‘ఏడాదిలో కేసీఆర్ చేసింది శూన్యం’ | Sakshi
Sakshi News home page

‘ఏడాదిలో కేసీఆర్ చేసింది శూన్యం’

Published Tue, Jun 30 2015 10:46 AM

‘ఏడాదిలో కేసీఆర్ చేసింది శూన్యం’ - Sakshi

మహబూబ్‌నగర్ అర్బన్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా, రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమని సీఎల్‌పీ కార్యదర్శి, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ విమర్శించారు. సోమవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యమకాలంలో చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేయని సీఎం రూ.6వేల కోట్ల వాటర్‌గ్రిడ్ పనులు తన కొడుకుకు, మరో రూ.35వేల కోట్లతో అల్లుడికి కాకతీయ మిషన్ పనులు అప్పజెప్పారని ఎద్దేవా చేశారు.
 
 ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాల్సిన సీఎంనాలుగు రోజుల పాటు తన ఫాంహౌజ్‌లో ఉండి అల్లం సాగును పర్యవేక్షించడం బాధ్యతల నుంచి తప్పుకోవడమేన ని విమర్శించారు. జిల్లా మంత్రులు ఎక్కడ డబ్బులు దొరుకుతాయో, తమ అనుచరులకు పనులెట్లా ఇప్పించుకోవాలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. చంద్రబాబు జిల్లాను దత్తత తీసుకుని పట్టించుకోలేదని, తాను ప్రత్యేక శ్ర ద్ధ తీసుకొని అభివృద్ధి చేస్తానన్న ముఖ్యమంత్రి కనీసం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కూడా యత్నించడం లేదనన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కేసీఆర్ మానసపుత్రిక అని చెప్పుకోవడం సిగ్గుచేటని, ఆ పథకానికి నాంది పలికి నిధులు, డీపీఆర్ విడుదల చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని పేర్కొన్నారు. తన మాట వినని మీడియా గొంతును నొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిన చర్యలు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే చెల్లిందనన్నారు.
 
 సీఎం, జిల్లా మంత్రులు పర్యటనలకు వచ్చినప్పుడు అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చి వారి భాగస్వామ్యంతో అభివృద్ధికి పాటుపడే ఆనవాయితీని ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాలో సాగు0నీటి సౌకర్యం కల్పించడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు పనిచేయాలని లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్, ఉపాధ్యక్షులు రంగారావు, మీడియాసెల్ కన్వీనర్ పటేల్ వెంకటేశ్, నేతలు అంజయ్య, గోపాల్‌రెడ్డి, అమరేందర్‌రాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement