మన చరిత్రలో కీలక ‘పాత్ర’! | Sakshi
Sakshi News home page

మన చరిత్రలో కీలక ‘పాత్ర’!

Published Mon, Jun 5 2017 12:52 AM

మన చరిత్రలో కీలక ‘పాత్ర’!

పూర్వీకుల గుట్టువిప్పే ఆధారాలు
పాల్మాకుల, నర్మెట్ట తవ్వకాల్లో కీలక అవశేషాలు
మూడు వేల ఏళ్లకు పైవేనంటున్న పురావస్తు శాఖ


సాక్షి, హైదరాబాద్‌
వేల ఏళ్ల క్రితమే మధ్య ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రాంతానికి మానవుల వలస, అందులో కొన్ని తెగలు తిరిగి ఆయా ప్రాంతాలకు వెళ్లిపోయిన దాఖలాలపై అస్పష్టమైన సమా చారం గతంలోనే బయటపడింది. ఇప్పుడు దాన్ని నిరూపించే విలువైన పరిశోధన అవశేషాలను తెలంగాణ పురావస్తు శాఖ గుర్తించింది. కొద్ది రోజుల క్రితం సిద్దిపేట జిల్లా నంగునూను ప్రాంతంలోని నర్మెట్ట, పాల్మాకుల గ్రామ శివార్లలో జరిపిన తవ్వకాల్లో లభించిన అవశేషాలను అత్యంత విలువైనవని పురావస్తు శాఖ గుర్తించింది. ఇక్కడ లభించిన ఆదిమానవుల సమాధు లను తవ్వి కచ్చితమైన సమాచారాన్ని అందించే అవశేషాలు, అత్యంత అరుదైన పనిముట్లు, వాడుక సామగ్రిని సేకరించింది. వీటిని ప్రాథమికంగా పరిశీలించిన అధికారులు... తెలంగాణ పూర్వ చరిత్రలో కొత్త విశేషాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.

మధ్య ఆసియా నుంచి వలసలు..!

గతంలో సిద్దిపేట సమీపంలోని పుల్లూరు శివారులో జరిపిన తవ్వకాల్లో లభించిన ఎముకల డీఎన్‌ఏలను సీసీఎంబీ విశ్లేషించి ఇటీవలే నివేదిక సమర్పించింది. ఆ డీఎన్‌ఏ మూలాలు ప్రస్తుత మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన వ్యక్తుల డీఎన్‌ఏతో సరిపోలినట్టు తేల్చారు. అంటే మధ్య ఆసియా ప్రాంతం నుంచి వలస వచ్చిన వారు తెలంగాణ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నట్టు దాని ఆధారంగా గుర్తించారు. కానీ ఇప్పుడు ఆ డీఎన్‌ఏ జాడ మళ్లీ ఇక్కడ గుర్తించలేదు. అంటే.. వలస వచ్చిన వారు తిరిగి వెళ్లిపోయారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

తాజాగా జరిపిన తవ్వకాల్లో అలాంటి వాటిని నివృత్తి చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తాజా తవ్వకాల్లో ఓ కుండలో మనిషికి సంబంధించి ఏమాత్రం చెక్కు చెదరని పుర్రె సహా ఇతర ప్రధాన ఎముకలు భద్రంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇన్ని అవశేషాలు ఎక్కడా దొరకలేదు. ఈ ఎముకల డీఎన్‌ఏలను తేల్చేందుకు త్వరలో సీసీఎంబీ రెండో విడత పరిశోధనలు ప్రారంభించనుంది. ఈ వస్తువులను గన్‌ఫౌండ్రిలోని పురావస్తు శాఖ సంచాలకుల కార్యాలయం ఆవరణలో ఉన్న శ్రీశైలం పెవిలియన్‌ మ్యూజియంలో వారం రోజుల పాటు ప్రజల సందర్శనకు ఉంచారు.

గది.. అందులో మరో గది.. అవశేషాలు
ఇక తవ్వకాల్లో వెలుగు చూసిన సమాధి నిర్మాణం కూడా ప్రత్యేకంగా ఉంది. తిరగేసిన స్వస్తిక్‌ ఆకృతిలో... గది, అందులో మరో గది నిర్మించి దానిలో అవశేషాలు భద్రపరిచి ఉన్నాయి. గతంలో ఈ తరహా నిర్మాణం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తొలిసారి కనుగొన్నారు. ‘ఓ మనిషికి చెందిన పూర్తి ఎముకల నిర్మాణం ఓ కుండలో భద్రంగా ఉంది. ఇప్పటి వరకు అలాంటి అవశేషాలు లభించలేదు. భవిష్యత్తు పరిశోధనలకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఎముకలతో చేసిన ఆభరణాలు కూడా తొలిసారిగా దొరికాయి’అని పురావస్తు శాఖ సంచాలకులు విశాలాచ్చి పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement