పెండింగ్‌ రోడ్ల పనులు వెంటనే చేపట్టండి | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ రోడ్ల పనులు వెంటనే చేపట్టండి

Published Tue, Nov 22 2016 2:57 AM

పెండింగ్‌ రోడ్ల పనులు వెంటనే చేపట్టండి - Sakshi

♦ కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన సీఎం కేసీఆర్‌
♦ జాతీయ రహదారులకు లిఖితపూర్వక అనుమతులివ్వాలని వినతి
♦ భేటీ వివరాలను మీడియాకు వెల్లడించిన మంత్రి తుమ్మల
 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి పలు జాతీయ రహదారులను ఇస్తామని ప్రకటించినా ఇప్పటివరకు అనుమతులు ఇవ్వలేదని, అందుకు సంబంధించిన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్‌ సోమవారం గడ్కరీని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించిన పలు అంశాలపై గడ్కరీతో చర్చించారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి గతంలో సమర్పించిన డీపీఆర్‌లకు ఇంకా అనుమతులు రాలేదని... రహదారుల అథారిటీకి అప్పగించిన డీపీఆర్‌లకు అనుగుణంగా భూసేకరణకు అనుమతు లివ్వాలని కోరారు. రాష్ట్రంలో నాలుగు జాతీయ రహదారులను నాలుగు వరుసలుగా వెడల్పు చేయడానికి అనుమతుల మంజూరుపైనా చర్చించారు. అలాగే రాష్ట్రంలో నాలుగు ప్రధాన రహదారులను (సంగారెడ్డి– చౌటుప్పల్‌ 152 కి.మీ, చౌటుప్పల్‌–కండి 186 కి.మీ, మెదక్‌–ఎల్కతుర్తి 133 కి.మీ, హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు–కొత్తగూడెం 234 కి.మీ) జాతీయ రహదారులుగా ప్రకటిస్తూ వెంటనే అనుమతులు, ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.హైదరాబాద్‌లోని ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి ఎన్‌హెచ్‌–44ను విస్తరించాల్సి ఉందని, ఇందులో కొంత స్థలం రక్షణ శాఖ పరిధిలోని కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఉన్నందువల్ల అందుకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

అనంతరం సమావేశ వివరాలను మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మీడియాకు వివరించారు. రాష్ట్రంలో 650 కిలోమీటర్ల పొడవైన కొన్ని రహదారులను జాతీయ రహదారుల అథారిటీకి అప్పగించామని, వాటి నిర్మాణానికి భూసేకరణ చేయాల్సి ఉందని, కేంద్రం నుంచి త్వరగా అనుమతులిస్తే వాటి పనులు ప్రారంభిస్తామని తెలిపామన్నారు. గోదావరి నదిపై ఇన్‌లాండ్‌ వాటర్‌ వే వ్యవస్థ, డ్రైపోర్టుల ఏర్పాటు గురించి కూడా సీఎం కేసీఆర్‌ గడ్కరీతో చర్చించారని తుమ్మల తెలిపారు. ఈ అంశాలపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని... అనుమతుల మంజూరుకు వెంటనే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. గడ్కరీని కలసిన వారిలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రాంచంద్రు తేజావత్, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌ కుమార్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement