ఐటీఐఆర్‌కు మరిన్ని నిధులివ్వండి | Sakshi
Sakshi News home page

ఐటీఐఆర్‌కు మరిన్ని నిధులివ్వండి

Published Sun, Dec 14 2014 2:00 AM

ఐటీఐఆర్‌కు మరిన్ని నిధులివ్వండి - Sakshi

 కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి
 
 సాక్షి, హైదరాబాద్: ఐటీఐఆర్‌కు ఈ ఏడాది కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని, మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. శనివారం సచివాలయంలో కేసీఆర్‌ను రవిశంకర్ ప్రసాద్ కలిశారు. ఈ సందర్భంగా.. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక తపాలా సర్కిల్‌ను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు. ప్రత్యేక సర్కిల్‌తోపాటు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ పోస్టుకు కూడా అనుమతినిచ్చినట్లు ఆయన వెల్లడించారు. కాగా.. కేంద్రం ప్రకటించిన ‘సాంకేతిక, సమాచార పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్)’ కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాంతాలను గుర్తించిందని.. విద్య, వైద్య సంబంధిత మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇక్కడున్న పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు కోరుతున్నాయని సీఎం కేసీఆర్ రవిశంకర్‌ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. ఐటీఐఆర్‌కు మొదటి దశ కింద ఈ ఏడాది కేంద్రం కేటాయించిన రూ. 165 కోట్లు ఏమాత్రం సరిపోవని... మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ ప్రపంచంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపునిచ్చిందని కూడా కేంద్ర మంత్రికి వివరించారు. దీనిపై రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ... జాతీయంగా, అంతర్జాతీయంగా హైదరాబాద్ ఐటీ హబ్‌గా, మేధావుల కేంద్రంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఐటీ ఐఆర్‌కు సంబంధించి కేంద్రం నుంచి నిధులు రావాలంటే.. అందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని ముఖ్యమంత్రికి సూచించారు.
 
 భారీ పెట్టుబడులు వస్తాయి..
 
 ఐటీఐఆర్ ప్రాంతంలో సాంకేతిక సమాచారం, ఐటీ సంబంధిత సర్వీసులు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ వివరించారు. హైదరాబాద్ చుట్టూ 202 చదరపు కిలోమీటర్ల పరిధి (49,913 ఎకరాలు)లో దీనిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఐటీఐఆర్ పరిధిలో మొత్తం రూ. 2,19,440 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందులో ఒక్క ఐటీ, ఐటీ ఈఎస్ విభాగాల్లోనే రూ. 1,18,355 కోట్లు, ఈహెచ్‌ఎమ్ సెక్టార్‌లో రూ. 1,01,085 కోట్ల పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఐటీఐఆర్‌లో మౌలిక సదుపాయాల కోసం కేంద్రం మొత్తంగా రూ. 4,863 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించిందని... మొదటి దశలో రూ. 942 కోట్లు, రెండో దశలో రూ. 3,921 కోట్లు ఇస్తామని తెలిపిందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పారిశ్రామిక విధానం గురించి వివరించారు. పారిశ్రామిక విధాన ప్రతిని కేంద్ర మంత్రికి అందించారు. కాగా ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై కేంద్ర మంత్రి అభినందించారు. ఐటీకి సంబంధించి ఎలాంటి సాయం కావాలన్నా.. సహకరించడానికి సిద్ధమని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
 
 తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
 
 హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భవిష్యత్‌లో ఐటీ, బయోటెక్నాలజీ కేంద్రాలుగా పేరు తెచ్చుకుంటాయని కేంద్ర టెలీకమ్యూనికేషన్స్,ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన ఏపీ, తెలంగాణ సీఎంలను కలసిన అనంతరం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సంబంధించి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో విభజన పనులు పూర్తిచేసినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదించిందన్నారు. అలాగే, చిత్తూరు, కాకినాడ, తెలంగాణలోని మహేశ్వరం, మెదక్‌లలో ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు తట్టుకోవడం లేదన్నారు. అందుకే ఎన్డీయే కూటమిని బలహీనపరిచేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు బద్దం బాల్‌రెడ్డి, ప్రేమ్‌సింగ్ రాథోడ్, మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి, దళిత్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement