గజ్వేల్ పక్కా | Sakshi
Sakshi News home page

గజ్వేల్ పక్కా

Published Tue, Mar 11 2014 3:31 PM

గజ్వేల్ పక్కా - Sakshi

* కేసీఆర్ మదిలో అదే!
 *ఈ సెగ్మెంట్ నుంచే పోటీ?
* మొదట చొప్పించడం..
 *తరువాత చెప్పించడం..
* అదే గులాబీబాస్ స్టైల్..
 * దశలవారి ప్రచార తీరుపై విస్మయం

 
సంగారెడ్డి:  కేసీఆర్ తన మనుసులో మాటేది నేరుగా చెప్పరు. తన‘మనో వాంఛ’ను ముందు ప్రజల్లోకి చొప్పించి.. వారి నోటితోనే చెప్పించడం కేసీఆర్ స్టైల్.. ఇప్పుడు ఫాంహౌస్ స్క్రిప్టు.. డెరైక్షన్‌లో అదే  నాటకం నడుస్తోంది. గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు కేసీఆర్  సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన గజ్వేల్ అసెంబ్లీ స్థానంతో పాటు, మెదక్ పార్లమెంటు నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. కానీ ఆయన  దానికి ఒప్పుకోరు. ప్రజలు కోరితేనే కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారు. ఇందుకోసం ఒక బ్రహ్మాండమైన స్క్రిప్టు రచించి అమలు చేస్తున్నారు. మొత్తం నాలుగు దశలో సాగే ఈ నాటకాన్ని రక్తి కట్టించేందుకు టీఆర్‌ఎస్ నేతలు ఎవరి పాత్రలు వాళ్లు పోషిస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
 
 మొదటి దశ..

 టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు గడిచిన నెల రోజుల నుంచి  ప్రచారం జరుగుతోంది. దీన్ని టీఆర్‌ఎస్ నేతలే విస్తృతంగా ప్రచారం చేశారు. కేసీఆర్‌కు ఫాంహౌస్ అన్నా... ఈ నియోజకవర్గమన్నా అత్యంత ఇష్టమని, నియోజకవర్గం మీదున్న మమకారంతోనే ఇక్కడ ఫాంహౌస్‌ను ఏర్పాటు చేసుకున్నారని, గజ్వేల్ పై పట్టుసాధించేందుకే ఆయన స్థానికంగా ఉండి రాజకీయాలు నడిపారని చాలాకాలంగా ప్రచారంలో ఉంది.
 
 రెండవ దశ....
 కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తుతున్నాయని పది రోజుల నుంచి విస్తృతంగా  ప్రచారం సాగుతోంది.. నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు. వారంతా కేసీఆర్‌ను ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు వివిధ పత్రికల్లో వచ్చింది. కేసీఆర్ మాత్రం వాళ్ల ఒత్తిడి పట్ల ఏమాత్రం స్పందించ లేదు.
 
 మూడో దశ...
 మూడో దశలో టీఆర్‌ఎస్ నేతలు రంగ ప్రవేశం చేశారు. నియోజకవర్గంలో సభలు పెట్టారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయాలని ప్రజలంతా కోరకుంటున్నారని, ప్రజల ఆకాంక్షను పార్టీ అధినేత తప్పకుండ గౌరవిస్తారని ప్రకటించారు. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే తామంతా కలిసి ఆయనపై ఒత్తిడి పెంచుతామని, గజ్వేల్ నుంచే పోటీ చేయించే ప్రయత్నం చేస్తామంటూ వారు నాటకాన్ని మరింత రక్తి కట్టించారు.
 
 అంతిమ దశ...
 అంతిమ దశలో కేసీఆర్ రంగ ప్రవేశం చేసి ప్రజల ఆకాంక్షను శిరసావహిస్తున్నట్లు ప్రకటించి, గజ్వేల్ అసెంబ్లీ బరిలో నిలబడతారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నాటకం మూడో దశలో ఉందని త్వరలోనే కేసీఆర్ ఈ నాటకానికి తెర దించుతూ... గజ్వేల్ అసెంబ్లీ తెర మీదకు వస్తారని వారు చెప్తున్నారు.  ఓటర్ల మైడ్‌సెట్‌ను దారి మళ్లించి, ఓట్లు కొల్లగొట్టడంలో కేసీఆర్ మంచి దిట్ట అని వారు అంటున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేసేందుకే కేసీఆర్ ఈ వ్యూహం పన్ని  ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement