సింగరేణి కార్మికుల మేలు కోరుతా  | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికుల మేలు కోరుతా 

Published Fri, Nov 30 2018 9:12 AM

KCR Fair On BJP Government Karimnagar - Sakshi

గోదావరిఖని(రామగుండం): ‘కేసీఆర్‌ సింగరేణి కార్మికుల బిడ్డ.. మీ మేలు కోరుతానే తప్ప.. ప్రాణం పోయినా నష్టం రానివ్వ. డిపెండెంట్‌ ఉద్యోగాలిస్తానంటే దుర్మార్గులు కాంగ్రెస్సోళ్లు కోర్టుకెళ్లి స్టే తెచ్చిండ్రు. కొంతమంది గోల్‌మాల్‌ గాళ్లు ఏదో చెప్తే నమ్మోద్దు. మద్దతివ్వండి పనిచేయించుకోండి.’ అని రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. గోదావరిఖని జూనియర్‌ కళాశాల మైదానంలో గురువారం జరిగిన ప్రజా ఆశీర్వాదసభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘కరెంట్‌ మంచిగ చేసుకున్నం. సంక్షేమం చేసుకున్నం. వృత్తి పనులవాళ్లను నిలబెట్టుకున్నం. సింగరేణి కార్మికులకు ఎన్నోరెట్లు బోనస్‌లు ఇప్పించుకున్నామని అన్నారు. మెడికల్, ఇంజినీరింగ్‌ కాలేజీ రామగుండంలో ఏర్పాటు చేసేలా కృషిచేస్తానన్నారు.
 
లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కోసం పట్టుపట్టిండు 
‘ఆర్టీసీ చైర్మన్‌ ఇచ్చిన గదా... ఎంది నీ అసంతృప్తి అన్నా. ఎల్లంపల్లి నీళ్లు ఉన్నయి. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేస్తే పంటపొలాలన్నీ కళకళలాడుతాయని సోమారపు సత్యనారాయణ అన్నడు. అన్నట్లు వంద కోట్లతో లిఫ్ట్‌ ఇరిగేషన్‌పూర్తిచేయించిండు. ఎల్లంపల్లి నీళ్లు రైతులకు ఇచ్చేందుకు వంద కోట్లు తెచ్చుకుని నాతోనే ప్రారంభించుకున్నడని కేసీఆర్‌ తెలిపారు. కొట్లాడి నన్నే తీసుకొచ్చి ఫౌండేషన్‌ వేయించుకున్నడని వివరించారు. ఇంకో ఆరునెల్లో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు పూర్తవుతాయని వెల్లడించారు.

‘మంచి నాయకుడు సత్యనారాయణ.. మున్సిపల్‌ చైర్మెన్‌గా గెలిపించిండ్రు. ఆయన సేవలు చూసి ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా గెలిపిస్తే పార్టీలోకి తీసుకున్నం. విద్యాధికుడు, ఇంజినీర్‌ అనేక విషయాల్లో మంచి సలహాలు చెబుతరు. నాకు రైట్‌హ్యాండ్‌గా ఉంటరు. నాకు అత్యంత ఆప్తుడు కాబట్టి పెద్ద మెజార్టీతో గెలిపించాలి’. అని కేసీఆర్‌ కోరారు. రామగుండంలో నేను మీకు కొత్తేమి కాదు. మీ ఆశీస్సులు లభించినయి. ఎన్నికలు అయిపోనంకరెండు నెలల తర్వాత వచ్చి దినమంతా ఇక్కడే ఉండి సమస్యలు పరిష్కరిస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 

కొత్త రాష్ట్రాన్ని లైన్లో పెట్టుకోవాలని కష్టపడుతున్నా.. 
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మానవీయ కోణం.. ఆత్మీయ స్పర్శతో ముందుకు సాగుతూ రాష్ట్రాన్ని లైన్లో పెట్టుకోవాలని కష్టపడుతున్నానని కేసీఆర్‌ అన్నారు. ఓటింగ్‌లో పెద్ద కన్‌ఫ్యూజన్‌ లేదని ఈ ఎన్నికల్లో 58 ఏళ్లు పాలించిన కూటమి కట్టిన కాం గ్రెస్, టీడీపీ ఒకవైపు, 15 ఏళ్లు పోరాటం చేసి నా లుగేళ్లు పాలించిన టీఆర్‌ఎస్‌ మరో వైపు పోటీలో ఉన్నాయన్నారు. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఇష్ట ప్రకారం పార్టీలు గెలిస్తే ప్రజల కోరికలు నెరవేతాయన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో కరెంట్‌ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందని ప్రశ్నించారు.

జాతీయ పార్టీల నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని.. బీజేపీ 19 రాష్ట్రాల్లో రాజ్యమేలుతోందని.. ఎక్కడైనా నిరుపేదలకు రూ.1000 పింఛన్‌ ఇస్తోందా?రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నరా? షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలు అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో కారుగుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. రామగుండం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో మైనింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌రావు, రామగుండం మేయర్‌ జాలి రాజమణి, ప్రభుత్వ సలహాదారు వివేక్, డిప్యూటీ మేయర్‌ ముప్పిడి సత్యప్రసాద్, టీబీజీకేఏఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement