నేడు ఆర్మూర్‌కు కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

నేడు ఆర్మూర్‌కు కేసీఆర్‌

Published Thu, Nov 22 2018 1:00 PM

KCR Election Campaign In Nizamabad - Sakshi

నేడు ఆర్మూర్‌లో జరుగనున్న సీఎం కేసీఆర్‌ సభను విజయవం తం చేసేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో సభలను ముగించుకుని సీఎం హెలికాప్టర్‌లో ఆర్మూర్‌కు సాయంత్రం నాలుగు గంటలకు వస్తారు.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు జిల్లాకు రానున్నారు. ఆర్మూర్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ఆయ న హాజరవుతారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ, ఖానాపూర్, నిర్మల్‌ జిల్లా ముథోల్, నిర్మల్‌లలో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో పాల్గొన్న అనంతరం కేసీఆర్‌ ఆర్మూర్‌కు చేరుకుంటారు. గురువారం ఆయన ఐదు బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. జిల్లాల వారీగా బహిరంగసభలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్‌ తొలి సభను గత నెల 3న నిజామాబాద్‌ నగరంలో నిర్వహించిన విషయం విదితమే. తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న చంద్రబాబుతో కాంగ్రెస్‌ జతకట్టిన తీరుపై పదునైన విమర్శలు గుప్పించారు. తాజాగా రెండో సారి మంగళవారం ఎల్లారెడ్డిలో జరిగిన బహిరంగసభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. మూడోసారి గురువారం ఆయన ఆర్మూర్‌కు వస్తున్నారు.

సాయంత్రం 4 గంటలకు..
ఆర్మూర్‌ పట్టణంలోని మినీ స్టేడియంలో బహిరంగసభను ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం 4 గంటలకు కేసీఆర్‌ ఆర్మూర్‌కు చేరుకుంటారు. ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లోని సభలను ముగించుకుని హెలికాప్టర్‌లో ఆర్మూర్‌కు వస్తారు. పట్టణంలోని జిరాయిత్‌నగర్‌లో హెలిపాడ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వాహనంలో సభాస్థలికి చేరుకుంటారు. ఈ సభలో ప్రసంగించిన అనంతరం హైదరాబాద్‌ బయలుదేరి వెళతారు.

25 వేలకుపైగా.. 
సీఎం కేసీఆర్‌ బహిరంగసభను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మినీ స్టేడియంలో సభా వేదికను సిద్ధం చేశారు. నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. ఈ సభకు 25 వేలకు పైగా మందిని తరలించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మె ల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున శ్రేణులను, కార్యకర్తలను, గ్రామాల్లో ప్రజలను తరలించనున్నారు. ఆర్మూర్‌ పట్టణంతో పాటు, నందిపేట్, మాక్లూర్, ఆర్మూర్‌ మండలాల నుంచి శ్రేణులను తరలించి సభను విజయంతం చేసేందుకు జీవన్‌రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు.

 
కేసీఆర్‌ సభతో .. 
అధినేత పర్యటన టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జీవన్‌రెడ్డి నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఆయన రెండు విడతలుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక్కో గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. అలాగే పింఛన్లు, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారి వివరాలను తన ప్రసంగంలో పేర్కొంటున్నారు. తిరిగి మరోసారి అవకాశం ఇస్తే ఆ గ్రామానికి చేపట్టనున్న అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. తాజాగా కేసీఆర్‌ పర్యటనతో ఆ పార్టీకి మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారు.

సీఎం సభను విజయవంతం చేయండి :  ఆశన్నగారి జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 
అధినేత కేసీఆర్‌ పర్యటనను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సభలో అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమం కోసం పథకాలను అమలు చేసిందని, మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. సీఎం సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి ఆశీర్వదించాలని ఆయన కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement