అన్ని సమస్యలను పరిష్కరిస్తా: కేసీఆర్ | Sakshi
Sakshi News home page

అన్ని సమస్యలను పరిష్కరిస్తా: కేసీఆర్

Published Fri, Jan 9 2015 3:45 AM

అన్ని సమస్యలను పరిష్కరిస్తా: కేసీఆర్ - Sakshi

* సీఎం కేసీఆర్ హామీ
* వరంగల్ బస్తీల్లో పర్యటన
* పేదల ఇళ్లలోకి వెళ్లి సమస్యలు విన్న ముఖ్యమంత్రి
* పింఛన్లు రావడం లేదని మహిళల ఫిర్యాదు

 
సాక్షి, వరంగల్: తెలంగాణలో అర్హులైన వారందరికీ సామాజిక పింఛన్లు అందేలా చూస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేదలకు భరోసా ఇచ్చారు. అందుకు చర్యలు తీసుకున్న తర్వాతే వరంగల్‌ను విడిచి వెళతానని వ్యాఖ్యానించారు. వరంగల్ నగరాన్ని మురికివాడలు లేకుండా అభివద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గురువారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని లక్ష్మీపురం, గిరిప్రసాద్‌నగర్, శాకరాసికుంట బస్తీల్లో ఆయన పర్యటించారు.
 
 దాదాపు మూడు గంటలపాటు బస్తీ ప్రజల మధ్యే గడిపారు. వారి ఇళ్లలోకి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా ఆసరా పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై చాలా మంది ఫిర్యాదులు చేశారు. అర్హులకు పింఛన్లు రావడం లేదని వాపోయారు. పలు బస్తీల్లో ఏర్పాటు చేసిన వేదికలపై ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘లక్ష్మీపురంలో యాభై గజాల దూరం నడిచానో లేదో పదిహేను పదహారు మంది వచ్చి ఫించన్లు వస్తలేదని చెప్పిన్రు.
 
 ఈ బస్తీలో ఒక్క మనిషే పట్టేంత ఇరుకు సందులు ఉన్నయి. కిందపడితే కాలు విరిగే మురికి కాల్వలు ఉన్నయి. దర్వాజ మీద ఓ కర్ర పెట్టి దానిపైన కప్పు వేసి అందులో ఉంటున్నరు. ఓ ఇంటికి పోతే... నా మీదే కూలుతుందేమోనని భయపడ్డా. బస్తీల్లో ఉండే ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా ఇళ్లు నిర్మించి ఇస్తాం. రెండు బెడ్‌రూంలు, హాలు, వంటగది,  రెండు బాత్రూంలు ఉండే ఇళ్లు నిర్మిస్తం. వీటికి మంచి రోడ్లు, డ్రై నేజీలు, కమ్యూనిటీ హాళ్లు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తాం. మీ అందరి దగ్గరికి అధికారులు వస్తరు. స్థానిక ఎమ్మెల్యే సురేఖ కూడా ఉంటరు. ఇంటిముందు యజమానిని నిలబెట్ట్టి ఫోటో తీస్తరు. ఆ తర్వాత ఇళ్లు కట్టించి... మీ పేరు మీద ఉచితంగా రిజిస్ర్టేషన్ చేసి ఇస్తరు. దీనికి మీరందరు నాలుగు నెలలు ఓపిక పట్టాలి. మీ ఇళ్లు జాగా ఖాళీ చేసి వేరే దగ్గర ఉండాలి. ఈ బస్తీలో చదువుకున్నోళ్లు ప్రభుత్వం చేసే పనికి సాయం అందించాలి. మిగిలిన మురికివాడల ప్రజలు కంగారు పడొద్దు. అందరి ఇళ్లకు వస్తా. అందరి పరిస్థితిని తెలుసుకుంటా (ఈ సమయంలో కొందరు ఈలలు వేశారు).
 
 వట్టిగనే సంబరపడొద్దు. సంపాదించి సంబురపడాలె. నేను చెప్పిన పని కాకుంటే రాత్రి(శుక్రవారం) ఈడనే ఉంట. పాత ముఖ్యమంత్రి కాదు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి. మాట ఇచ్చినానంటే నెరవేర్చాలే. లేదంటే తలతెగి కిందపడాలే. పది రోజుల్లో వచ్చి ఈ కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాను. నాలుగైదు నెలల్లో వచ్చి ప్రారంభిస్తా. మీకు రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల జాగాలు సమస్యలు ఏమున్నా రెండు రోజుల్లో అధికారులు పరిష్కారం చూపిస్తారు. లేకపోతే కలెక్టరా ? నేనా తేల్చుకుంటాం’ అని ప్రజలకు కేసీఆర్ భరోసా కల్పించారు.
 
 కలెక్టర్, కమిషనర్‌లపై ఆగ్రహం
 పింఛన్లు రావడం లేదని ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో.. ఇదే పద్ధతంటూ జిల్లా కలెక్టర్ కిషన్‌ను సీఎం ప్రశ్నించారు. దీనికి కలెక్టర్ సమాధానమిస్తూ... ఆన్‌లైన్‌లో జరిగిన పొరపాట్ల వల్ల జాప్యమవుతోందని, ఈ విషయాన్ని ‘సెర్ప్’ సీఈవోకు తెలిపానని చెప్పారు. వెంటనే సెర్ప్ సీఈవోతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. ‘ఎన్ని సార్లు చెప్పాలయ్యా నీకు. ఈ అప్‌లోడ్, డౌన్‌లోడ్ ఎవరికి కావాలి. బుక్కులు పెట్టి పింఛన్లు ఇయ్యమన్న. వందసార్లు కూసుండబెట్టి చెప్పినా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి బాగుపడలేదు. వెంటనే వరంగల్‌కు వచ్చి ఇక్కడ సమస్యను పరిష్కరించు’ అని ఆదేశించారు.
 
 లక్ష్మీపురం వెళ్లే దారిలో రోడ్డు గుంతలమయంగా మారి సీఎం కాన్వాయ్‌పై బురద పడింది. కేసీఆర్ కారు దిగగానే.. మున్సిపల్ కమిషనర్ ఎదురుగా వెళ్లి పూలగుచ్చం ఇచ్చి పరిచయం చేసుకున్నారు. దీనికి సీఎం స్పందిస్తూ.. ‘ఆ రోడ్డు ఏంది, ఆ గుంతలేంది. ఆ నీళ్లేంది. ఏం పని చేస్తున్నావ్. అది కూడా చూసుకోవా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్ను పుష్ప అనే మహిళ తన కూతురు పేరిట కల్యాణలక్ష్మి పథకానికి రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నా డబ్బులు అందలేదని సీఎంకు ఫిర్యాదు చేయడంతో... వెంటనే పరిష్కరించాలని స్థానిక తహసీల్దార్‌ను కేసీఆర్ ఆదేశించారు. రాత్రికి వరంగల్‌లోనే బస చేసిన కేసీఆర్.. శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గంలో సమీక్ష జరపనున్నారు.
 
 ప్రజలను ఎందుకు చంపుతున్నరు?
 లక్ష్మీపురం కాలనీలో లచ్చమ్మ ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్లారు. ఆమె భర్త శారీరక వికలాంగుడైనా పింఛను రావడంలేదని తెలుసుకున్నారు. బయటకు వచ్చాక మరికొందరు మహిళలు కూడా పింఛన్ల కోసం ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి వారిని దగ్గరికి రప్పించుకున్నారు. తన భర్త చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రాన్ని సీఎంకు చూపెడుతూ పింఛన్ రావడం లేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి పింఛన్లు ఎందుకు రావడం లేదని అక్కడే ఉన్న వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్ సువర్ణపండాదాస్‌ను కేసీఆర్ ప్రశ్నించారు. వివరాల కోసం తన చేతిలో ఉన్న టాబ్‌లో వెతికి.. ‘దరఖాస్తు సరిగా లనందున పింఛను రాలేద’ని కమిషనర్ సమాధానమిచ్చారు. ‘మొగుడు సచ్చిపోయిండని సర్టిఫికేట్ చూపెడతాంటే... ఆన్‌లైన్, అప్‌లోడ్, ఇన్‌లోడని ప్రజలను చంపుతున్నారు. ఎదురుగా కనబడుతున్న మనుషులను చూసి పెన్షన్ మంజూరు చేయొచ్చు కదా? ఆ టాబ్‌లు ఎందుకు’ అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement