ఇక ఆన్‌లైన్‌లో పాస్‌పోర్టు విచారణ | Sakshi
Sakshi News home page

ఇక ఆన్‌లైన్‌లో పాస్‌పోర్టు విచారణ

Published Mon, May 4 2015 1:52 AM

know Online In the Passport inquiry

మోర్తాడ్ : పాస్‌పోర్టు పొందాలనుకునే దరఖాస్తు దారుడికి ఇక ఇబ్బందులు తొలగనున్నాయి. విదేశాంగ శాఖ, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల  పాస్‌పోర్టు విచారణ ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే పూర్తి కానుంది. గతంలో మా దిరిగా పాస్‌పోర్టు విచారణకు 10 నుంచి 15 రోజుల సమయం పట్టే అవకాశం లేదు. కేవలం మూడు రోజుల్లో పాస్‌పోర్టు విచారణకు సంబంధించిన తంతు పూర్తి కానుంది. దీంతో దరఖాస్తుదారుడికి పాస్‌పోర్టు కోసం ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. పాస్‌పోర్టు దరఖాస్తులకు సంబంధించిన వివరాలను స్పెషల్ బ్రాంచ్ అధికారులు పరిశీలించి తమకు ప్రభుత్వం అందించిన ఐ ప్యాడ్ ద్వారా విచారణ ఆంశాలను ఆన్‌లైన్‌లో పాస్‌పోర్టు కార్యాలయానికి పంపాల్సి ఉంది.

జిల్లాలోని స్పెషల్ బ్రాంచ్ అధికారులకు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ప్రభుత్వం అందించిన ఐ ప్యాడ్‌లను అందజేశారు. స్పెషల్ బ్రాంచ్ అధికారులు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లి అక్కడే ఫోటో తీసుకుని వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో పొందుపరిచిన వెంటనే ఉన్నతాధికారులు వివరాలను పరిశీలించి ఆమోదం తెలపడమా లేక పెండింగ్‌లో ఉంచడమా తేల్చుతారు. వివరాలు అన్ని సక్రమంగా ఉంటే మూడు రోజుల్లోనే పాస్‌పోర్టు తయారుకానుంది. మాన్యువల్ పద్ధతిలో విచారణ జరపడం వల్ల కాలయాపన ఎక్కువగా జరిగేది. ఒక్కోసారి పాస్‌పోర్టు చేతికి అందడానికి మూడు నెలల సమయం పట్టేది. ఇప్పుడు అన్ని వివరాలు సక్రమంగా ఉంటే ఎలాంటి వివాదం లేకుంటే కేవలం పదిహేను రోజుల్లో పాస్‌పోర్టు చేతికి అందుతుంది.
 
ఠాణాలకు ఐ ప్యాడ్‌లు...
స్పెషల్ బ్రాంచ్ అధికారులకు ఐ ప్యాడ్‌లను అందించిన విధంగానే ప్రభుత్వం పోలీసు స్టేషన్‌లకు ఐ ప్యాడ్‌లను సరఫరా చేసింది. ఠాణాల పరిధిలో చోటు చేసుకునే సంఘటనలను, విచారణకు సంబంధించిన వివరాలు, రాస్తారోకో,ధర్నా తదితర సంఘటనలను ఈ ఐ ప్యాడ్‌లో రికార్డు చేయడానికి ప్రభుత్వం ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు కేటాయించింది. ఐ ప్యాడ్‌లను ఎస్‌హెచ్‌ఓ అధీనంలో ఉం చుతారు. ఐ ప్యాడ్‌లను వినియోగించడం వల్ల పోలీసులకు సంబంధించిన సేవ లు పారదర్శకంగా జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Advertisement
Advertisement