మోడీ వద్దకు పంచాయితీ! | Sakshi
Sakshi News home page

మోడీ వద్దకు పంచాయితీ!

Published Thu, Jun 19 2014 1:16 AM

మోడీ వద్దకు పంచాయితీ! - Sakshi

పోలవరంపై 26న కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీకి అఖిలపక్షం
ముంపు మండలాలపై ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించనున్న నేతలు
పీపీఏల విషయంలో ఏపీ ఏకపక్ష ధోరణిపైనా ప్రధానికి ఫిర్యాదు
వాటి రద్దు నిర్ణయం విభజన చట్టం స్ఫూర్తికి విరుద్ధమని వాదన
తెలంగాణకు ప్రత్యేక హోదా, ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదాకు విజ్ఞప్తులు
విభజన చట్టంలో పేర్కొన్న ప్రయోజనాలపైనా చర్చకు అవకాశం

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. కొత్త రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాలపైనా కే సీఆర్ చర్చించనున్నారు. పోలవరం ముంపు మండలాలపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించడంతో పాటు విద్యుత్ కేటాయింపుల విషయంలో పీపీఏలను రద్దు చే యాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై ప్రధానికి కేసీఆర్ ఫిర్యాదు చేయనున్నారు. అలాగే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో రాష్ట్రానికి ఉద్దేశించి పేర్కొన్న ప్రయోజనాలు, కేంద్ర సర్వీసు ఉద్యోగుల పంపిణీ, విద్యుత్ పంపిణీ, నీటి విడుదల, పన్ను మినహాయింపు తదితర విషయాలను కేంద్రం ముందుంచడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అఖిలపక్ష నేతలను వెంటబెట్టుకుని ఈ నెల 26న ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలపై ప్రత్యేక నివేదికలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పోలవరం ముంపు ప్రాంతాలైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తెలంగాణలోని రాజకీయ పక్షాలన్నీ ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ మేరకు శాసనసభలోనూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇదే విషయాన్ని కేసీఆర్ నేతృత్వంలోని అఖిలపక్ష నేతలు మోడీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇందుకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ను కోరినట్టు సమాచారం. అలాగే పీపీఏల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది రాష్ర్ట విభజన చట్టం స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడుతున్న కేసీఆర్ దీనిపై ప్రధానితో చర్చించాలని నిర్ణయించారు. పీపీఏల రద్దు వల్ల తెలంగాణ రాష్ర్టం సుమారు 540 మెగావాట్ల విద్యుత్‌నుకోల్పోవాల్సి వస్తోందని, ఇప్పటికే తీవ్ర విద్యుత్ కొరతతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి ఈ నిర్ణయం శరాఘాతంగా మారుతుందని మోడీకి ఆయన వివరించనున్నారు.
 
 ప్రత్యేక హోదాల మాటేంటి?
 పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినట్లే.. తెలంగాణ కోసం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి అఖిలపక్షం  విజ్ఞప్తి చేయనుంది. ఈ ప్రాజెక్టుతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని వివరించనుంది. అలాగే తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రం పారిశ్రామికంగా తీవ్రంగా నష్టపోతుందని, పన్ను మినహాయింపుల వల్ల పొరుగు రాష్ట్రాలకు పరిశ్రమలు తరలిపోయే అవకాశం ఉందని అఖిలపక్ష నేతలు తమ ఆందోళన వెలిబుచ్చనున్నారు. తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్నందున రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి పన్నుల్లోనూ ప్రోత్సాహాకాలు ఇవ్వాలని, రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి కల్పిస్తామన్న అన్ని రకాల ప్రయోజనాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఇక కేంద్ర సర్వీసుకు సంబంధించిన అధికారుల విభజన పట్ల కూడా కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం 44 ఐఏఎస్, 31 మంది ఐపీఎస్, 13 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులనే రాష్ట్రానికి కే టాయించారు. డిప్యూటేషన్‌పై ఉన్న 11 మంది అధికారులు ఈ నెలాఖరులోగా వెళ్లిపోనున్నారు. దాంతో పరిపాలన ఇబ్బందిగా మారనుంది. రాష్ర్టంలో పాలన ఇంకా గాడిలో పడకపోవడానికి అధికారుల విభజన పూర్తిగా జరగకపోవడమే ప్రధాన కారణమని మోడీకి కేసీఆర్ వివరించనున్నారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు.

Advertisement
Advertisement