పటాన్‌చెరులో ప్రచార వే‘ఢీ’ | Sakshi
Sakshi News home page

పటాన్‌చెరులో ప్రచార వే‘ఢీ’

Published Sun, Dec 2 2018 2:26 PM

 KCR, Yogi Adityanath, Will Participate In The Election Campaign - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆది వారం పటాన్‌చెరు నియోజకవర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతున్నారు. పటాన్‌చెరు పట్టణంలోని  మార్కెట్‌ యార్డు ఆవరణలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు. బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను పటాన్‌చెరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి శనివారం పరిశీలించారు. ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి సభా స్థలాన్ని, వేదికను పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులకు సూచనలు చేశారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో దుబ్బాక, గజ్వేల్, పటాన్‌చెరు మినహా అన్ని అసెంబ్లీ స్థానాల్లో కేసీఆర్‌ ఇప్పటికే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఈ నెల ఐదో తేదీ సాయంత్రం ప్రచారం ముగియనుండగా, ఆదివారం పటాన్‌చెరులో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ నెల 5న గజ్వేల్‌లో జరిగే బహిరంగ సభతో కేసీఆర్‌ తన ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు. ఆదివారం జరిగే బహిరంగ సభకు సంబంధించి జన సమీకరణపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహిపాల్‌రెడ్డి పార్టీ నేతలతో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు.


సంగారెడ్డి పట్టణంలో భారీ ర్యాలీ..
పటాన్‌చెరులో కేసీఆర్‌ సభ ముగిసిన తర్వాత సాయంత్రం సంగారెడి పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ సన్నాహాలు చేస్తోంది. బైక్‌ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు శనివారం సమీక్షించారు. సంగారెడ్డి కొత్త బస్టాండు, మదీనా మీదుగా పాత బస్టాండు సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించేలా టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తోంది. ర్యాలీ నిర్వహణకు సంబంధించి పార్టీ నేతలతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ శనివారం మధ్యాహ్నం సమావేశం అయ్యారు.


నేడు బీజేపీ బహిరంగ సభకు యోగి
సంగారెడ్డి పట్టణ శివారులోని మల్కాపూర్‌ వద్ద ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఈ సభకు హాజరవుతున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ సభ నిర్వహించిన ప్రదేశంలోనే సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. సుమారు 30వేల మందిని బహిరంగ సభకు సమీకరించాలని నిర్ణయించారు. పార్టీ అభ్యర్థి రాజేశ్వర్‌ రావు దేశ్‌పాండే, విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు శనివారం పరిశీలించారు.

సంగారెడ్డిలో బీజేపీ సభకు ఏర్పాట్లు
సంగారెడ్డి జోన్‌: సంగారెడ్డి పట్టణ శివారులోని మల్కాపూర్‌ వద్ద ఆదివారం భారీ బహిరంగ సభకు బీజేపీ నాయకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సభకు ముఖ్య అతిథిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హాజరవుతున్నారు. 30 వేల మంది హాజరయ్యేలా పార్టీశ్రేణులు ప్రణాళికలు రచించారు. బీజేపీ అనుబంధ సంఘాలు, జనసమీకరణలో తలమునకలు కాగా, సభా వేదిక వద్ద ఏర్పాట్లను ఇప్పటికే కనీస వేతనాల కమిటీ చైర్మన్‌ ఆవుల గోవర్దన్‌ తదితరులు పర్యవేక్షించారు. 

పటాన్‌చెరు టౌన్‌: పటాన్‌చెరులోని కొత్త మార్కెట్‌లో ఆదివారం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్‌ రానున్న దృష్ట్యా పార్టీ నేతలు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా కేసీఆర్‌ పటాన్‌చెరుకు చేరుకోనున్నారు. సభాస్థలికి సమీపంలో హెలిపాడ్‌ను ఏర్పాటు చేశారు. ఐదు రోజుల క్రితం మంత్రి హరీశ్‌రావు సభాస్థలి, హెలిపాడ్‌లను పరిశీలించి మాజీ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డికి పలు సూచనలు చేశారు.

సభా స్థలాన్ని శనివారం ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి, డీఎస్పీ రాజేశ్వర్‌ రావు, పటాన్‌చెరు సీఐ నరేష్, బీడీఎల్‌ సీఐ వేణు గోపాల్‌ రెడ్డి, ఎస్‌ఐలు ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, సత్యనారాయణ, కిష్టారెడ్డి, డాగ్‌స్క్వాడ్‌ పరిశీలించారు. సభాస్థలితో పాటు హెలిపాడ్‌ను పరిశీలించారు.

సభకోసం నలుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, 25మంది ఎస్‌ఐలు, 54మంది ఏఎస్‌ఐలు, 145మంది కానిస్టేబుళ్లతో పాటు కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహించనున్నారు. శని వారం ఉదయం హెలికాప్టర్‌ ట్రయల్‌రన్‌ నిర్వహించింది. సభకు వచ్చే వాహనాల పార్కింగ్‌ కోసం మైత్రి గ్రౌండ్, సాకి చెరువు పక్కన,  శ్రీనగర్‌ కాలనీలో జెడ్పీహెచ్‌ఎస్‌ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని గ్రౌండ్‌లో వాహనాలు పార్కింగ్‌ చేయనున్నారు.


 

1/1

సంగారెడ్డిలో సభా వేదిక వద్ద ఏర్పాట్లు , ఏర్పాట్లపై సూచనలు చేస్తున్న ఎస్పీ

Advertisement
Advertisement