు రూ.10 నుంచి రూ.20కి, పిల్లలకు రూ.5 నుంచి రూ.10కి పెంచారు. పెంచిన రేట్లు శనివారం నుంచే అమల్లోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే పాసులు తీసుకున్నవారు పెరిగిన మొత్తాన్ని పార్కు కార్యాలయంలో చెల్లించి రసీదు పొందాలని సూచించారు. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం పాసుల జారీకి సెలవు కాగా, సోమవారం నుంచి పాసులు పొందవచ్చని వారు పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement