భారీగానే బడ్జెట్! | Sakshi
Sakshi News home page

భారీగానే బడ్జెట్!

Published Thu, Oct 23 2014 4:34 AM

భారీగానే బడ్జెట్! - Sakshi

రూ. 80 వేల కోట్లకు తగ్గకుండా తెలంగాణ ఆర్థిక శాఖ కసరత్తు
 కేంద్ర నిధులపై రాష్ర్టం ఆశలు

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ భారీగా ఉండాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. దీంతో పది నెలల కాలానికే అయినా బడ్జెట్ పరిమాణం 80 వేల కోట్ల రూపాయలకు ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గకుండా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ప్రణాళిక వ్యయం దాదాపు 30 వేల కోట్ల వరకు ఉం డేలా చూడాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ తుది స్వరూపంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మరోసారి ముఖ్యమంత్రితో సమావేశంకానున్నారు.
 
 తర్వాతే బడ్జెట్ పుస్తకాల ముద్రణ చేపట్టనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. పీఆర్సీని ప్రభుత్వం ఏ మేరకు ఆమోదిస్తుందన్న దానిపై స్పష్టత లేకపోయినా.. బడ్జెట్‌లో మాత్రం నిధులు సమకూర్చనున్నట్లు చెప్పారు. బడ్జెట్‌లో ఎస్సీలకు 15.4 శాతం, ఎస్టీలకు 9.3 శాతం నిధులు కేటాయించనున్నట్లు తెలిసింది. విభజనకు సాధ్యం కాని పలు మౌలిక వసతుల పథకాల్లో మాత్రం ఎస్సీలకు ఏడు శాతం, ఎస్టీలకు మూడు శాతం నిధులు కేటాయించినట్లు చూపించనున్నారు. కేంద్రం నుంచి నిధులు భారీగా వస్తాయన్న ఆశతోనే బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలను పది పని దినాలపాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
 శుక్రవారం(24న) మంత్రివర్గ సమావేశం తర్వా త అసెంబ్లీ సమావేశాల తేదీలను అధికారికంగా ప్రకటించనున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్ల కాలానికి ఈ బడ్జెట్ మార్గదర్శకంగా ఉంటుందన్నారు. తాగునీటి గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ, సంక్షేమ పథకాలతోపాటు, వ్యవసాయ, విద్యుత్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఇప్పటికే సూచించారు. తెలంగాణ కోణంలో ప్రతీ పథకం ప్రాధాన్యత ఉన్నదేనని, అన్నింటికీ నిధులు కేటాయించాలని కేసీఆర్ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో నిధుల సర్దుబాటులో అధికారులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
 

Advertisement
Advertisement