తెలంగాణలో ఆర్థిక సంక్షోభం:రాకేశ్‌రెడ్డి

23 May, 2019 02:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిపోయిందని, ఈ విషయాన్ని చర్చించటానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం కట్టాల్సిన బకాయిలే రూ.35 వేల కోట్లకు అంటే రికార్డు స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. భగీరథలోనే రూ.10 వేల కోట్ల బకాయిలున్నాయని, ఇక ఇరిగేషన్‌  శాఖలో మరొక  రూ.10 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయి ఉన్నట్లు చెప్పారు. ‘ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఆర్థిక పరిస్థితి  మీద వివరణ ఇవ్వాలి. దీన్ని సరిచేసేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి’  అని రాకేశ్‌ డిమాండ్‌ చేశారు.

ఆర్థిక పరిస్థితిపై అఖిలపక్షం: చాడ
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి చేసిన ప్రకటన వాస్తవాలను కప్పిపుచ్చేదిగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి అవాస్తవ ప్రకటనను తమ పార్టీ ఖండిస్తోందని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్థికస్థితి గురించి పారదర్శకంగా వ్యవహరించాలి అనుకుంటే ఆర్థిక నిపుణులు, అఖిలపక్ష పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తే ఆర్‌ అండ్‌ బీ, ఇరిగేషన్‌ కాంట్రాక్టర్లు పనులను ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలకు గౌరవ వేతనాలు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని చాడ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు