25 ఏళ్లలో పూర్తి కాని ప్రాజెక్ట్‌లను మూడేళ్లలో పూర్తి: కేసీఆర్‌

6 Aug, 2019 19:09 IST|Sakshi

కాళేశ్వరం 65 శాతం సాఫల్యత పొందింది

400 టీఎంసీల నీరు.. 45 లక్షల ఎకరాలకు సాగునీరు

సంక్షేమంలో దేశంలోనే ప్రథమ స్థానం

రైతుబంధు దేశానికే ఆదర్శం

ధర్మపురి ఆలయ అభివృద్ధికి మరో 50 కోట్ల రూపాయలు

సాక్షి, జగిత్యాల: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ గురించి జయప్రకాశ్‌ నారాయణకు ఏం తెలుసు.. ఆయనది హఫ్‌ నాలెడ్జ్‌ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మంగళవారం ఆయన మేడిగడ్డ, సుందిళ్ల జలాశయాలతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టులను కూడా పరిశీలించారు. అనంతరం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. సజీవంగా కనిపిస్తోన్న గోదావరిని చూసి తన మనసు పులకిస్తోంది అన్నారు. గోదావరి నదిలోనే 100 టీఎంసీల నీరు నిండుకుండలా సజీవంగా ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో పంప్‌హౌస్‌ ఒక్కో ప్రాజెక్టుతో సమానమని చెప్పారు.

కాళేశ్వరం మల్టిపుల్‌ ప్రాజెక్ట్‌
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వల్ల అనుకున్న దాని కంటే ఎక్కువగా లాభం చేకూరనుంది అన్నారు కేసీఆర్‌. 25 ఏళ్లైనా పూర్తి కానటువంటి ప్రాజెక్ట్‌లను కేవలం మూడేళ్లలో పూర్తి చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా నికరంగా 400 టీఎంసీల నీరు లభిస్తుందని.. 45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తుందని తెలిపారు. ఆరునెలల పాటు నెలకు 60 టీఎంసీలు..  మిగతా సమయంలో నెలకు 40 టీఎంసీలు ఎత్తిపోస్తామని సీఎం వివరించారు. పరిశ్రమలు, ఇతర అవసరాల కోసం, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎల్లంపల్లి నుంచి తీసుకుంటామన్నారు. ప్రతి రోజు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లకి 3 టీఎంసీలు, మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్‌కు 2 టీఎంసీలు తీసుకుంటామని తెలిపారు.

ఎస్సారెస్పీలో ప్రస్తుతం 9.6 టీఎంసీల నీరు మాత్రమే ఉందన్నారు కేసీఆర్‌. అక్కడ నీరు లేనప్పుడు ఇక్కడి నుంచి వరదకాలువ ద్వారా పంపింగ్ చేస్తామన్నారు. వివిధ దశల్లో ఎత్తిపోస్తూ 350 మీటర్ల ఎత్తున ఉన్న మిడ్ మానేరుకు నీటిని తీసుకెళ్తామని తెలిపారు. కాళేశ్వరం మల్టిపుల్ ప్రాజెక్టని.. ఇప్పటి వరకు మొత్తం ప్రాజెక్టులో 65 శాతం సాఫల్యం వచ్చిందన్నారు కేసీఆర్‌.

కరెంట్‌ బిల్లు రూ. 4992 కోట్లు
400 టీఎంసీల కోసం ఏడాదికి రూ.4992 కోట్ల కరెంట్‌ బిల్లు ఖర్చవుతుందని కేసీఆర్‌ తెలిపారు. ఇది కూడా ప్రతి ఏటా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అహోరాత్రులు కష్టించి పనిచేసిన ఇంజినీరింగ్‌, నీటిపారుదల సిబ్బందిని కేసీఆర్‌ అభినందించారు. తుపాకుల గూడెం, సీతారామ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ప్రసుత్తం రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య లేకుండా చేసుకున్నామని.. అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు. మిషన్‌ భగీరథ మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నారు.

సంక్షేమంలో మనమే నంబర్‌.1
సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని కేసీఆర్‌ అన్నారు. వికలాంగులకు రూ.3,116 పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. కేసీఆర్‌ కిట్‌, కల్యాణ లక్ష్మి, వంటి ఎన్నో మంచి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు దేశం ఆశ్చర్యపోయేలా అమలు చేస్తున్నామన్నారు. మనల్ని ఆదర్శంగా తీసుకుని ఒడిషాలో రైతు బంధు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతుల అప్పులు తీరిపోయి మిగులు సాధించే వరకు రైతులకు ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామన్నారు. తాను బతికున్నంత కాలం రైతులకు కష్టం రానియనని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

ధర్మపురి ఆలయ అభివృద్ధికి మరో 50 కోట్లు
ఆలయ అభివృద్దికి ఇప్పటికే రూ. 50 కోట్లు కేటాయిస్తానని చెప్పాను అన్నారు కేసీఆర్‌. త్వరలోనే స్తపతులను రప్పించి కొంత స్థలం సేకరించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఆలయ అభివృద్ధికి మరో 50 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. ధర్మపురి గోదావరి తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని కేసీఆర్‌ పేర్కొన్నారు. అంతేకాక నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి రూ.10లక్షల నిధులు మంజూరు చేయనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. ధర్మపురి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రానికి రూ.25లక్షల ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నట్లు కేసీఆర్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు