లంచమంటే చంపేస్తా!:సీఎం కేసీఆర్ | Sakshi
Sakshi News home page

లంచమంటే చంపేస్తా!:సీఎం కేసీఆర్

Published Mon, Jan 12 2015 12:55 AM

ఆదివారం వరంగల్‌లోని లక్ష్మీపురంలో వృద్ధురాలికి పింఛన్ ఇస్తున్న సీఎం కేసీఆర్ - Sakshi

లంచం ఇచ్చినా ఊరుకోను:వరంగల్ ప్రజలతో కేసీఆర్
ఫిర్యాదుకు సీఎం కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ : 040-23454071
డబ్బులడిగితే నాకు ఫిర్యాదు చేయండి
అభివృద్ధి చూసి ప్రతిపక్షాలు గుడ్లు తేలేస్తున్నాయి
 ఆరు మోడల్ కాలనీలకు శంకుస్థాపన
3,914 ఇళ్ల నిర్మాణానికి రూ. 400 కోట్లు మంజూరు
వరంగల్ జిల్లాలో ముగిసిన ముఖ్యమంత్రి పర్యటన

 సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలులో అవినీతికి తావి చ్చేది లేదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎవరైనా లంచం అడిగితే కఠినంగా వ్యవహరిస్తానని, లంచం ఇచ్చిన వాళ్ల విషయంలో ఇంకా కఠినంగా ఉంటానని చెప్పారు. ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డుల మంజూరులో డబ్బులు అడిగే వారిపై నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఇందుకోసం తన కార్యాలయంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వరంగల్ జిల్లాలో నాలుగు రోజులుగా పర్యటిస్తున్న కేసీఆర్.. నగరపాలక సంస్థ పరిధిలోని ఆరు బస్తీల్లో కొత్తగా నిర్మించనున్న మోడల్ కాలనీలకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన అన్ని చోట్లా బస్తీవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం పైసలన్నీ గవర్నమెంటే ఇస్తంది. ఎవరైనా లంచమంటే చంపేస్తా. రూపాయి లంచమిస్తే మిమ్మల్ని కూడా పొట్టుపొట్టు చంపేస్తా. లంచం అడిగినోళ్ల తోలుతీస్తా. మిమ్మల్ని ఎవడన్న డబ్బులడిగితే నాకు చెప్పాలె. ఫోన్ నెంబర్ ఇస్త. నేను సీఎం ఆఫీస్‌లో టోల్‌ఫ్రీ నంబరు పెడత. ప్రభుత్వా ధికారులు, ఇంకెవరైనా డబ్బులడితే 040-23454071 నంబరుకు ఫోన్ చేయండి. లంచమడిగినోళ్ల పేరు, అడ్రస్ చెప్పాలి. డబ్బులడిగితే తోలుతీస్తా. దొంగల బారి నుంచి పైరవీకారుల బారి నుంచి కాపాడుకోవాలంటే ఇదే తగిన పద్ధతి. ఈ నంబర్‌కు ఫోన్ చేస్తె పైసలు తగలయి’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
 
 ఇక ఇళ్లు లేని పేదలుండరు..
 రాష్ర్టంలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో పరిస్థితి బాగా లేదని, బస్తీల్లో అనేక సమస్యలు ఉన్నాయని సీఎం అన్నారు. అన్ని బస్తీలను పరిశీలించిన తర్వాత 3,914 ఇళ్లు మంజూరు చేసినట్లు, వీటి నిర్మాణం కోసం వెంటనే రూ. 400 కోట్లు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ‘లక్ష్మీపురం, శాకరాసికుంట, గిరిప్రసాద్‌నగర్, ప్రగతికుంట, దీన్‌దయాళ్‌నగర్, అంబేద్కర్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, గరీబ్‌నగర్, గాంధీనగర్ ఇలా.. చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ నాలుగు రోజుల పాటు వరంగల్‌లో లేరు. నేను ఉండి సమస్యలు తెలుసుకున్న. కొద్దిమందికి పింఛన్లు, రేషన్‌కార్డులు రాలేదు. వారందరికీ ఇప్పుడు ఇచ్చిపోతాన. రూ. 400 కోట్లతో 3,914 ఇళ్లు కడ్తన్నం. నాలుగేళ్లలోపు పూర్తి చేస్తం. రాబోయే రెండుమూడేళ్లలో ఇళ్లు, పట్టాలు లేని పేదవాళ్లే కనిపించరు. నేను పనులు చేత్తాంటే కొన్ని పార్టీలు గుడ్లు తేలేస్తున్నాయి. జెండాలు పట్టుకుని ధర్నాలు చేయమంటున్నయ్. కేసీఆర్ మొన్ననే ముఖ్యమంత్రి అయ్యిండు. అరవై ఏళ్ల నుంచి వాళ్లే ఉన్నరు. ఆరు చందమామలు, ఏడు సూర్యుళ్లు చేస్తమన్నరు. వాళ్లు ఏం చేయకపోవడం వల్లే సమస్యలన్నీ మోపైనై. అప్పటి నుంచి ముద్దెర పెట్టిన్రు. అవన్నీ పోవాల్నంటే టైం పడ్తది. చిలుముబట్టిన చెంబు ఒక్కసారే తెల్లగైతదా.. చింతపండుబెట్టి తోమాలె. ఒకటికి రెండుసార్లు గట్టిగ రాకుతె సాపయితది. ఈ దరిద్రమంత పోవాల్నంటె టైం బడ్తది. రెండుమూడేళ్లలో వరంగల్ నగరం గొప్ప నగరంగా మారుద్ది. వచ్చి చూసినోల్లు ముక్కన వేలేసుకోవాలి’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.  
 
 అందరి సహకారం కావాలి..
 ప్రభుత్వ ప్రయత్నాలు విజయవంతం కావాలంటే ప్రజలందరూ సహకరించాలని, అధికారులు బస్తీలకు వచ్చినప్పుడు ఇంటిపట్టున ఉండి వివరాలు అందించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ‘మీ బస్తీలు మోడల్ కాలనీలుగా మారాలి. ప్రభుత్వ భూములపై లెక్కలు తీస్తున్నాం. తొమ్మిది బస్తీల్లో ఆరింటిలో భూమి పూజ చేసి నేను హైదరాబాద్ పోతున్నా. మిగిలిన చోట్ల కూడా పని మొదలవుతుంది. వరంగల్  నగరంలో పేదలందరికీ నాలుగైదు నెలల్లోపల ఇళ్ల జాగాలు ఇచ్చే బాధ్యత నాది. మొదట ఇళ్లు, ఇళ్ల జాగాలు ఇప్పించి, తర్వాత ఆర్థిక సాయం అందిస్తాం. ఆటోలు, డీసీఎంలు వంటివి ఏవి అవసరమైతే అవి కొనిస్తం. అర్హులందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు ఇస్తం. కేసీఆర్‌కు ఓ మాట ఉంది కదా. పట్టుపడితే ఇడిసిపెట్టడు. తెలంగాణ తెచ్చినకదా.. ఇప్పుడు అట్లనే అభివ ృద్ధి చేసుకుందాం. జై తెలంగాణ’ అని సీఎం ప్రసంగించారు.
 
 రికార్డు పర్యటన..
 ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా నాలుగు రోజులపాటు వరంగల్‌లోనే ఉండి రికార్డు సృష్టించారు. గురువారం వరంగల్‌కు వస్తూనే లక్ష్మీపురం, శాకరాసికుంట, గిరిప్రసాద్‌నగర్ మురికివాడలను సందర్శించారు. శుక్రవారం అంబేద్కర్‌నగర్, ప్రగతినగర్, దీన్‌దయాళ్‌నగర్‌లో... శనివారం ఎస్‌ఆర్‌నగర్, గరీబ్‌నగర్‌లో పర్యటించారు. మొదటి రెండు రోజులు పర్యటించిన బస్తీల్లో మోడల్ కాలనీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆదివారం శంకుస్థాపన కూడా చేశారు. మొదటి దశలో పింఛన్లు, రేషన్‌కార్డులపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో అర్హులందరికీ మంజూరు చేసిన తర్వాతే వరంగల్‌ను విడిచి వెళ్తానని తొలిరోజే చెప్పారు. దీంతో అర్హుల జాబితాను రూపొందించేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. వెంటవెంటనే అర్హులకు పింఛన్లు పంపణీ చేస్తున్నారు.
 భద్రకాళీ దర్శనం
 వరంగల్‌లోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయాన్ని కేసీఆర్, ఆయన సతీమణి శోభారాణి ఆదివారం సందర్శించారు. అమ్మవారికి కుంకుమ పూజలు, ఖడ్గమాల పూజలు చేశారు. అమ్మవారికి బంగారు కిరీటం చేయిస్తానని సీఎం చెప్పినట్లు ఆలయ ప్రధానార్చకుడు తెలిపారు.

Advertisement
Advertisement