కీసర ఎంపీపీ ఎన్నిక వాయిదా | Sakshi
Sakshi News home page

కీసర ఎంపీపీ ఎన్నిక వాయిదా

Published Fri, Jul 4 2014 11:57 PM

keesara MPP election postponed

కీసర:  కీసర మండల మండలాధ్యక్షుడి ఎన్నిక నాటకీయ పరిణామల మధ్య శుక్రవారం వాయిదా పడింది. మండల పరిషత్‌లో 20 ఎంపీటీసీ సభ్యులకు 15 మంది మెజారిటీ ఉన్నప్పటికీ ఎంపీపీ అభ్యర్థిని ఎకగ్రీవంగా ఎంపిక చేయడంలో పార్టీ అధిష్టానం పూర్తిగా విఫలమైంది. సీల్డ్‌కవర్ ద్వారా ప్రతిపాదించబడ్డ అభ్యర్థి రామారం సుజాతకు వ్యతిరేకంగా పార్టీ విప్‌ను ధిక్కరిస్తామని, ఎంపీపీ అభ్యర్థిగా యాద్గార్‌పల్లి ఎంపీటీసీ మల్లేష్‌కు మద్దతు ఇస్తామని దమ్మాయిగూడ గ్రామానికి చెందిన ముగ్గురు, అహ్మద్‌గూడా గ్రామానికి చెందిన ఇద్దరు, కీసర-3 ఎంపీటీసీలు ప్రకటించారు.

మరోవైపు ఎంపీపీ పదవిని ఆశించిన మరో ఎంపీటీసీ గోధుమకుంట ఎంపీటీసీ మంచాల పెంటయ్య, చీర్యాల ఎంపీటీసీ సంగీత సైతం కొమ్ము మల్లేష్‌కు మద్దతు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందనుకుంటుడగా బోగారం ఎంపీటీసీ మారారం సుజాత వెళ్లిపోయారు. తనను ఎంపీపీగా చేస్తామని హామీ ఇచ్చిన అధిష్టానం ఇప్పుడు మాట తప్పిందని నిరసన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అక్కడున్న వారికి ఫోన్ ద్వారా సమాచారమందించారు.

దీంతో కంగారు పడ్డ పార్టీ నేతలు ఎట్టకేలకు రామారం సుజాతను తిరిగి మండల పరిషత్‌కు తీసుకువచ్చారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికపై పార్టీలో తిరిగి వాదోపవాదాలు జరిగాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి తోట కూర జంగయ్య యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు కౌకుట్ల చంద్రారెడ్డి తదితరులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమయ్యారు. ఎంపీపీ ఎన్నిక వాయిదా పడేలా కోరం లేకుండా చూసుకున్న టీడీపీ నేతలు అక్కడి నుంచి ఎంపీటీసీలను తిరిగి క్యాంప్‌నకు తరలించారు.

 ఎన్నిక నేటికి వాయిదా..
 కోరం లేకపోవడంతో ఎంపీపీ ఎన్నికను శనివారం నాటికి వాయిదా వేస్తున్నట్లు మండల ప్రత్యేకాధికి విద్య, ఎంపీడిఓ నిరంజన్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి కోరం సభ్యులు ఉంటే సమావేశాన్ని నిర్వహిస్తామని, అది కూడా వీలుకాని పక్షంలో ఎన్నికల కమిషన్‌కు నివేదిక సమర్పించి, వారి ఆదేశాల మేరకు తదుపరి సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.  

 ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీటీసీలు..
 కీసర మండలంలో 20 మంది ఎంపీటీసీలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేకాధికారి విద్య ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

 కో ఆప్షన్ సభ్యుడిగా మహ్మద్‌గౌస్..
 మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్‌గా దమ్మాయిగూడ గ్రామానికి చెందిన ఎండి.గౌస్ ఎన్నికయ్యారు.

Advertisement
Advertisement