ఖేడ్‌లో వేడెక్కుతున్న రాజకీయం | Sakshi
Sakshi News home page

ఖేడ్‌లో వేడెక్కుతున్న రాజకీయం

Published Sun, Feb 7 2016 2:14 AM

Khed high tension politicized

పెరుగుతున్న నేతల మధ్య మాటలవేడి
తూటాల్లా పేలుతున్న ప్రసంగాలు

నారాయణఖేడ్ : ఉప ఎన్నిక పోరు వేడెక్కింది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి రగులుతోంది. అన్ని పార్టీల నుంచి రాష్ర్టస్థాయి నేతలు నారాయణఖేడ్ బాట పట్టారు. పోలింగ్‌కు వారం రోజుల సమయమే ఉండడంతో అన్ని పార్టీల నాయకులూ ఖేడ్‌లో మకాం పెట్టారు. ఈనెల 13న పోలింగ్ జరగనుంది. 11తో ప్రచార పర్వం ముగుస్తుంది. ఇప్పటివరకు హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసిన నాయకులు ఆ ఎన్నికలు ముగియడంతో ఖేడ్ ఉప ఎన్నికలో  సత్తా చాటేందుకు ఖేడ్ పట్టణంలో అడ్డా బిటాయించారు. అన్ని పార్టీల నాయకులు నారాయణఖేడ్ చేరుకొని ప్రచార వాగ్బాణాలు సంధిస్తున్నారు. జోరుమీదున్న కారు..

 ఎమ్మెల్యే కిష్టారెడ్డి హఠాన్మరణంతో నారాయణఖేడ్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించేందుకు  సుమారు ఆరునెలల సమయం పట్టింది. ఈలోగా టీఆర్‌ఎస్ నాయకులు, మంత్రి హరీశ్‌రావు నాలుగైదు నెలల ముందు నుంచే  నారాయణఖేడ్‌కు వస్తూ పోతూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆయన పర్యటనలు, పనుల వేగం పెంచారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే ఆయన పూర్తిగా నారాయణఖేడ్‌పైనే దృష్టి సారించారు. వారం రోజులుగా ఆయన నిత్యం 15 గ్రామాల్లో పర్యటిస్తున్నారు.

మంత్రితోపాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సైతం ముమ్మర పర్యటనలు చేస్తున్నారు.  వీరు నియోజకవర్గంలో సుమారు 30రోజుల నుంచి పర్యటిస్తున్నారు. ఈనెల 10న సీఎం కేసీఆర్ వస్తున్నందున భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ తరఫున ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, బాబూమోహన్, జెడ్పీ చైర్మన్ రాజమణి , టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ తదితరులు పర్యటిస్తున్నారు.

 రంగంలో కాంగ్రెస్, టీడీపీ అగ్రనేతలు.. కాంగ్రెస్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలు సభల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి పాల్గొన్నారు. వీరితోపాటు డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, జగ్గారెడ్డి, శశిధర్‌రెడ్డి, గంగారాం పర్యటిస్తున్నారు. టీడీపీ తరఫున రేవంత్‌రెడ్డి పర్యటనలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం ప్రచారం నిర్వహించారు. వీరితోపాటు  పార్టీకి చెందిన రమరణ, మోత్కుపల్లి నర్సింహులు, వంటేరు ప్రతాపరెడ్డి, శశికళ పర్యటిస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అన్ని పార్టీల నేతల మాటలు తూటాల్లా పేలుతూ మరింత వేడి పుట్టిస్తున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement